మారితే లాభ‌ముంటుందా!

బ్యాంకింగ్ అకౌంట్ నంబ‌రు పోర్ట‌బులిటీతో బ్యాంకు ఖాతాను ఒక బ్యాంకు నుంచి మ‌రో బ్యాంకుకు బ‌దిలీ చేసుకునే స‌దుపాయం వినియోగ‌దార్ల‌కు చేకూరుతుంది...

Published : 15 Dec 2020 20:22 IST

టెలికం రంగంలో వ‌చ్చిన మొబైల్ నంబ‌రు పోర్ట‌బులిటీ ప‌థ‌కం లానే బ్యాంకింగ్ అకౌంట్ నంబ‌రు పోర్ట‌బులిటీ విధానాన్ని అమ‌లు చేసే విష‌యంలో దృష్టి పెట్టాల్సిందిగా ఇటీవ‌లె రిజ‌ర్వు బ్యాంకు ప్ర‌తిపాదించింది. ఈ విధానం అమ‌లైతే వినియోగ‌దార్ల‌కు మెరుగైన సేవ‌లు పొందే అవ‌కాశం ఉందా? ఏ మాత్రం లాభం చేకూరే అవ‌కాశం ఉంటుంది? ఖాతాను బ‌దిలీచేసేందుకు ఏం చేయాలి? మొద‌లైన ప్ర‌శ్న‌లు వినియోగ‌దార్ల ముందున్నాయి. ఈ విష‌యాల గురించి తెలుసుకుందాం.

వినియోగ‌దార్లు త‌మ ఖాతాను ఒక బ్యాంకు నుంచి వేరొక బ్యాంకుకు ఎటువంటి మార్పులు లేకుండా మార్చుకునే అవ‌కాశం బ్యాంకింగ్ అకౌంట్ పోర్ట‌బులిటీతో సాధ్యం. అయితే ఇది ఎంత వ‌ర‌కూ వినియోగ‌దార్ల అవ‌స‌రాల‌ను తీరుస్తుంద‌నేది ఆలోచించుకోవాలి. మొబైల్ నంబ‌రు పోర్ట‌బులిటీ ప‌థ‌కం ద్వారా చాలా మంది వినియోగ‌దార్లు ఒక నెట్ వ‌ర్క్ నుంచి మ‌రో నెట్ వ‌ర్క్ కు త‌మ క‌నెక్ష‌న్ల‌ను మార్చుకుంటున్నారు. అయితే బ్యాంకింగ్ రంగంలో అలాంటి ప‌థ‌కం వినియోగ‌దార్ల‌కు ల‌బ్ధి చేకూరుస్తుందా! అనేది చూసుకోవాలి. మొబైల్ నంబ‌రు పార్ట‌బులిటీలో త‌క్కువ ఛార్జీలు వ‌సూలు చేసే వారు, మంచి ఆఫ‌ర్లు ఇచ్చే వారికి వ‌ద్ద‌కు మొబైల్ వినియోగ‌దార్లు త‌మ నంబ‌రు మార్చుకుంటున్నారు. మొబైల్ నంబ‌రులో అన్ని నెట్‌వ‌ర్క్ ల‌కు 10 సంఖ్య‌లు మాత్ర‌మే ఉంటాయి. పెద్ద‌గా స‌మ‌స్యలు త‌లెత్త‌వు.

అన్నిబ్యాంకు ఖాతా సంఖ్యలు ఒకేలా ఉండ‌వు.

బ్యాంకింగ్ ఖాతా విష‌యంలో అన్ని బ్యాంకుల‌ ఖాతా సంఖ్య‌లు ఒకేలా ఉండ‌వు. బ్యాంకు ఖాతాలో చాలా ముఖ్య‌మైన ఆర్థిక స‌మాచారం ఉంటుంది కాబ‌ట్టి భ‌ద్ర‌త‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటారు. అందుకే ఖాతా సంఖ్య 11నుంచి 16 సంఖ్య‌ల వ‌ర‌కూ ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో ర‌క‌మైన‌న విధానంలో ఖాతాసంఖ్య‌లు ఏర్ప‌రుచుకుంటాయి. ఈ విధానం అమ‌లైతే వినియోగ‌దార్లు బ్యాంకుల‌ను సంప్ర‌దించ‌కుండా నేరుగా త‌మ‌ ఖాతాను వేరోక బ్యాంకుకు బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

ఇప్ప‌టికే ఉన్న‌వి…

యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ ద్వారా బ్యాంకింగ్ మరింత సులువుగా మారింది. దీనికి ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ కోడ్ లాంటివేవి అవ‌స‌రంలేకుండాల‌నే చాలా సుల‌భంగా లావాదేవీలు చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఖాతా సంఖ్యకు ముందు మొబైల్ నంబ‌రు, ఆధార్ నంబ‌రు లేదా ఏదైనా పేరును చేర్చుకోవ‌చ్చు. మొబైల్ నంబ‌ర్@ ,యూపీఐఆధార్ నంబ‌రు @ యూపీఐ, పేరు@ యూపీఐ మొద‌లైన‌వి. దీంతో ఖాతాను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. ఇంకా ఆర్టీజీఎస్, ఐఎమ్‌పీఎస్ చెక్కు త‌దిత‌రాల ద్వారా బ్యాంకు నిధుల‌ను ఒక బ్యాంకునుంచి వేరొక బ్యాంకు కు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగు, ఎల‌క్ట్రానిక్ క్లియ‌రింగ్ స‌ర్వీసు (ఈసీఎస్) విధానాల్లో వేరొక ఖాతాకు చెల్లింపులు చేయ‌వ‌చ్చు. బ్యాంకింగ్ అకౌంట్ పోర్ట‌బులిటీ రాక‌తో ఇప్పుడున్న వాటికంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందే అవ‌కాశం ఉండ‌ద‌నే చెప్పాలి. ఈ విధానం ద్వారా క్యాపిటివ్ క్ల‌యింట్ల‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూరుతుంది.

బ‌దిలీ చేస్తే భారం వినియోగ‌దారునిపైనే

బ్యాంకింగ్ రంగంలో 21 వేర్వేరు బ్యాంకింగ్ లైసెన్సులు క‌లిగిన‌ సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి. వీటి బ్యాంకు ఖాతా సంఖ్య‌లు దాదాపు స‌రిపోల‌వు. ఈ విధానం ద్వారా బ‌దిలీ చేసేందుకు అయ్యే ఖ‌ర్చు వినియోగ‌దారునిపై ప‌డుతుంది. దీనికి బ‌దులుగా రిజ‌ర్వుబ్యాంకు బ్యాంకు ఖాతా తెర‌వ‌డం లేదా మూసివేయ‌డానికి సంబంధించిన సిఫార్సులు చేయాలి. ముందుగా ఒప్పందంచేసుకున్న వాటికి త‌ప్ప నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఖాతాలు మూసివేసినందుకు పెనాల్టీల విధింపుకు సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని