టూ-వీల‌ర్ బీమా పాల‌సీ పున‌రుద్ధ‌రించ‌లేదా? అయితే ఇది చ‌ద‌వండి..

మోటారు సైకిల్‌కి దానికి సంబంధించిన కాగితాలు ఎంత ముఖ్య‌మో, బీమా కూడా అంతే ముఖ్యం.

Updated : 24 Nov 2021 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టూ-వీల‌ర్ వాడ‌కం చాలా వ‌ర‌కు కుటుంబాల్లో ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. స‌రైన ప్ర‌జా రవాణా, మౌలిక వ‌స‌తుల లేమితో ప‌ల్లెల‌లో కూడా మోటారు సైకిళ్ల‌ను విరివిగా వాడుతున్నారు. చాలా గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో ఉండే ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా మోటారు సైకిల్ య‌జ‌మానుల‌కు ఇప్ప‌టికీ మోటారు బీమాపై స‌రైన అవ‌గాహ‌న లేదు. మోటారు సైకిల్‌కు సంబంధించిన కాగితాలు ఎంత ముఖ్య‌మో, బీమా కూడా అంతే ముఖ్యం. బైక్ డ్రైవింగ్ చేసేవారు మీ వాహ‌న పేప‌ర్ల‌ (లైసెన్స్‌, పొల్యుష‌న్ స‌ర్టిఫికేట్ లాంటివి)ను ఎల్ల‌ప్పుడూ అప్‌-టు-డేట్‌గా ఉంచుకోవాలి. బీమా లేకుండా ద్విచ‌క్ర వాహ‌న‌మే కాదు ఏ మోటారు వాహ‌నం న‌డ‌ప‌డమైనా చ‌ట్ట విరుద్దమే. అంతేకాదు, బీమా పాల‌సీ.. మోటార్ సైకిల్‌కి యాక్సిడెంట్ అయినా, యాక్సిడెంట్‌లో ఇత‌రులు గాయ‌ప‌డినా.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆర్థిక న‌ష్టాల నుంచి మిమ్మ‌ల్ని కాపాడుతుంది. అందువ‌ల్ల బీమా తీసుకోవ‌డంతోపాటు ఎప్ప‌టిక‌ప్పుడు పాల‌సీని స‌మీక్షిస్తుండాలి.. అవసరమైతే పున‌రుద్ధ‌రించాలి. 

పున‌రుద్ధ‌ర‌ణ తేదీ తెలియ‌దా.. ఏం చేయాలి?
మీ బైక్‌కి బీమా ఉండి.. పునరుద్ధ‌ర‌ణ తేదీ గుర్తులేక‌పోతే గ‌డువు తేదీ, పాల‌సి స్థితి త‌దిత‌ర వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో నిమిషాల వ్య‌వ‌ధిలో తెలుసుకోవ‌చ్చు. పాల‌సీ ఏ బీమా సంస్థ నుంచి కొనుగోలు చేసినా ఆన్‌లైన్ ద్వారా పూర్తి సుర‌క్షితంగా, పార‌ద‌ర్శ‌కంగా పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. ఇందుకోసం మీ వాహ‌న రిజిస్ట్రేష‌న్ నంబ‌రు త‌దిత‌ర వాహ‌న వివ‌రాల‌ను న‌మోదు చేసి, మీకు స‌రిపోయే పాల‌సీ ర‌కాన్ని ఎంచుకోవాలి. ఐడీవీ (ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్ విలువ‌), యాడ్‌-ఆన్‌ల‌ను ఎంచుకుని, ఆన్‌లైన్ ద్వారానే ప్రీమియం చెల్లింపు చేసి ప్ర‌క్రియ‌ను పూర్తి చేయొచ్చు. పాల‌సీకి సంబంధించిన సాఫ్ట్ కాపీ మీ రిజిస్ట‌ర్డ్‌ ఇ-మెయిల్‌కి వ‌స్తుంది.

పాల‌సీ గ‌డువు పూర్తైన‌ప్ప‌ట‌కీ, ఆన్‌లైన్ పునరుద్ధ‌ర‌ణ‌ వ‌ల్ల కొన్ని ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. సాధార‌ణంగా పాల‌సీ గ‌డువు పూర్తైన‌ప్ప‌టికీ, పున‌రుద్ధ‌ర‌ణ‌కు 90 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఉంటుంది. ఒక‌వేళ గ్రేస్ పీరియ‌డ్‌లో ఉంటే, గ‌డువు తేదీ త‌రువాత కూడా ఆఫ్‌లైన్ ఇన్‌స్పెక్షన్‌ లేకుండా.. ఆన్‌లైన్‌లో పాల‌సీ రెన్యువ‌ల్ చేయించుకోవ‌చ్చు. అలాగే నో-క్లెయిమ్ బోన‌స్‌ (ఎన్‌సీబీ) ప్ర‌యోజ‌నాన్ని కూడా కోల్పోరు. 

ఏ బీమా పాల‌సీని ఎంచుకోవాలి?
బైక్ బీమా పాల‌సీని పున‌రుద్ధ‌రించేట‌పుడు ఆన్‌లైన్‌లో బీమా పాల‌సీ ర‌కాన్ని (థ‌ర్డ్ పార్టీ లేదా స‌మ‌గ్ర బీమా) ఎంచుకోవాలి. ఇది  కొనుగోలు ప్ర‌క్రియ‌లో కీల‌క‌మైన భాగం. థ‌ర్డ్ పార్టీ బీమా పాల‌సీ కొన‌గోలు చేయ‌డాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఇది మీ వాహ‌నం ద్వారా ఇత‌రులు ప్ర‌మాద‌వశాత్తు గాయ‌ప‌డినా, మ‌ర‌ణించినా ప‌రిహారం అందిస్తుంది. అలాగే వారి ఆస్తిన‌ష్టాన్ని కూడా క‌వ‌ర్ చేస్తుంది. అయితే స‌మ‌గ్ర పాల‌సీని ఎంచుకోవ‌డం ఎల్ల‌ప్పుడూ స‌రైనా విధానం. స‌మ‌గ్ర పాల‌సీలో థ‌ర్డ్ పార్టీకి జ‌రిగిన న‌ష్టంతో పాటు మ‌న సొంత వాహ‌నం న‌ష్టం కూడా క‌వ‌ర‌వుతుంది. గ‌డువు తేదీని మ‌ర్చిపోకుండా ఉండ‌టానికి బీమా సంస్థ సాధార‌ణంగా హెచ్చ‌రిక‌ల‌ను, రిమైండ్‌ర్‌ల‌ను పంపుతుంది.

బీమా పాల‌సీ తీసుకునే ముందు పాల‌సీ నియ‌మ నిబంధ‌న‌ల‌ను పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే పాల‌సీని కొనుగోలు చేశాక ప‌త్రాల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేయాలి. మ‌రిన్ని వివ‌రాల కోసం ‘ఐఆర్‌డీఏఐ’ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు