Loan: ఉమ్మడి రుణం తీసుకుంటున్నారా?
ఒకరు మినహాయింపు పొందిన మొత్తానికి మరొకరి తిరిగి మినహాయింపు పొందలేరు
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. పూర్తిగా సొంత డబ్బు పెట్టి ఇంటిని కొని నిర్మించే స్తోమత అందరికీ ఉండదు. ఇలాంటి వారందిరికీ సొంతింటి కల నిజం చేసుకునేందుకు ఉన్న మార్గం గృహ రుణమే. ఇంటి విలువ ఎక్కువగా ఉండి, వ్యక్తికి వచ్చే రుణం తక్కువగా ఉన్నప్పుడు ఉమ్మడి రుణం తీసుకోవడం ఓ ప్రత్యామ్నాయం. ఈ ఉమ్మడి రుణంతో కలిగే లాభనష్టాలేంటో చూద్దాం..!
వ్యక్తిగత రుణానికి సరిపోయేంత అర్హత లేనప్పుడు ఉమ్మడిగా రుణం తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో అప్పు పొందేందుకు వెసులుబాటు దొరుకుతుంది. సాధారణంగా ఉమ్మడి రుణం కోసం ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకరికి ఇద్దరు కలిసినప్పుడు ఆదాయం పెరుగుతుంది కాబట్టి రుణ అర్హత కూడా అధికమవుతుంది. దీంతోపాటు సహ- దరఖాస్తురు(కో అప్లికెంట్)గా ఉన్న వారి రుణ చరిత్ర బాగుంటే.. రుణం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా అప్పు తీసుకోవచ్చు. తల్లిదండ్రులతోనూ, తోబుట్టువులతోనూ కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు.
సహదరఖాస్తుదారు బాధ్యతలేమిటి?
రుణం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తికి మద్దతుగా సహ దరఖాస్తుదారు ఉండాలి. అతని రాబడి ప్రధాన రుణగ్రహీత తో కలిసినప్పుడు ఇరువురి మొత్తం ఆదాయం పెరగాలి, అతని గృహ రుణ చెల్లింపు సామర్థ్యం అధికమవ్వాలి. అప్పుడే ఆశించిన రుణం రావడానికి అవకాశం ఉంటుంది. సహ దరఖాస్తుదారుడికి రుణానికి సంబంధించిన అన్ని బాధ్యతలూ ఉంటాయి. ఒకవేళ ప్రధాన రుణగ్రహీత వాయిదాలు సరిగ్గా చెల్లించలేకపోతే.. సహ దరఖాస్తుదారు ఆ బాధ్యతను నెరవేర్చాలి. అందుకే, రుణ సంస్థలు ఉమ్మడి రుణం ఇచ్చే ముందు ఇద్దరి రుణ చరిత్రనూ పరిశీలిస్తాయి. ఇలాంటప్పుడు క్రెడిట్ స్కోర్ ఎంతో ముఖ్యం.
ఇద్దరిపైనా ప్రభావం..
ఉమ్మడిగా రుణం తీసుకున్నప్పుడు ఆ ప్రభావం రుణగ్రహీతలిద్దరికీ ఉంటుంది. రుణ చెల్లింపును ఎవరు చేస్తున్నారన్నదీ ఇక్కడ ముఖ్యమే. వాయిదాలను సక్రమంగా చెల్లించకపోతే ఇద్దరి రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్ పైనా అది ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇద్దరు కలిసి ఉమ్మడిగా రుణం తీసుకున్నారనుకుందాం. తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారనుకుందాం. అందులో వారు వాయిదాలు ఎవరు చెల్లించాలి అనే అంగీకారానికి వచ్చినా..రుణ సంస్థలు మాత్రం అప్పు ఇచ్చేప్పుడు కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉంటాయి. అలాంటప్పుడు రుణం తీర్చడానికి అంగీకరించిన వ్యక్తి వాయిదాలు చెల్లించకపోతే...సహ దరఖాస్తుదారుడిగా ఉన్న వారి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. కాబట్టి, రుణం చెల్లింపులో అశ్రద్ధ తగదు.
పన్ను మినహాయింపులు..
ఉమ్మడి రుణంలో చెల్లించిన ఈఎంఐ ఆధారంగా పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు. ఉదాహరణకి, రమేశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిపి ఉమ్మడి రుణం తీసుకున్నాడనుకుందాం. ఇద్దరు ఉద్యోగస్థులే. అయితే, ప్రతినెలా ఈఎంఐ రమేష్ ఖాతా నుంచి చెల్లిస్తున్నప్పటికీ ఇందులో తన భార్య 40 శాతం వాటా అనుకున్నట్టయితే అంత మేరకు ఇద్దరు మినహాయింపులు పొందొచ్చు. ఒకరు మినహాయింపు పొందిన మొత్తానికి మరొకరు తిరిగి మినహాయింపు పొందలేరు.
ఉమ్మడిగా రుణం తీసుకున్నప్పుడు పాటించాల్సిన విషయాలు ఏంటంటే...
* సహ యజమానినే సహదరఖాస్తుదారుడిగా ఉండేలా చూసుకోండి. అయితే బ్యాంకులు, సహ దరఖాస్తుదారుడు , సహ యజమాని (కో-ఓనర్) ఒకరే ఉండాలనే నిబంధనను విధించవు.
* మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలను రుణ దరఖాస్తుదారులు ఇద్దరూ పాటించాల్సి ఉంటుంది. అందుకే, ముందే వ్యక్తుల రుణ చరిత్రకు సంబంధించిన నివేదికలను పరిశీలించి, ఆ తర్వాతే ఎవరిని సహ దరఖాస్తుదారుడిగా ఉంచాలన్నది నిర్ణయించుకోవాలి.
* మీరు సహ దరఖాస్తుదారుడిగా ఉంటే రుణ చెల్లింపులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అన్నది సరిచూసుకుంటూ ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.