వ‌డ్డీ రేట్లు త‌గ్గితే ఏంటి? పెరిగితే ఏంటి ?

స్థిరాదాయ ప‌థ‌కాలపై వ‌చ్చే రాబ‌డి అవి ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌ పై ఆధార‌ప‌డి ఉంటాయి. ఎంత ఎక్కువ వ‌డ్డీ రేటు ఉంటే అంత ఎక్కువ రాబ‌డి ఉంటుంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే వ‌డ్డీ రేట్లు పెర‌గ‌డం మూలంగా బాండ్ల ధ‌రలు త‌గ్గుతాయ‌ని, వ‌డ్డీ...

Published : 16 Dec 2020 16:39 IST

వ‌డ్డీ రేట్ల ప్ర‌భావం బాండ్ల ధ‌ర‌ల‌పై ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

స్థిరాదాయ ప‌థ‌కాలపై వ‌చ్చే రాబ‌డి అవి ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌ పై ఆధార‌ప‌డి ఉంటాయి. ఎంత ఎక్కువ వ‌డ్డీ రేటు ఉంటే అంత ఎక్కువ రాబ‌డి ఉంటుంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే వ‌డ్డీ రేట్లు పెర‌గ‌డం మూలంగా బాండ్ల ధ‌రలు త‌గ్గుతాయ‌ని, వ‌డ్డీ రేట్లు త‌గ్గిన సంద‌ర్భంలో బాండ్ల ధ‌రలు పెరుగుతాయ‌ని గ‌మ‌నించారా. ఈ క‌థ‌నంలో దీనికి కార‌ణం ఏంటో తెలుసుకుందాం. ఉదాహ‌ర‌ణ‌కు, అదాన్ అనే ఒక వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌ల పెట్టుబ‌డితో 10 ఏళ్ల కాల‌ప‌రిమితి, ముఖ విలువ రూ.100 ఉన్న ప్ర‌భుత్వ బాండ్ల‌ను 8 శాతం స్థిర వ‌డ్డీ రేటుతో కొనుగోలు చేశార‌నుకుందాం. ప్ర‌భుత్వ బాండ్ల పై కూప‌న్ చెల్లింపులు ఆరు నెల‌ల‌కు ఒక‌సారి జ‌రుగుతుంది. కాబ‌ట్టి అత‌నికి మొత్తం ప‌దేళ్ల కాలానికి 20 కూప‌న్ లు చివ‌ర‌లో అస‌లు వ‌స్తుంది. ఆ మ‌దుప‌రికి ఆరునెల‌ల‌కు ఒక సారి వ‌చ్చే కూప‌న్ విలువ రూ.4000 అందుతుంది. అలా ప్ర‌తీ ఆరునెల‌ల‌కో కూప‌న్ చొప్పున 20 కూప‌న్ లు అందుతాయి. ప‌దేళ్ల మెచ్యూరిటీ తీరిన త‌ర్వాత అస‌లు ల‌క్ష రూపాయ‌లు అందుతుంది. ఇది సాధార‌ణంగా జ‌రిగే ప్ర‌క్రియ‌.

వ‌డ్డీ రేట్లు మారిన‌పుడు:

పై ఉదాహ‌ర‌ణ‌లో వ‌డ్డీ రేట్లు మారిన‌ట్ల‌యితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

రిజ‌ర్వుబ్యాంకు వ‌డ్డీ రేట్ల ను పెంచిన సంద‌ర్భంలో:

మార్కెట్ వ‌డ్డీ రేటు 9 శాతం కి పెరిగిందనుకుందాం. అప్పుడు పై ఉదాహ‌ర‌ణ‌లో పేర్కొన్న విధంగా బాండ్ల పై వ‌చ్చే కూప‌న్ 8 శాతం కొత్త గా బాండ్ల‌లో మ‌దుపుచేసేవారికి ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌దు. ఎందుకంటే మార్కెట్లో 9 శాతం చొప్పున అందుబాటులో ఉన్న‌పుడు 8 శాతం వ‌డ్డీ ఇచ్చే బాండ్లకు డిమాండ్ త‌గ్గుతుంది. ముఖ విలువ రూ.100 ఉన్న బాండ్ దాని ముఖ విలువ కంటే తక్కువ‌కు ట్రేడ‌వుతుంది.

బాండ్ ధ‌ర vs వ‌డ్డీ రేటు:

BOND-INTEST.jpg

రిజ‌ర్వుబ్యాంకు వ‌డ్డీ రేట్ల ను త‌గ్గించిన సంద‌ర్భంలో:

మార్కెట్ వ‌డ్డీ రేటు 7 శాతం కి త‌గ్గిందనుకుందాం. అప్పుడు కొత్త‌గా జారీ చేసే బాండ్ల పై వ‌చ్చే కూప‌న్ 7 శాతం ఉంటుంది. మ‌దుప‌ర్లు బాండ్ మార్కెట్ లో ల‌భించే ఎక్కువ కూప‌న్ బాండ్ల ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతారు. కొత్తగా జారీచేసే బాండ్లపై వ‌చ్చే 7 శాతం రాబ‌డి కంటే గ‌తంలో జారీ చేసిన 8 శాతం ఇచ్చే బాండ్ల కు డిమాండ్ పెరుగుతుంది. దీంతో మార్కెట్ లో ఆ బాండ్ ముఖ‌విలువ రూ.100 కంటే కంటే ఎక్కువ ధ‌ర కు ట్రేడ‌వుతుంది.

చివ‌ర‌గా:

వడ్డీరేట్లు పెరిగినప్పుడు బాండ్ల‌ ధరలు త‌గ్గుతాయి. ఆ స‌మ‌యంలో బాండ్లు మార్కెట్ లో ముఖ విలువ కంటే తక్కువ ధర కు ట్రేడ‌వుతాయి. వ‌డ్డీరేట్లు త‌గ్గిన‌పుడు బాండ్ల‌ ధరలు పెరుగుతాయి. ఆ స‌మ‌యంలో బాండ్ల ముఖ విలువ కంటే ఎక్కువ ధర కు ట్రేడ‌వుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని