మహీంద్రా ప్లాంట్‌ల వార్షిక నిర్వహణ ముందుకు

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్లాంట్‌ల వార్షిక నిర్వహణ మూసివేత పనులను ముందుకు తీసుకొచ్చినట్లు వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది. వాస్తవానికి నాలుగు రోజుల పాటు నిర్వహించే

Published : 04 May 2021 01:32 IST

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్లాంట్‌ల వార్షిక నిర్వహణ మూసివేత పనులను ముందుకు తీసుకొచ్చినట్లు వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది. వాస్తవానికి నాలుగు రోజుల పాటు నిర్వహించే వార్షిక నిర్వహణ పనులు జూన్‌లో జరగాల్సి ఉండగా.. కరోనాను దృష్టిలో ఉంచుకుని మేలో పూర్తిచేయనున్నట్లు తెలిపింది. ఉద్యోగులు, భాగస్వాములు, ఇతర వ్యవస్థల భద్రత, ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు వివరించింది. మహీంద్రా అటోమోటివ్‌ విభాగానికి చకన్‌, నాసిక్‌, కండివాలీ, జహీరాబాద్‌, హరిద్వారాల్లో తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి. ఇప్పటికే మారుతీ, హీరో, ఎంజీ మోటార్‌, హోండా మోటార్‌సైకిల్‌, సుజుకీ మోటార్‌సైకిల్‌లు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

విక్రయానికి మళ్లీ యాహూ, ఏఓఎల్‌!
 ఈ సారి 5 బిలియన్‌ డాలర్లకు

న్యూయార్క్‌: ఒకప్పటి ఇంటర్నెట్‌ దిగ్గజాలు ఏఓఎల్‌, యాహూలు మళ్లీ అమ్ముడుపోనున్నాయి. ఈ రెండు కంపెనీలను నిర్వహించే వెరిజాన్‌ మీడియాను అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ అనే ప్రైవేటు ఈక్విటీ సంస్థకు 5 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.37,500 కోట్లు)కు వెరిజాన్‌ విక్రయించనుంది. కొత్త కంపెనీ ‘యాహూ’లో 10 శాతాన్ని అట్టేపెట్టి ఉంచుకోనున్నట్లు వెరిజాన్‌ సోమవారం తెలిపింది. ఇంటర్నెట్‌ ప్రారంభ రోజుల్లో ఈ రెండు కంపెనీలూ ఒక వెలుగు వెలిగాయి. అయితే గూగుల్‌, ఫేస్‌బుక్‌ల రాకతో పోటీని తట్టుకోలేక వెనకబడ్డాయి. ఏఓఎల్‌పై ఆశలతో 2015లో ఆ కంపెనీని వెరిజాన్‌ 4 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసింది. రెండేళ్ల తర్వాత అంతకు మించి ఖర్చుతో యాహూను కొనుగోలు చేసి రెండింటినీ విలీనం చేసింది. సోమవారం నాటి ఒప్పందం ప్రకారం.. వెరిజాన్‌కు 4.25 బిలియన్‌ డాలర్ల నగదు, 750 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు, మైనారిటీ వాటా దక్కుతుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ ఒప్పందం పూర్తి కావొచ్చు.
బఫెట్‌ వారసుడు గ్రెగ్‌ అబెల్‌!
ప్రపంచ కుబేరుడు, బెర్క్‌షైర్‌హాత్‌వే అధిపతి అయిన వారెన్‌ బఫెట్‌ వయసు ఇపుడు 90 ఏళ్లు. ఆయన తర్వాత కంపెనీకి ఎవరు చూసుకుంటారన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. ఒక వేళ ఆ స్థానం నుంచి తప్పుకుంటే బెర్క్‌షైర్‌ హాత్‌వే వైస్‌ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ అబెల్‌ తన వారసుడిగా కొనసాగుతారని బఫెట్‌ ఇటీవల పేర్కొన్నారు. తన స్థానాన్ని అబెల్‌(58)తో భర్తీ చేయడానికి బోర్డు అంగీకరించిందని బఫెట్‌ సైతం ఒక ఆంగ్ల ఛానల్‌కు తెలిపారు. చాలా కాలం నుంచి వారసుడి పేర్లలో అబెల్‌ పేరు నానుతోంది. అయితే వారసత్వ నిర్ణయాలను ఈ కంపెనీ చాలా రహస్యంగా ఉంచుతుంది. తమ వద్ద ఇందుకు సంబంధించి సవివరణ ప్రణాళిక ఉందని మదుపర్లకు సైతం గతంలోనే చెప్పింది. మరో వైస్‌ ఛైర్మన్‌ అజిత్‌ జైన్‌(69)ను సైతం ఇందుకు పరిశీలించినా.. వయసు కీలకంగా మారుతోందని బఫెట్‌ వివరించారు. వారిద్దరూ అద్భుత వ్యక్తులని యాభైఏళ్ల పాటు వారిని గమనిస్తూ వచ్చిన బఫెట్‌ ఈ సందర్భంగా అన్నారు. బెర్క్‌షైర్‌ వైస్‌ ఛైర్మన్‌ చార్లీ ముంగర్‌(97) సైతం శనివారం నాటి వార్షిక సమావేశంలో గ్రెగ్‌ గురించి ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని