హామీ సంతకం చేస్తున్నారా?

హామీ ఇస్తున్నామంటే మనకీ కొన్ని బాధ్యతలు ఉంటాయన్న సంగతి మర్చిపోవద్దు

Published : 23 Jan 2021 16:33 IST

కాస్త హామీ సంతకం చేస్తారా? ఈ ప్రశ్న మీ మిత్రుడో…దగ్గరి బంధువో అడిగితే మీరేం చేస్తారు. వెంటనే అంగీకరిస్తారు కదూ! గృహ, వాహన రుణాలు, వ్యాపారానికి పెద్ద మొత్తం లో అప్పు తీసుకునే వారి విషయం లో కొన్ని సార్లు బ్యాంకులు, రుణ సంస్థలు ఎవరినైనా హామీగా చూపించాలని అంటుంటాయి. నమ్మకమైన స్నేహితుడికి, బంధువుల కోసం హామీగా ఉండటం లో ఇబ్బంది లేదు. హామీ ఇస్తున్నామంటే మనకీ కొన్ని బాధ్యతలు ఉంటాయన్న సంగతి మర్చిపోవద్దు. అందుకే, సరే అనే ముందు మీ పై ఉండే ప్రభావం ఏంటో తెలుసుకోవాలి. ఏ విషయంలో అయినా మధ్యవర్తిగా ఉన్నామంటే అర్ధం…ఇరువైపులా ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీరుస్తామని. రుణ గ్రహీత సమయానికి బాకీ చెల్లించేలా చూసుకునే బాధ్యత హామీదారుడిదే. ఒకవేళ ఆటను రుణాన్ని చెల్లించని సందర్భంలో హామీగా ఉన్న వ్యక్తి ఆ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రుణ గ్రహీత కు అనుకోనిది ఏదైనా జరిగినా…బ్యాంకులు హామీగా ఉన్న వ్యక్తిని సంప్రదిస్తాయి. బాకీ తీర్చే ఏర్పాటు చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత హామీదారుడిదే. ఇది రుణ ఒప్పంద పత్రం మీద ఆధార పది ఉంటుంది. కాబట్టి, హామీ ఇచ్చేప్పుడు నిబంధనలు ఏమంటున్నాయో తెలుసుకోండి.

ఇతరుల రుణానికి హామీ ఇచ్చిన సంగతి ‘సిబిల్’ నివేదిక కూడా నమోదు అవుతుంది. రుణాల విషయాన్నితెలియజేసే స్థలం లో మీరు హామీగా ఉన్న రుణ మొత్తం పేర్కొంటారు. రుణగ్రహీత నెలవారీగా ఆ రుణాన్ని ఎలా తీరుస్తున్నాడన్న అంశాన్ని బట్టి మీ రుణ చరిత్ర ప్రభావితం అవుతుంది. ఒకవేళ రుణ గ్రహీత వాయిదాల చెల్లింపులు సరిగ్గా చేయకపోయినా, మొత్తంగా ఆపేసినా మీ క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం లేకపోలేదు. కాబట్టి, సరే! అని సంతకం చేయగానే సరిపోదు. రుణం తీసుకున్న వ్యక్తి ఎప్పటికప్పుడు వాయిదాలు చెల్లిస్తున్నాడా లేదా అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ అతడు చెల్లించకపోతే మీ బాధ్యత ఏమిటో ముందే తెలుసుకోండి.

ఏం చేయాలంటే..

బ్యాంకు, రుణ సంస్థ విధించిన నిబంధనలు ఏమిటన్నది తెలుసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ లేదా సగం నింపిన పత్రాల మీద సంతకం చేయకండి. అవసరమైతే న్యాయ సలహాలు తీసుకోండి. ఏదైనా నిబంధన విషయాల్లో భవిష్యత్తులో మీకు ఇబ్బంది కావచ్చు అనిపించినా, దాని పై మీకు అభ్యంతరాలు ఉన్నా సంతకం చేయవద్దు. మీ ఫోటో, గుర్తింపు వివరాలను నేరుగా రుణ సంస్థకు, అధీకృత వ్యక్తికీ మాత్రమే అందించండి. రుణం తీసుకోబోయే వ్యక్తికీ ఇవ్వడం అంత క్షేమం కాదు. హామీ ఇవ్వడం అంటే అదనపు బాధ్యతలు తీసుకోవడమే. అందుకే, ముందుగా మీ రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు తెలుసుకోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని