Broadband: చౌక డేటా ఇక గతం.. బ్రాడ్‌‘బ్యాండ్‌’ కూడా తప్పదట!

నిన్న మొన్నటి వరకు చౌకగా దొరికిన మొబైల్‌ డేటా ఖరీదుగా మారింది. ప్రస్తుతం కాస్త తక్కువ ధరకే లభిస్తున్న బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ధరలకూ రెక్కలు రానున్నాయా?

Published : 12 Dec 2021 20:27 IST

కోల్‌కతా: నిన్న మొన్నటి వరకు చౌకగా దొరికిన మొబైల్‌ డేటా ఖరీదుగా మారింది. ప్రస్తుతం కాస్త తక్కువ ధరకే లభిస్తున్న బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ధరలకూ రెక్కలు రానున్నాయా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. మొబైల్‌ ఛార్జీల తరహాలోనే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలూ ప్రియం కానున్నాయని తెలుస్తోంది. సమీప భవిష్యత్‌లోనే ఈ పెంపు అవకాశం ఉందని కోల్‌కతాకు చెందిన ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ మేఘబెలా సహ వ్యవస్థాపకుడు తపబ్రత ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

టెలికాం రంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ మినహా మిగిలిన అన్ని కంపెనీలూ ఇటీవల ప్రీపెయిడ్‌ మొబైల్ ఛార్జీలను సవరించాయి. 20 శాతం మేర ధరలను పెంచాయి. వ్యాపారంలో సుస్థిరతకు ఈ పెంపు అవసరమని దాదాపు అన్ని కంపెనీలూ పేర్కొన్నాయి. ఇదే తరహాలో ఒక వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) పెరగాలంటే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలూ ధరలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖర్జీ అభిప్రాపయపడ్డారు. సమీప భవిష్యత్‌లోనే ఈ పెంపు ఉంటుందన్నారు. పోటీ మార్కెట్‌లో వ్యాపారం కొనసాగించాలంటే 15-20 శాతం మేర పెంపు అవసరమని పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. ఇటీవల కాలంలో ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగిందని, వాటిని ప్యాకేజీలో భాగంగా అందివ్వడం వల్ల ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే, ఛార్జీలు సవరించే విషయంలో జాతీయ స్థాయిలో పెద్ద కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియోనే ముందుడుగు వేయాల్సి ఉంటుందన్నారు.

బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీలేవీ ఛార్జీల విషయంలో ఇప్పటికైతే ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో పెద్ద కంపెనీలు ప్రముఖ నగరాల్లో సేవలను అందిస్తున్నాయి. ఇక్కడ పెద్ద మొత్తంలో వెచ్చించే వినియోగదారులు ఉండడం వల్ల.. ఇతర సేవలను అందులో అందించడం ద్వారా వాటి ఆర్పును పెంచుకుంటున్నాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ప్రాంతీయ బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలకు తక్కువ మొత్తంలో చెల్లించే కస్టమర్లు ఉంటారని, పోటీ కూడా పరిమితంగానే ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని