బ్యాంక్ వ‌డ్డీ రేటును మించుతున్న‌ రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణ రేటు

ఇపుడు బ్యాంక్‌ల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేస్తే వ‌చ్చే వ‌డ్డీ రాబ‌డి క‌న్నా ద్ర‌వ్యోల్బ‌ణం ఎక్కువ అవుతుంది.

Updated : 13 Oct 2021 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త‌న తాజా ద్ర‌వ్య విధాన స‌మీక్ష‌లో ప్ర‌స్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 5.3 శాతంగా అంచ‌నా వేసింది. ఇప్పుడు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేస్తే వ‌చ్చే వ‌డ్డీ రాబ‌డి క‌న్నా ద్ర‌వ్యోల్బ‌ణం ఎక్కువ అవుతుంది. దీంతో డిపాజిట‌ర్ల‌కు వ‌డ్డీ గిట్టుబాటు అవ్వ‌క‌పోగా అస‌లు డిపాజిట్‌తో వ‌డ్డీ క‌లిపి అందుకున్నా దాని విలువ త‌క్కువే. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో 1 సంవ‌త్స‌రం నుంచి 2 సంవ‌త్స‌రాల సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు వ‌డ్డీ 5% శాతంగా ఉంది. రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 5.3 శాతంగా అంచ‌నా. దీంతో పొదుపుదారుడికి వాస్త‌వ వ‌డ్డీ రేటు -0.3 శాతంగా అవుతుంది. దీంతో బ్యాంక్ వినియోగ‌దారుల‌కు బ్యాంకు వ‌డ్డీ గిట్టుబాటు అవ్వ‌క‌పోగా వారికి వ‌చ్చే రాబ‌డి తగ్గుతుంది. అయితే బ్యాంక్ ఎఫ్‌డీల‌ నుంచి పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాల‌కు డ‌బ్బును త‌ర‌లించ‌డం వ‌ల్ల మామూలుగానే కాస్తా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. ప్ర‌స్తుతం పోస్టాఫీసుల్లో వ‌డ్డీ రేట్లు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి కొద్దిగా ఎక్కువ‌గా 5.5%, కొన్ని ప‌థ‌కాల్లో దీనికి మించి వ‌డ్డీ రేట్లు ఉన్నాయి.

2-3 సంవ‌త్స‌రాల అధిక కాల వ్య‌వ‌ధికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా కూడా ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ద్ర‌వ్యోల్బ‌ణం 5.3% ఉంటే, బ్యాంకులో 5.10% వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇది ముఖ్యంగా రిస్క్ చేయ‌డం ఇష్టం లేని, భ‌ద్ర‌త అనుస‌రించి బ్యాంకుల‌నే న‌మ్ముకున్న సాధార‌ణ వినియోగ‌దారుల‌కు, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. ప్రైవేట్ రంగంలో పేరుమోసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా 1-2 సంవ‌త్స‌రాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల‌కు 4.9% వ‌డ్డీ రేటును అందిస్తుండ‌గా, 2-3 సంవ‌త్స‌రాల‌కు 5.15% వ‌డ్డీ రేటును అందిస్తోంది. ఒక సంవ‌త్స‌రం డిపాజిట్‌పై 5% కంటే త‌క్కువ వ‌డ్డీ రేటు ప్ర‌తికూల ప్ర‌తిఫ‌లాన్ని సూచిస్తుంది. ఆశించిన ద్ర‌వ్యోల్బ‌ణ రేటును కూడా క‌వ‌ర్ చేయ‌దు.

బ్యాంకులు అందించే సేవింగ్స్‌ బ్యాంక్ వ‌డ్డీ రేటు సుమారు 2.75%గా ఉంది. ఈ బ్యాంక్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు పెరుగుద‌ల త‌క్కువ‌గా ఉండ‌టంతో మెరుగైన రాబ‌డుల కోసం మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ఈక్విటీల వంటి ప్ర‌త్యామ్నాయాల‌ను ఇన్వెస్ట‌ర్స్ కోరుకుంటున్నారు. వీటిలో రిస్క్ ఉన్నా అసాధార‌ణ‌మైన వృద్ధిని కొద్ది నెల‌ల నుంచి క‌న‌బ‌రిచాయి. అయితే మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో, ఈక్విటీల‌లో పెట్టుబ‌డి పెట్టేవారు మార్కెట్ల‌ను బాగా స్ట‌డీ చేయాల్సి ఉంటుంది. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏడాది పైన కాల పరిమితి గల డిపాజిట్ల మీద 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. వాటిని కూడా పరిశీలించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని