బ్యాంకు రుణాలు భారీగా తీసుకుంటారు

బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణ వృద్ధి సుమారు రెండింతలు అయ్యే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 10 శాతానికి చేరొచ్చని అభిప్రాయపడింది. ఆర్థిక రికవరీ, విధాన జోక్యంతో ఇది సాధ్యం కాబోతోందని తెలిపింది.

Published : 02 Apr 2021 01:52 IST

రెండింతలయ్యే అవకాశం
2021-22లో 10 శాతానికి చేరొచ్చు: క్రిసిల్‌

ముంబయి: బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణ వృద్ధి సుమారు రెండింతలు అయ్యే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 10 శాతానికి చేరొచ్చని అభిప్రాయపడింది. ఆర్థిక రికవరీ, విధాన జోక్యంతో ఇది సాధ్యం కాబోతోందని తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) ఈ ఆర్థిక సంవత్సరంలో 10.5-11 శాతానికి చేరతాయని పేర్కొంది. గతంలో అంచనా వేసిన దాని కంటే తాజాగా 1 శాతం ఎన్‌పీఏల అంచనాల్ని తగ్గించింది. క్రిసిల్‌ అంచనాలు ఇవీ..

* స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 11 శాతం నమోదు కావొచ్చు. 2020-21లో ఇది 7.7 శాతం క్షీణతను నమోదు చేయవచ్చు.
* రెండు, మూడో దశ కొవిడ్‌-19 విజృంభణతో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉన్నా, ఇది విస్తృతమైన లాక్‌డౌన్‌లకు దారి తీయకపోవచ్చు. టీకాల కార్యక్రమం వేగవంతం చేయడంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పాటు అందిస్తుంది.
* 2021-22లో బ్యాంకుల రుణ వృద్ధి 4-5 శాతం మేర పెరిగి, 9-10 శాతానికి చేరే అవకాశం ఉంది. రిటైల్‌ రుణాలు, కార్పొరేట్‌ రుణాలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో మొత్తమ్మీద రుణ వృద్ధి కనిపిస్తుంది.
* 2020-21లో అత్యవసర రుణ హామీ పథకం కింద అందించిన రుణాలతో బ్యాంకింగ్‌ రంగంలో రుణ వృద్ధి కనిపించింది. రెండో అర్ధభాగంలో ఇంగ్లిష్‌ అక్షరం ‘వి’ ఆకారంలో రికవరీ కనిపించింది.
* బ్యాంకింగేతర రంగంలో మొత్తం ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) 2021-22లో నెమ్మదిగా 5 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ముందు స్థాయికి చేరడానికి ఇంకాస్త సమయం పడుతుంది.
* బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) దీర్ఘకాలిక రెపో కార్యకలాపాల పథకం వంటివి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రంగంలో 2021 మార్చి నాటికి ఒత్తిడిలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.1.8 లక్షల కోట్లకు చేరింది. ఇందులో స్థిరాస్తి రుణాలు, హామీ లేని రుణాలు, చిన్న వ్యాపారాలకు అందించిన రుణాలే ఎక్కువగా ఉన్నాయి.

34 రంగాలు కొవిడ్‌ పూర్వ స్థితికి..
ఆర్థిక వ్యవస్థలోని 42 రంగాల్లో 89 శాతానికి పైగా రుణాలు కలిగిన 34 రంగాలు కొవిడ్‌ పూర్వ స్థితికి చేరుకున్నాయని క్రిసిల్‌ పేర్కొంది. గిరాకీ పుంజుకోవడంతో ఆర్థిక వాతావారణం మెరుగైందని, ప్రభుత్వం తీసుకున్న విధాన చర్యలు కూడా కంపెనీలు రుణ నిష్పత్తిని తగ్గించుకోవడానికి దోహదం చేశాయని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రుణ నిష్పత్తి 1.33 శాతానికి మెరుగైందని, ప్రథమార్థంలో ఇది దశాబ్దాల కనిష్ఠ స్థాయి అయిన 0.54 శాతం వద్ద ఉందని తెలిపింది.


సేద తీరుదాం చలో..చలో
సాహసాల కోసమూ ప్రయాణాలు
2021పై 65% భారతీయుల అభిప్రాయం
మారుతున్న ధోరణి
ఇంటర్‌మైల్స్‌ సర్వే

ముంబయి: కరోనా సెకండ్‌ వేవ్‌ కనిపిస్తున్నా.. టీకాల పంపిణీ నేపథ్యంలో ఈ ఏడాదిలో ప్రయాణాలపై 65 శాతం మంది ఆసక్తిగానే ఉన్నారు. సేద తీరడానికి, సాహసాలు చేయడానికి వీరు ఉత్సాహం చూపిస్తున్నారని ఇంటర్‌మైల్స్‌ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది.
* 2020లో కేవలం అవసరమున్నంత వరకే ప్రయాణాలు జరగా.. 2021లో మాత్రం కొత్త గమ్యస్థానాలను అన్వేషించేందుకు..2020లో ఎదురైన అనుభవాలకు దూరంగా వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికి ఈ సారి ప్రయాణాలను ఉపయోగించుకోనున్నారు.
* దేశవ్యాప్తంగా 11,500 మందికి పైగా సర్వే చేయగా..65 శాతం మందిలో ఈ విశ్వాసం కనిపిస్తోంది.
* ఏడాదికి పైగా సామాజిక దూరాన్ని పాటించిన నేపథ్యంలో కుటుంబం, స్నేహితులకు కలుసుకోవడానికి 54 శాతం మంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
* వ్యాపార, కార్పొరేట్ల ప్రయాణాలు ముందుకు రికవరీ అవుతాయని అంచనా వేయగా.. విచిత్రంగా అది ప్రాధామ్యాలలో మూడో స్థానంలో ఉంది. అయితే 85 శాతం మంది మాత్రం 2021లో వ్యాపారం లేదా పనికి సంబంధించిన ప్రయాణాల విషయంలో మొగ్గుచూపడానికి సిద్ధంగానే ఉన్నారు.
* పని(వర్క్‌), విహారాల(వెకేషన్‌)ను కలగలిపిన ధోరణి(వర్కేషన్‌) భారత్‌లో పెరుగుతోంది. ఇప్పటికే పలు హాస్టళ్లు, బడ్జెట్‌లో లభించే వర్క్‌ స్టేషన్లు, క్యాంప్‌వ్యాన్లు, వర్కేషన్‌ ప్యాకేజీలకు గిరాకీ పెరిగింది.
* ఇప్పటికీ ప్రజా రవాణాపై ఆసక్తిగా లేమని 39 శాతం మంది అంటున్నారు.
* భద్రత, శుభ్రత విషయంలో గమ్యస్థానాల్లో ఎలా ఉందో తెలుసుకునే ప్రయాణాలు చేయడం పెరిగింది. కరోనా అనిశ్చితి నేపథ్యంలో తక్కువ ఖర్చుతో జరిగేలా ప్రయాణాలను రచిస్తున్నారు. 62 శాతం చివరి నిమిషంలో ప్రయాణాలను రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని