రిలయన్స్‌తో డీల్‌ బ్రేక్‌.. భారత్‌లో కొత్త పెట్టుబడుల యోచనలో ఆరామ్‌కో!

భారత్‌లో కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని సౌదీకి చెందిన ఆరామ్‌కో సంస్థ తెలిపింది.

Published : 22 Nov 2021 17:05 IST

దిల్లీ: భారత్‌లో కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని సౌదీకి చెందిన ఆరామ్‌కో సంస్థ తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో డీల్‌ ఆగిపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. భారత్‌లో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయంటూ ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ కీలక భాగస్వామ్యంతో ఇప్పటికే ఉన్న ఉప్పందం పునః పరిశీలనతో పాటు, కొత్త పెట్టుబడి అవకాశాలనూ పరిశీలిస్తామంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను ఉద్దేశించి ఆరామ్‌కో పేర్కొంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన ఆయిల్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌, ఆయిల్‌ రిటైలింగ్‌ వ్యాపారంలో కొంత వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించాలని కొంతకాలం క్రితం నిర్ణయించిన విషయం విదితమే. దీని ప్రకారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న  రెండు రిఫైనరీల్లో, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో 20 శాతం, ఆయిల్‌ రిటైలింగ్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన బ్రిటీష్‌ పెట్రోలియం (బీపీ)లో 51 శాతం వాటా సౌదీ ఆరామ్‌కోకు ఇవ్వాలి. ఈ లావాదేవీ గత ఏడాది మార్చి నాటికే పూర్తికావలసి ఉండగా.. కరోనా మహమ్మారి వల్ల జాప్యం అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘వ్యాపార పరిస్థితులు మారిన నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని తిరిగి పరిశీలించాలని నిర్ణయించాం’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరామ్‌కో నుంచి ఈ ప్రకటన వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని