‘టీకా’బడ్జెట్‌పై భారత్‌ బయోటెక్‌, సీరం హర్షం

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయడంపై ఫార్మా సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది చాలా గొప్ప నిర్ణయం

Published : 01 Feb 2021 18:51 IST

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయడంపై ఫార్మా సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది చాలా గొప్ప నిర్ణయం అంటూ భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు కొనియాడాయి.

కొవిడ్‌ టీకా పంపిణీ కోసం రూ.35వేల కోట్లు కేటాయించడాన్ని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్లా స్వాగతించారు. ‘ఇదో గొప్ప ముందడుగు. అందరికీ చేరే కార్యక్రమం’ అని ప్రశంసించారు. మహమ్మారిపై పోరులో భాగంగా ఆరోగ్య రంగానికి మరిన్ని కేటాయింపులు చేయడం, వ్యాక్సినేషన్‌ పథకాన్ని ప్రతిఒక్కరికీ అందించడం వంటి చర్యలతో ఆర్థిక శాఖ మనదేశాన్ని కొవిడ్‌ రహిత భారతం దిశగా నడిపిస్తోందని అన్నారు. ఈ చారిత్రక బడ్జెట్‌తో మన దేశ భవిష్యత్‌ విజయాలకు ఆరోగ్యం మూలస్తంభం కానుందని కృష్ణ ఎల్లా చెప్పారు. 

మరో ఫార్మా సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అదర్‌ పూనావాలా కూడా ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘‘బడ్జెట్‌ 2021 చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, వ్యాక్సిన్లకు అధిక కేటాయింపులు చేయడం ఆనందరకరం. ఏ దేశానికైనా ఇదో మంచి పెట్టుబడి. ఆరోగ్యకరమైన భారత్‌తోనే.. మరింత ఉత్పాదక భారత్‌ ఆవిష్కృతమవుతుంది’’ అని అదర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌, సీరమ్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాలు ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

‘ఆరోగ్య’మస్తు

నిర్మలమ్మ సిక్సర్‌: అభివృద్ధికి ఆరు పిల్లర్లు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని