డెట్‌ ఫండ్ల రకాలు, పని తీరు!!

తక్కువ నష్టభయం, స్థిరమైన రాబడి వచ్చే సాధనాలలో మదుపుచేయాలనుకునే వారికి డెట్‌ పథకాలు అనుకూలంగా ఉంటాయి. పేరుకు తగ్గట్టు ఈ ఫండ్‌ రుణాలపై ఆధారపడి పనిచేస్తాయి...

Published : 16 Dec 2020 10:27 IST

మ్యూచువల్ ఫండ్లలో స్థిర ఆదాయం, తక్కువ నష్ట భయం ఉండే డెట్‌ పథకాల వివరాలు తెలుసుకుందాం.

తక్కువ నష్టభయం, స్థిరమైన రాబడి వచ్చే సాధనాలలో మదుపుచేయాలనుకునే వారికి డెట్‌ పథకాలు అనుకూలంగా ఉంటాయి. పేరుకు తగ్గట్టు ఈ ఫండ్‌ రుణాలపై ఆధారపడి పనిచేస్తాయి. సేకరించిన పెట్టుబడి మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన స్థిర ఆదాయ పెట్టుబడి సాధనాలైన టీ- బిల్లులు, దీర్ఘ, స్వల్ప కాల బాండ్లలో, బ్యాంకులు ఇత్రర ఆర్ధిక సంస్థలు జారీ చేసే సీడీ, సీపీ, ఇదే కాక కార్పొరేట్‌ సంస్థలు విడుదల చేసే డిబెంచర్లు మొదలైన వాటిలో పెట్టుబడి చేస్తారు. పెట్టుబడికి ఎంచుకున్న సాధనాలు, పెట్టుబడి కాలావధిని అనుసరించి పెట్టుబడిదారుల అవసరాలకు అనుకూలంగా వివిధ రకాల డెట్‌ మ్యూచువల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే డెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల స్థిరమైన రాబడి వచ్చే అవకాశాలున్నాయి. ఒక్క రోజు నుంచి కొన్ని సంవత్సరాలపాటు పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన డెట్‌ పథకాలు అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల డెట్‌ ఫండ్లు

లిక్విడ్ ఫండ్లు:

వీటిని మనీ మార్కెట్‌ పథకాలంటారు. వీటిని సులువుగా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. పెట్టుబడిని ఒక రోజు నుంచి కొన్ని నెలల వరకూ సురక్షితంగా దాచుకునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి.
ఈ పథకంలోని సొమ్మును స్వల్పకాలిక సాధనాలైన ట్రెజరీ బిల్లులు, సీపీలు, సీడీలలో భద్రపరుస్తారు.

  • వీటిలో ఒకరోజు నుంచి 3 నెలల దాకా పెట్టవచ్చు. ఈ పథకంలో నష్టం కలిగే అవకాశం తక్కువ అందుకే మ్యూచువల్‌ ఫండ్లలో ఇవి అత్యంత సురక్షితమైనవి.

గిల్ట్‌ ఫండ్లు:

భారత ప్రభుత్వం జారీ చేసే డెట్‌ పేపర్లలో గిల్ట్‌ ఫండ్లను పెడతారు. వీటిలో పెట్టుబడికి ఎలాంటి నష్టం ఉండదు. అయితే వడ్డీ రేటుపై ఇవి ఆధారపడతాయి. ప్రభుత్వం జారీ చేసే షేర్లలో పెట్టుబడి పెడతారు కాబట్టి గిల్ట్‌ ఫండ్లు సురక్షితమైనవి.

ఆదాయ ఫండ్లు (ఇన్‌కమ్‌ ఫండ్స్‌):

వీటి పెట్టుబడులను బాండ్లలో, కార్పొరేట్‌ డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెడతారు.

నెలవారీ ఆదాయ పథకాలు (మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్స్‌):

ఇలాంటి పథకాల్లో పెట్టుబడిని చాలా భాగం డెట్‌ సాధనాల్లో పెడతారు. కొంతమొత్తం ఈక్విటీల్లోనూ పెడతారు. దీంతో ఈక్విటీ, డెట్‌ల రెండు లాభాలు ఈ పథకంలో వస్తాయి. ఇతర డెట్‌ పథకాలతో పోలిస్తే వీటికి మార్కెట్‌లో కాస్త నష్టభయం ఎక్కువ.

స్వల్పకాలిక పథకాలు (షార్ట్‌ టర్మ్‌ ప్లాన్స్‌) :

3 నుంచి 6నెలల మధ్యకాలంలో పెట్టుబడి పెట్టేవారికి ఈ పథకం అనుకూలం. ఇవి స్వల్పకాలిక పత్రాలైన సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌ (సీడీ), కమర్షియల్‌ పేపర్ల (సీపీ)లలో మదుపు చేస్తాయి. కొంత భాగాన్ని కార్పొరేట్‌ డెబెంచర్లలోనూ పెట్టుబడిగా పెడతారు.

ఇన్ని వైవిధ్యమైన డెట్‌ సాధనాలలో నుంచి పెట్టుబడిదారు తన ఆర్థిక లక్ష్యానికి సరిపడే పధకాన్ని ఎంచుకుని పెట్టుబడి చేయ వచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు