ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు ఎందుకు త‌గ్గాయి?

వార్షికంగా చూస్తే 2018 జనవరి నాటి నుంచి ఈక్విటీ ఫండ్ల‌ పెట్టుబ‌డులు 60% క్షీణించాయి....

Updated : 01 Jan 2021 19:01 IST

​​​​​​​మ్యూచువల్ ఫండ్ల ద్వారా వ‌చ్చే ఈక్విటీ పెట్టుబ‌డులు అక్టోబర్ 2018 నుంచి వరుసగా నాలుగు నెలలు త‌క్కువ‌గా ఉన్నాయి. 2018 అక్టోబరులో రూ. 12,622 కోట్ల రూపాయలు, 2018 నవంబర్లో రూ. 8,414 కోట్లు, 2018 జనవరిలోరూ. 6,606 కోట్ల రూపాయలు, 2019 జనవరిలో రూ. 6,158 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్ 2018 నుంచి 51శాతం పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. వార్షికంగా చూస్తే 2018 జనవరి నాటి నుంచి మ్యూచువల్ ఫండ్ల‌ ఈక్విటీ పెట్టుబ‌డులు 60% క్షీణించాయి. సిప్ ద్వారా ప‌వ‌చ్చే పెట్టుబ‌డులు మాత్రం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2018 నుంచి జనవరి 2019 నాటికి 20 శాతం పెరుగుదలతో రూ. 8,064 కోట్లకు చేరింది.

ఎందుకు మార్పు?
గ‌త‌ 1-1.5 సంవత్సరాలలో మిడ్ క్యాప్ ఫండ్లలో మ‌దుప‌ర్లు ఎక్కువ‌గా పెట్టుబడి పెట్టారు. అయితే ఇవి అంత‌గా రాణించ‌లేదు. కొన్ని 15-20 శాతం వ‌ర‌కూ తగ్గుముఖం పట్టాయ‌ని మిరా అస్సేట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వరూప్ మొహంతి అన్నారు. హైబ్రిడ్ ఫండ్లు డివిడెండ్లు ఇవ్వ‌డం కూడా నిలిపివేసాయి. హైబ్రిడ్ ఫండ్ల‌లో కూడా నిధులు ఉప‌సంహ‌ర‌ణ ఎక్కువ‌గా జ‌రిగిందని నిపుణులు చెబుతున్నారు. గ‌త మూడు సంవత్సరాల మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచిన‌ తర్వాత, మిడ్ క్యాప్స్ గత ఏడాదిలో బాగా నిరుత్సాహ‌ప‌రిచాయి.

అయితే మ‌దుప‌ర్లు ఆందోళన చెందాల్సిన‌ అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. స్థూలంగా ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరంగానే ఉంది. రూపాయి, చమురు ధ‌ర‌, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నాయి, జీఎస్టీ ద్వారా ప్ర‌భుత్వానికి ప‌న్ను ఆదాయం బావుంది. విదేశీ నిధుల ప్రవాహం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకిపెరిగాయి. రాబోయే త్రైమాసికానికి ఆదాయాల అంచనాలు కూడా పెరిగాయి. ఇటీవలి ఈక్విటీల‌పై వ‌చ్చిన రాబ‌డి ఆధారంగా పెట్టుబడిదారులు దూరంగా ఉండేందుకు అవ‌కాశం ఉంది. అయితే ఇలాంటి స‌మ‌యాల్లో ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం మంచిది నిర్ణ‌యం అని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని