బీమా తో పెట్టుబడి మంచిదేనా?

బీమాకి , పెట్టుబడికి వేరు వేరు లక్షణాలు, పద్ధతులు, అనుకూలతలు, ప్రతికూలతలు , నియమ నిబంధనలు ఉంటాయి.

Published : 27 Dec 2020 20:09 IST

సాధారణంగా 22-25 ఏళ్ల వయసు నుంచే సంపాదన మొదలుపెడతాం . అప్పటినుంచే కొంత సొమ్ముని పొదుపు చేయడం మొదలుపెడతాం. పొదుపు చేయడానికి మనకు ముందుగా గుర్తొచ్చేవి పొదుపు ఖాతా, దగ్గరలో తెలిసిన వాళ్ల దగ్గర చిట్ ఫండ్, జీవిత బీమా పాలసీ. ఆ వయసులో ఎలా ఎక్కడ ఎంత పొదుపు చేయాలో అవగాహన ఉండదు. ఎందుకంటే ఆర్ధిక లక్ష్యాల గురించి కూడా అవగాహన ఉండదు. ఈ సమయంలోనే మనకు తేలికగా, తొందరగా అవగాహనకు వచ్చేవి బీమా , చిట్ ఫండ్ పెట్టుబడులు. బీమా ఏజెంట్లు చెప్పే లెక్కలు మనకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే కొద్దీ పాటి సొమ్ముని ప్రస్తుత లెక్కలలో ఆలోచిస్తాము కాబట్టి .

ఉదా : ఎండోమెంట్, హోల్ లైఫ్ , మనీ బ్యాక్ , యూలిప్ వంటి పాలసీలు వినడానికి చాలా బాగుంటాయి. అయితే భవిష్యత్తులో వాటి విలువ, వచ్చిన రాబడి చూసుకుంటే , కనీసంగా ఉంటాయి. అయితే అప్పటికే చాలా కాలం నష్ట పోతాము. మారుతున్న కాలాని, జీవన విధానానికి, జీవన ప్రమాణాలకు పధకాలు కూడా మారతాయి. ప్రస్తుత రోజులలో మొబైల్ ఇంటర్నెట్ సదుపాయంతో దేశంలోని ఏ మూల నుంచైనా సమాచారం పొందవచ్చు. ఆర్ధిక నిపుణుల సలహాలను కోరవచ్చు. రెండవ అభిప్రాయం తెలుసుకోవచ్చు.

ఉదా : ఒక వ్యక్తి రూ 5 లక్షల బీమా హామీతో 15 సంవత్సరాల పాలసీ తీసుకుని వార్షిక ప్రీమియం రూ 30 వేలు చెల్లిస్తే , 15 ఏళ్ల తరువాత హామీ మొత్తం , బోనస్ , అదనపు లాభాలు కలిపి వచ్చే రాబడి 5 - 6 శాతం గా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని ప్రరిగణనలోకి తీసుకుంటే , రాబోయే మొత్తం భవిష్యతు అవసరాలకు సరిపోవు.
అలాగే చాలా బీమా సంస్థలు వివిధ రకాల పేర్లతో వివిధ హామీ మొత్తాలకు, వివిధ కాల పరిమితులకు, సొమ్ము తిరిగివచ్చే విధంగా పధకాలను ప్రవేశ పెడుతున్నారు. ఇవి పాలసీదారులను ఆకర్షణీయంగా అనిపిస్తాయి.
ఉదా: 10 నుంచి 12 ఏళ్ళు ప్రీమియం కట్టండి, 13 నుంచి 25 వ ఏడాది వరకు ప్రతి ఏడాది కొంత సొమ్ము కచ్చితంగా పొందండి. వీటిలో కూడా జీవిత బీమా హామీ చాలా తక్కువ , రాబడి కూడా తక్కువే. ఎందుకంటే మొదటి సంవత్సర ప్రీమియం నుంచి 35 శాతం, రెండవ ఏడాది నుంచి 7.5 శాతం వరకు బీమా ఏజెంట్ కమిషన్ కింద చెలిస్తారు . అవికాక బీమా కంపెనీ ఖర్చులు పోగా దీర్ఘకాలంలో 5-6 శాతం మాత్రమే రాబడి ఉంటుంది.

వీటి అనుకూలతలు:
మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు ప్రీమియం ఒకేలా ఉండటం.

ప్రతికూలతలు:

  • మనం నిర్దిష్ట కాలానికి నిర్దిష్టమైన మొత్తాన్ని ప్రీమియంగా చెల్లిస్తాము. మధ్యలో చెల్లించకపోతే పాలసీ రద్దు అయ్యే అవకాశం ఉంది. పునరుద్ధరణకు రుసుము చెల్లించాల్సి రావచ్చు.

  • నిర్దిష్ట మొత్తం వస్తుంది, కానీ అప్పటి అవసరాలకు సరిపోక పోవచ్చు.

  • ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే భవిష్యతులో తీసుకోబోయే మొత్తం విలువ చాలా తక్కువగా ఉంటుంది. కారణం రాబడి 5-6 శాతం లోపు ఉండటం.

మరి వీటికి బదులుగా జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీని తీసుకోవచ్చు. దీనిలో తక్కువ ప్రీమియం తో ఎక్కువ బీమా హామీని పొందవచ్చు. పెరుగుతున్న ఆదాయానికి తగినట్లుగా అదనపు పాలసీలను తీసుకోవచ్చు. సాధారణంగా వార్షిక ఆదాయానికి 10-15 రేట్లు ఉండేటట్లు తీసుకోవాలి. కచ్చితమైన వివరాలను తెలపాలి. 30 ఏళ్ల వ్యక్తి వార్షిక ప్రీమియం రూ 5-6 వేలతో, రూ 50 లక్షల వరకు హామీని పొందవచ్చు.

మిగిలిన ప్రీమియంను పీపీఎఫ్ లో మదుపు చేయవచ్చు. అలాగే ప్రీమియంలో కొంత మొత్తాన్ని మంచి రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. వీటి అనుకూలతలు, ప్రతికూలతలు ఏమిటో చూద్దాం:

అనుకూలతలు:

పీపీఎఫ్: మదుపు ఫై వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే జమ అయ్యే వడ్డీపై, నగదు ఉపసంహరణలపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. సరాసరి వార్షిక రాబడి 8 శాతం . మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆర్ధిక లక్ష్యాలకు ఎంతో ఉపయోగపడుతుంది.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: ప్రీమియం లో కొంత మొత్తాన్ని నెలనెలా సిప్ ద్వారా మదుపు చేయవచ్చు. దీర్ఘకాలంలో 10-12 శాతం వరకు రాబడి ఆశించవచ్చు. మదుపరులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పన్ను విధానాలను మారుస్తూ ఉంటుంది.

ప్రతికూలతలు:

పీపీఎఫ్: నిర్దిష్ట మొత్తం జమ చేయాల్సిన అవసరం లేనందున , పొదుపు వాయిదా వేసే అవకాశం ఉంటుంది.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: స్వల్పకాలంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురువుతాయి . దీనివల్ల కొత్తగా మదుపు చేసే వారు నిరాశకు గురి అయి, మధ్యలోనే మదుపు ఆపివేసె అవకాశం ఉంటుంది.

ముగింపు:
సంపాదన మొదలైన నాటి నుంచే సరైన పథకాల్లో మదుపు చేయడం వలన దీర్ఘకాలంలో మంచి సంపద చేకూర్చుకోవచ్చు. కష్టపడి సంపాదించిన సొమ్ముకు విలువ ఇవ్వాలంటే సరైన పధకాలను ఎంచుకోవాలి. మనకు ఏవి ఉపయోగపడేవి, సాధ్యపడేవి తెలుసుకోవాలి. ముందు ఆర్భాటంగా ప్రారంభించి మధ్యలో ఆపేయటంవలన అసలుకే నష్టం రావచ్చు.

బీమా పాలసీలను బీమా గానే చూడాలి గానీ పెట్టుబడి కోణంలో చూడకూడదు. బీమాకి , పెట్టుబడికి వేరు వేరు లక్షణాలు, పద్ధతులు, అనుకూలతలు, ప్రతికూలతలు , నియమ నిబంధనలు ఉంటాయి. బీమా పాలసీల ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవాలి. జీవిత బీమా కోసం టర్మ్ పాలసీ మాత్రమే తీసుకోవడం మంచిది. అవసరమైతే, ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని