‘ కొవాగ్జిన్‌’ టీకా తయారీ సామర్థ్యాన్ని

కొవిడ్‌-19 ముప్పును తప్పించుకోడానికి 45 ఏళ్లకు పైబడిన అందరికీ టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో...

Updated : 26 Mar 2021 11:15 IST

విస్తరించనున్న భారత్‌ బయోటెక్‌

ఈనాడు, హైదరాబాద్‌:  కొవిడ్‌-19 ముప్పును తప్పించుకోడానికి 45 ఏళ్లకు పైబడిన అందరికీ టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, దేశీయంగా టీకా లభ్యత గణనీయంగా పెరగాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి అనుగుణంగా ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ఈ కంపెనీకి బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలతో ఉన్న యూనిట్లో టీకా తయారు చేస్తున్నారు. దీనికి అదనంగా కర్నాటకలో మరొక ప్లాంటును భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తోంది. ఈ యూనిట్‌ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తత్ఫలితంగా ‘కొవాగ్జిన్‌’ టీకాను అధిక సంఖ్యలో తయారు చేసే అవకాశం కలుగుతుంది. ఇందువల్ల దేశీయ అవసరాలకు టీకా అందించడంతో పాటు ఇతర దేశాలకు కొంతమేర ఎగుమతులు చేసే అవకాశం వస్తుందని సమాచారం. కొవాగ్జిన్‌ టీకాను ఇప్పటికే పలు దేశాలకు సరఫరా చేస్తున్నారు. ఈ టీకాకు  ఇప్పటికే బ్రెజిల్‌, జింబాబ్వే, నేపాల్‌ దేశాలు ‘అత్యవసర వినియోగ అనుమతి’ కూడా ఇచ్చాయి.

విదేశీ పెట్టుబడి నిబంధనలను కొన్ని ఇ-కామర్స్‌ సంస్థలు ఉల్లంఘిస్తున్నాయ్‌
రిలయన్స్‌ రిటైల్‌ ఆరోపణ

దిల్లీ: విదేశీ పెట్టుబడి నిబంధనలను కొన్ని ఇ-కామర్స్‌ సంస్థలు ఉల్లంఘిస్తున్నాయని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ ఆరోపించింది. చిన్న వర్తకులకు నష్టం చేసేలా, విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించేందుకు విదేశీ ఆన్‌లైన్‌ రిటైలర్లు సంక్లిష్ట చట్టబద్ధ విధానాలను వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలపై వాణిజ్య శాఖ నిర్వహించిన సమావేశంలో రిలయన్స్‌ ఇలా పేర్కొంది. వ్యాపార పద్ధతులపై విచారణ పూర్తి చేసినంత వరకు ఎటువంటి ప్రకటన చేయొద్దని ప్రభుత్వాన్ని అమెజాన్‌ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇన్వెంటరీ ఆధారిత నమూనాలో ఇ-కామర్స్‌ సంస్థలకు ప్రారంభం నుంచే విదేశీ మూలధనాన్ని ప్రభుత్వం అనుమతించడం లేదని, విక్రేతలు, కొనుగోలుదార్లను కలిపే వ్యవస్థ/ప్లాట్‌ఫామ్‌ ఉంటేనే విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ ప్రతినిధులు తెలిపారు. ఇటువంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ విక్రేతలుగా వ్యవహరించకూడదని అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ ప్లేస్‌ సంస్థలకు నిల్వలపై పట్టు ఉంటుందని, వారే అతిపెద్ద విక్రేతలని ఆరోపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని