Auto sales: కొవిడ్‌ ఢీ.. కార్ల అమ్మకాలు బోల్తా!

కరోనా సెకండ్‌ వేవ్‌ జనజీవనంపైనే కాదు.. ఆటో మొబైల్‌ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి, లాక్‌డౌన్‌ ఆంక్షల అమలు కారణంగా...

Updated : 01 Jun 2021 21:44 IST

మే నెలలో భారీగా తగ్గిన విక్రయాలు

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ జనజీవనంపైనే కాదు.. ఆటో మొబైల్‌ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి, లాక్‌డౌన్‌ ఆంక్షల అమలు కారణంగా భారీగా అమ్మకాలు క్షీణించాయి. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మే నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, టయోటా ఇలా దాదాపు అన్ని సంస్థలూ అమ్మకాల్లో క్షీణత నమోదు చేశాయి.

* దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విక్రయాలు మే నెలలో భారీగా క్షీణించాయి. ఏప్రిల్‌ నెలలో 1,59,691 యూనిట్లు విక్రయించగా.. మే నెలలో 46,555 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. అమ్మకాలు దాదాపు 71 శాతం క్షీణించాయి. మే 1 నుంచి 16 వరకు కంపెనీ ప్లాంట్లలో ఆక్సిజన్‌ తయారీ వినియోగించడంతో ఉత్పత్తి సైతం ఆ మేర నిలిచిపోయింది.

* హ్యుందాయ్‌ విక్రయాలు సైతం 49 శాతం పడిపోయాయి. ఏప్రిల్‌ నెలలో 49,002 యూనిట్లు విక్రయించిన ఈ సంస్థ మే నెలలో 25,001 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది.

* టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 40 శాతం మేర క్షీణించాయి. ఏప్రిల్‌లో 25,091 యూనిట్లు విక్రయించిన ఈ కంపెనీ మే నెలలో 15,181 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

* మహీంద్రా అండ్‌ మహీంద్రా సైతం మే నెలలో 8,004 యూనిట్లు విక్రయించింది. మే నెలతో పోలిస్తే 56 శాతం మేర అమ్మకాలు తగ్గాయి.

* టయోటా కిలోస్కర్‌ కేవలం 707 యూనిట్లు విక్రయించింది. మే నెలలో తమ ప్లాంట్లలో ఎలాంటి ఉత్పత్తీ జరగలేదని పేర్కొంది. 

* హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ 2,032 వాహనాలు విక్రయించింది. ఎంజీ మోటార్స్‌ సైతం 1016 వాహనాలను మాత్రమే విక్రయించింది. కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల అమ్మకాలు క్షీణించాయని, జూన్‌లో అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని