అమెరికా విపణికి అరబిందో ఫార్మా ఔషధం

‘డ్రోక్సిడోపా’ జనరిక్‌ క్యాప్సూల్స్‌ను అమెరికా విపణిలో విక్రయించడానికి అరబిందో ఫార్మా అనుమతి సంపాదించింది.

Updated : 20 Feb 2021 07:46 IST

ఈనాడు, హైదరాబాద్‌

‘డ్రోక్సిడోపా’ జనరిక్‌ క్యాప్సూల్స్‌ను అమెరికా విపణిలో విక్రయించడానికి అరబిందో ఫార్మా అనుమతి సంపాదించింది. మగత, అదే తరహా లక్షణాలు ఉంటే.. చికిత్సలో ఈ ఔషధాన్ని సిఫారసు చేస్తారు. ఇది లుండ్‌బెక్‌ ఎన్‌ఏ లిమిటెడ్‌ సంస్థకు చెందిన నార్తెరా క్యాప్సూల్‌కు జనరిక్‌ ఔషధం. యూఎస్‌ మార్కెట్లో గత ఏడాది కాలంలో ఈ ఔషధం 352 మిలియన్‌ డాలర్ల అమ్మకాలు నమోదు చేసింది. ఈ జనరిక్‌ ఔషధాన్ని 100 ఎంజీ, 200 ఎంజీ, 300 ఎంజీ డోసుల్లో విక్రయించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చిందని, త్వరలో దీన్ని అక్కడ విడుదల చేస్తామని అరబిందో ఫార్మా వర్గాలు వెల్లడించాయి.


8 మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లపై
రూ.2,000 కోట్ల పెట్టుబడులు: ఐనాక్స్‌ గ్రూప్‌
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకటి

ముంబయి: ఐనాక్స్‌ గ్రూప్‌నకు చెందిన ఇండస్ట్రియల్‌ అండ్‌ మెడికల్‌ గ్యాసెస్‌ బిజినెస్‌ డివిజన్‌ ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రోడక్ట్స్‌ తమ సామర్థ్యాన్ని 50 శాతం మేర పెంచుకోనుంది. వచ్చే 36 నెలల్లో రూ.2,000 కోట్ల పెట్టుబడులతో 8 ఎయిర్‌ సెపరేషన్‌ యూనిట్లను వివిధ రాష్ట్రాల్లో నెలకొల్పుతామని తెలిపింది. దేశంలోని ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ రంగంలోకి వస్తున్న అతి పెద్ద కొత్త పెట్టుబడి ఇదే కావడం గమనార్హం. కొత్తగా విస్తరించబోతున్న 8 తో కలిపి మొత్తం ప్లాంట్ల 50కి చేరుకుంటాయని, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సామర్థ్యం కూడా 50 శాతం మేర పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం రోజుకు 3,330 టన్నుల సామర్థ్యం ఉండగా, ఇది 4,800 టన్నుల సామర్థ్యానికి చేరుతుందని అంచనా. ప్రతిపాదిత గ్యాస్‌ ప్లాంట్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయబోతోంది. బెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో మిగతా ప్లాంట్లు రాబోతున్నాయి. వచ్చే 12 నెలల్లో తొలి ప్లాంటును తమిళనాడు లేదా గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నామని కంపెనీ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ వెల్లడించారు.
* ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ కంపెనీని పుణెలో 1963లో ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన ఎయిర్‌ ప్రోడక్ట్స్‌ అండ్‌ కెమికల్స్‌ 1999లో ఇందులో 50 శాతం వాటా కొనుగోలు చేసింది. అప్పట్నుంచి కంపెనీ పేరును ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రోడక్ట్స్‌గా మార్చారు.


కరెన్సీ డెరివేటివ్స్‌ మార్కెట్లు పని చేయలేదు

ముంబయి: ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి సందర్భంగా దేశీయ కరెన్సీ డెరివేటివ్స్‌ మార్కెట్లు శుక్రవారం పని చేయలేదు.


సంక్షిప్తంగా

* బడ్జెట్‌పై స్పందనలు తెలుసుకునేందుకు తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. టీవీఎస్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, ఎంఆర్‌ఎఫ్‌ ఛైర్మన్‌ మామెన్‌, ఇండియా సిమెంట్స్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ తదితరులు ఇందులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని