Amazon: భారత్‌లో అమెజాన్‌ అధిపతికి ఈడీ సమన్లు!

భారత్‌లో అమెజాన్‌ అధిపతి అమిత్‌ అగర్వాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది...

Updated : 28 Nov 2021 17:01 IST

దిల్లీ: భారత్‌లో అమెజాన్‌ అధిపతి అమిత్‌ అగర్వాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌, అమెజాన్‌ మధ్య కుదిరిన ఒప్పందంలో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ విచారణ జరపనుంది. ఈ ఒప్పందం అమలులో ‘విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)’లోని నిబంధనలను ఉల్లంఘించినట్లు జనవరిలో అమెజాన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య ఇప్పటికే కోర్టు వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటీవలే దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు ఒప్పందాలు- ఫ్యూచర్‌ కూపన్స్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ వాటాదారుల ఒప్పందం; అమెజాన్‌తో ఫ్యూచర్‌ కూపన్స్‌ ఒప్పందం; అమెజాన్‌తో ఫ్యూచర్‌ కూపన్స్‌ షేరు సబ్‌స్క్రిప్షన్‌ ఒప్పందాన్ని కోర్టు పరిశీలించింది. ఆ తర్వాత అమెజాన్‌ ప్రభుత్వ అనుమతి లేకుండానే ఫ్యూచర్‌ రిటైల్‌పై నియంత్రణాధికారం సంపాదించినట్లు ప్రాథమికంగా అర్థమవుతోందని అభిప్రాయపడింది. ఇది ఫెమా, ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనేని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం.

సమన్లు అందినట్లు అమెజాన్‌ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే, వాటిని ఇంకా క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత స్పందిస్తామన్నారు. ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కానీ, అమెజాన్‌ దాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం కోర్టుల్లో ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని