ఆన్‌లైన్‌ మోసగాళ్లతో జాగ్రత్త

కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీల వైపు ఖాతాదార్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఇదే అదనుగా భావించిన కేటుగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. తెలియని మూలం

Published : 05 May 2021 01:04 IST

 సున్నిత సమాచారాన్ని పంచుకోవద్దు
 ఖాతాదార్లకు సూచించిన ఎస్‌బీఐ

దిల్లీ: కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీల వైపు ఖాతాదార్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఇదే అదనుగా భావించిన కేటుగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. తెలియని మూలం (అన్‌నోన్‌ సోర్స్‌) నుంచి ఎలాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని, ఇ-మెయిళ్లు, ఇతర సామాజిక ఖాతాలు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మొద్దని సూచించింది. పుట్టిన తేదీ, డెబిట్‌ కార్డ్‌ నెంబర్‌, పిన్‌, సీవీవీ, ఓటీపీ వంటి సున్నిత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని వివరించింది. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలోనూ డిజిటల్‌ బ్యాంకింగ్‌ మోసాలు భారీగా పెరిగాయని ఎస్‌బీఐ గుర్తు చేసింది.


ఉక్కు ఉత్పత్తుల ధరలు టన్నుకు రూ.4,500 వరకు పెంపు

దిల్లీ: హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ (హెచ్‌ఆర్‌సీ), కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ (సీఆర్‌సీ) ధరలను టన్నుకు రూ,4,000, రూ.4,500 చొప్పున దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు పెంచినట్లు తెలుస్తోంది. ధరల సవరణ తర్వాత హెఆర్‌సీ టన్ను ధర రూ.67,000, సీఆర్‌సీ టన్ను ధర రూ.80,000 అయ్యాయి. గత మూడు రోజుల్లో ఈ విధంగా కంపెనీలు ధరలను సవరించాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈనెల మధ్యలో, లేదా జూన్‌ ప్రారంభంలో, హెచ్‌ఆర్‌సీ, సీఆర్‌సీ ఉత్పత్తుల ధరలు మరో రూ.2000- 4000 మేర పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. వినియోగ ఆధారిత పరిశ్రమలైన వాహన, నిర్మాణం, అప్లయెన్సెస్‌లో హెచ్‌ఆర్‌సీ, సీఆర్‌సీని ఉపయోగిస్తారు. వీటి ధరల పెంపుతో వాహనాలు, వినియోగ వస్తువుల ధరలపైనా ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


సెయిల్‌ ఎట్‌ రూ.55000 కోట్లు
 దేశంలోని అత్యంత విలువైన 100 సంస్థల్లో చోటు

దిల్లీ: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) మార్కెట్‌ విలువ రూ.55,000 కోట్ల మైలురాయిని చేరింది. గత నెలన్నర రోజుల్లో ఈ కంపెనీ షేరు విలువ 80 శాతానికి పైగా రాణించడమే ఇందుకు కారణం. మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసే అవకాశం ఉందన్న అంచనాలు, భవిష్యత్‌లోనూ మెరుగ్గానే రాణిస్తుందనే ఆశాభావం షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడానికి తోడ్పడింది. తాజా పరిణామంతో దేశంలో అత్యధిక మార్కెట్‌ విలువున్న 100 సంస్థల్లో సెయిల్‌ చోటు దక్కించుకుంది. రూ.55,529 కోట్ల మార్కెట్‌ విలువతో ప్రస్తుతం సెయిల్‌ 78వ స్థానంలో ఉందని బీఎస్‌ఈ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. మంగళవారం ఇంట్రాడేలో ఈ సంస్థ షేరు రూ.135.60ని తాకడం ద్వారా తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయిని అందుకుంది. చివరకు రూ.127.95 వద్ద షేరు ముగిసింది. దేశంలో ప్రముఖ ఉక్కు ఉత్పత్తి కంపెనీల్లో సెయిల్‌ ఒకటి. ఈ సంస్థకు భిలాయ్‌, రూర్కెలా, దుర్గాపూర్‌, బొకారో, ఐఐఎస్‌సీఓ వద్ద 5 అతిపెద్ద అనుసంధానత ప్లాంట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు చోట్ల ప్రత్యేక ఉక్కు ప్లాంట్లను కూడా నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని