అఫ్గాన్‌- భారత్‌ వాణిజ్యంపై ఎఫెక్ట్‌..?ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులివే..

Afghanistan situation to impact trade with India: అఫ్గాన్‌లోని ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌- అఫ్గాన్‌ మధ్య వాణిజ్యంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.

Updated : 16 Aug 2021 21:38 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అష్రఫ్‌ ఘనీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అంతమైంది. త్వరలో తాలిబన్ల శకం మరోసారి ప్రారంభం కానుంది. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతేకాదు అఫ్గాన్‌లోని ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌- అఫ్గాన్‌ మధ్య వాణిజ్యంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.

అఫ్గాన్‌- భారత్‌ మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.52 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్‌ ఎగుమతుల వాటా 826 మిలియన్‌ డాలర్లు కాగా.. అఫ్గాన్‌ వాటా 510 మిలియన్‌ డాలర్లు ఉంది. కిస్మిస్‌‌, వాల్‌నట్స్‌, బాదం, పిస్తా, పైన్‌ నట్స్‌, చెర్రీ, పుచ్చకాయలు సహా పలు ఆయుర్వేద మూలికలను భారత్‌ అఫ్గాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడి నుంచి తేయాకు, కాఫీ, మిరియాలు, పత్తి వంటివి ఎగుమతి అవుతున్నాయి.

అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై ఇక్కడి ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అఫ్గాన్‌ పరిస్థితుల ప్రభావం తప్పకుండా ఉంటుందని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎగుమతిదారులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (FIEO) డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ పేర్కొన్నారు. పూర్తిగా వాణిజ్యం నిలిచిపోయే అవకాశం లేదని, వారికి ఇక్కడి వస్తువులు అవసరం ఉందని FIEO మాజీ అధ్యక్షుడు ఎస్‌కే సరాఫ్‌ అభిప్రాయపడ్డారు.

అఫ్గాన్‌కు ముఖ్యంగా వాయు మార్గంలోనే ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి కాబట్టి వాణిజ్యంపై ప్రభావం తప్పకుండా ఉంటుందని FIEO ఉపాధ్యక్షుడు ఖలీద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. పరిస్థితులు కుదుటపడ్డాక మాత్రమే వాణిజ్యం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగుమతులన్నీ దాదాపు ఆగిపోతాయని జేఎన్‌యూలో అర్థశాస్త్ర ఆచార్యులు బిస్వజిత్‌ ధార్‌ పేర్కొన్నారు. భారత్‌ నుంచి అఫ్గాన్‌కు పూర్తిగా ఎగుమతులు ఆగిపోతాయని, ముఖ్యంగా సకాలంలో చెల్లింపుల సమస్యగా మారుతుందని అఫ్గాన్‌కు ఎగుమతులు చేసే ఓ కంపెనీ యజమాని రాజీవ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని