Updated : 23 Dec 2020 17:26 IST

విదేశీ క‌రెన్సీని అనుమ‌తించే ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాలు

భార‌త్‌, అమెరికా దేశాల మ‌ధ్య ద్ర‌వ్యోల్బ‌ణంలో తేడాలతో పాటు ఇత‌ర అంశాలు క‌ల‌గ‌లిసి డాల‌రుతో పోల్చిన‌ప్పుడు రూపాయి విలువ దీర్ఘ‌కాలంలో క్ర‌మంగా క్షీణిస్తూ వ‌స్తోంది. ఇలా రూపాయి క్షీణ‌త‌తో విదేశీ క‌రెన్సీలో పెట్టుబ‌డుల‌పై రూపాయ‌ల్లో చూసుకుంటే అధిక రాబ‌డులు వ‌స్తున్నాయి. స్థిరాస్తి, భార‌తీయ ఈక్విటీ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు కాకుండా ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల‌లో పెట్టుబ‌డి కూడా మంచి మాధ్య‌మంలా క‌నిపిస్తుంది. 

ప‌రిమిత విదేశీ క‌రెన్సీతో బ్యాంకు ఖాతా తెరిచేందుకు విదేశీ మార‌క నిర్వ‌హ‌ణ చ‌ట్టం(ఫెమా) అనుమ‌తిస్తోంది. వీటినే ఫారిన్ క‌రెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్ఆర్‌) ఖాతాలుగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాలలో వివిధ అంశాల‌ను ఇప్పుడు చూద్దాం…

ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల‌ ప్రాథ‌మిక ల‌క్ష‌ణాలు

 • ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాలు ఫిక్స్‌డ్ డిపాజిట్లగానే అనుమ‌తిస్తారు. ఎన్‌.ఆర్‌.ఓ, ఎన్‌.ఆర్‌.ఇ ఖాతాల మాదిరిగా సేవింగ్స్‌, క‌రెంట్ ఖాతాలుగా తెరిచే వెసులుబాటు లేదు. ఎన్‌.ఆర్‌.ఇ ఖాతాకు ఉప ఖాతా త‌ర‌హాలో ఎఫ్‌సీఎన్ఆర్ ప‌నిచేస్తుంది.
 • భార‌త్ రూపాయ విలువ‌లోకి సులువుగా మార‌కం చేసుకోగలిగే, నిర్దేశించిన విదేశీ క‌రెన్సీతోనే ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల‌ను తెరిచేందుకు అవ‌కాశం ఉంటుంది.
 • సింగ‌పూర్ డాల‌ర్‌, ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్‌, అమెరిక‌న్ డాల‌ర్‌, స్టెర్లింగ్ పౌండ్‌, కెన‌డియ‌న్ డాల‌ర్‌, జ‌ప‌నీస్ యెన్ త‌దిత‌ర విదేశీ క‌రెన్సీల‌ను ఈ ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల్లో అనుమ‌తిస్తారు.
 • ఒక‌టి నుంచి అయిదేళ్ల మ‌ధ్య కాలావాధుల్లో డిపాజిట్ల‌ను అనుమ‌తిస్తున్నారు.
 • ముంద‌స్తు న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై పెనాల్టీ చెల్లించాల్సి రావ‌చ్చు. అంటే ఖాతాలో సొమ్ముపై వర్తించే వడ్డీ మొత్తాన్ని తగ్గించి చెల్లిస్తారు.
 • ఏడాదిలోపు ఖాతాలోని సొమ్మును ఉప‌సంహ‌రించ‌ద‌ల‌చుకుంటే ఎటువంటి వ‌డ్డీని జ‌మ‌చేయ‌రు.
 • వ్య‌క్తిగ‌త‌, వ్యాపార అవ‌స‌రాల‌కు ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల‌పై రుణాల‌ను పొందేందుకు వీలుంది. కానీ వ్య‌వ‌సాయ భూమిని కొనేందుకో, స్థిరాస్తి వ్యాపారం చేసేందుకు రుణం ల‌భించ‌దు. అయితే భార‌త్‌లో మీరు నివ‌సించేందుకు సొంత ఇంటిని కొనుగోలు చేయాల‌నుకుంటే మాత్రం రుణం మంజూరు చేస్తారు.

ఖాతా తెరిచే విధానం

 • భార‌తీయ పౌరుడెవ‌రైనా ఫెమా చ‌ట్టాన్ని అనుస‌రించి ప్ర‌వాస భార‌తీయుడిగా గుర్తింపు పొందినట్ట‌యితే ఫారిన్ క‌రెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్ఆర్‌) ఖాతా తెరిచేందుకు అనుమ‌తిస్తున్నారు.
 • వీళ్లే కాకుండా మ‌న దేశ పౌర‌స‌త్వం లేనివారు, భార‌తీయ మూలాలున్న వ్య‌క్తులై ఉన్నా చాలు ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతా తెర‌వ‌వ‌చ్చు.
 • ఒక్క‌రే ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతా తెర‌వ‌వ‌చ్చు లేదా ఉమ్మ‌డి ఖాతాను మ‌రొక‌రితో క‌లిసి ప్రారంభించ‌వ‌చ్చు. అయితే ఉమ్మ‌డి భాగ‌స్వామి కూడా ఎన్.ఆర్.ఐ అయి ఉండాల‌న్న నిబంధ‌న ఉంది.
 • బంధువులెవ‌రైనా ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాకు ఉమ్మ‌డి భాగ‌స్వామిగా ఉండ‌వ‌చ్చు. అయితే అది ఫోర్మ‌ర్ అండ్ స‌ర్వైవ‌ర్ బేసిస్ విధానంలోనే సాధ్య‌మ‌వుతుంది. అంటే భాగ‌స్వామిగా ఉన్న ఎన్‌.ఆర్‌.ఐ వ్య‌క్తికి అనుకోకుండా ఏదైనా జ‌రిగితే ఆ వ్య‌క్తి స్థానంలో వేరొక‌రు ఎన్‌.ఆర్‌.ఐ కాక‌పోయినా భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు.
 • ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాకు నామినీగా ఎన్‌.ఆర్‌.ఐనే నియ‌మించాల‌నే నిబంధ‌న లేదు. భారతీయ పౌరుడైన బంధువునో, స్నేహితునో నామినీగా నియమించవచ్చు.

ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాలో న‌గ‌దు జ‌మ‌

ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాలో న‌గ‌దు జ‌మ ప‌లు ర‌కాలుగా చేయ‌వ‌చ్చు…

 • భార‌త్ వెలుప‌ల బ్యాంకింగ్ చాన‌ల్ ద్వారా ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాలో న‌గ‌దు జ‌మ‌చేయ‌వ‌చ్చు.
 • సొంత‌ ఎన్ఆర్ఈ ఖాతా నుంచి ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ చేయ‌వ‌చ్చు.
 • ఇత‌ర ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతా నుంచి సొంత ఖాతాకు సొమ్ము బ‌దిలీ చేయ‌వ‌చ్చు
 • విదేశీ క‌రెన్సీలో ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా చెక్కు డ్రా చేసుకొని జమ చేయడం.
 • భార‌త్‌లో ప్ర‌యాణించేట‌ప్పుడు ట్రావెల‌ర్ చెక్కులు, విదేశీ క‌రెన్సీతో ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల్లో జ‌మ‌చేయ‌వ‌చ్చు.

ప్ర‌త్య‌క్షంగా ఉండాల‌న్న నియ‌మం లేదు

 • ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతా తెరిచే వారు ప్ర‌త్య‌క్షంగా భార‌త్‌లో ఉండాల‌న్న నియ‌మం లేదు.
 • ఎన్‌.ఆర్‌.ఐలు ఈ ఖాతాల‌ను ఓవ‌ర్‌సీస్ శాఖ‌ల్లో తెర‌వ‌వ‌చ్చు. అయితే పాస్‌పోర్టు కాపీ, విదేశీ నివాస చిరునామా లాంటి కొన్ని ప్రాథ‌మిక డాక్యుమెంట్ల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

వ‌డ్డీ రేటు, ఎక్స్ఛేంజీ రేటు

 • ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాకు సంబంధించి క‌రెన్సీని బ‌ట్టి వ‌డ్డీరేటు వేర్వేరుగా ఉంటుంది.
 • భార‌త్‌లో స్థానికులు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీరేటుతో పోలిస్తే ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాకు జ‌మ‌చేసే వ‌డ్డీ సాధార‌ణంగా త‌క్కువే ఉంటుంది.
 • అయితే ఎన్‌.ఆర్‌.ఐలు ఏ దేశంలో ఉంటారో ఆ దేశ డిపాజిట్ రేట్ల‌తో పోలిస్తే మాత్రం ఇటువంటి ఖాతాల్లో వ‌డ్డీ ఎక్కువే జ‌మ‌చేస్తారు.
 • విదేశీ క‌రెన్సీని ఈ ఖాతాలో జ‌మ‌చేస్తారు కాబ‌ట్టి విదేశీ మార‌క‌పు రేట్ల‌ మార్పులతో న‌ష్ట‌భ‌యంపై ఎటువంటి ప్ర‌భావం చూపించ‌దు.
 • అటు ఎక్స్ఛేంజీ రేట్ రిస్క్‌ను నివారించ‌డంతో పాటు ఇటు వ‌డ్డీ రేట్లు స్వ‌ల్పంగా అధికంగా ఉండ‌టం ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాదారుల‌కు క‌లిసొచ్చే విష‌యం.
 • ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాలో జ‌మ అయ్యే వ‌డ్డీ, అస‌లు మొత్తాన్ని భార‌త్ వెలుప‌లికి రీపాట్రియేష‌న్ విధానంలో త‌ర‌లించేందుకు ఎటువంటి అభ్యంత‌రాల‌ను ఆర్‌బీఐ వ్య‌క్తంచేయ‌దు.
 • ఈ ఖాతాలో జ‌మ అయ్యే వ‌డ్డీని ఎన్.ఆర్‌.ఓ లేదా ఎన్‌.ఆర్‌.ఇ ఖాతాల‌కు మ‌ళ్లించుకునే అవ‌కాశం ఉంటుంది.

పూర్తి ప‌న్ను మిన‌హాయింపు

 • ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాకు జ‌మ అయ్యే వ‌డ్డీపై భార‌త్‌లో పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఇస్తున్నారు. అయితే ఖాతాదారులు నివ‌సించే దేశ ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ప‌న్ను చెల్లించే అవ‌స‌రం ఏర్ప‌డ‌వ‌చ్చు.
 • ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతా క‌లిగి ఉండి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎఫ్‌సీఎన్ఆర్ ఖాతాల మెచ్యూరిటీ తీరేంత‌వ‌ర‌కు వ‌డ్డీపై ఎలాంటి ప‌న్ను విధించ‌బోరు.
 • ఈ సౌల‌భ్యం ఎన్‌.ఆర్‌.ఇ ఖాతాల‌కు లేదు. ఫెమా ప్ర‌కారం ఎన్‌.ఆర్‌.ఐ నుంచి స్థానిక హోదాకు మారిన వెంట‌నే ఎన్‌.ఆర్‌.ఇ ఖాతాలోని సొమ్ముపై ప‌న్ను వ‌ర్తించ‌డం మొద‌ల‌వుతుంది. ఎఫ్‌సీఎన్ఆర్ ఈ విష‌యంలో మాత్రం కాస్త‌ మెరుగ్గా క‌నిపిస్తుంది.

పెట్టుబ‌డి అవ‌కాశాల కోసం చూసే ఎన్‌.ఆర్‌.ఐల‌కు ఈ వ్యాసం ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని భావిస్తున్నాం.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని