విడిపోతున్న Bill Gatesదంపతులు

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌, ఆయన సతీమణి మెలిందా విడాకులు తీసుకుంటున్నారు........

Published : 04 May 2021 09:01 IST

సియాటిల్‌: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌, ఆయన సతీమణి మెలిందా విడాకులు తీసుకుంటున్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం అర్ధరాత్రి దాటాక (భారత కాలమానం ప్రకారం) ఆయన ట్విటర్‌లో విడాకుల విషయాన్ని ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘‘ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం. గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం  ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత  ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’’ అని ట్విటర్‌లో బిల్‌, మెలిందాలు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు. 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు. మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్‌ సీఈవోగా ఉన్న సమయంలో మెలిందా ప్రొడక్ట్‌ మేనేజరుగా చేరారు. అప్పట్లో కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ మెలిందా. ఆ తర్వాత 1994లో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని