బడ్జెట్ 2021: వ్యాపార వర్గాలు ఏమంటున్నాయంటే..

కేంద్ర బడ్జెట్‌పై పలు వ్యాపార వర్గాలు ప్రశంసిస్తున్నారు.

Published : 01 Feb 2021 20:49 IST

దిల్లీ: నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కొవిడ్‌ మహమ్మారి ప్రభావం బాగానే కనిపించింది. రాబడ్‌ తగ్గిపోయి, ఆదాయ లోటు భారీగా పెరిగినప్పటికీ.. ప్రజారోగ్యం, టీకా పంపిణీలకు ఇతోధికంగా కేటాయించటం పట్ల పలు వ్యాపార వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలను ఇలా వెల్లడించారు..

పూనావాలా, సీరం ఇన్‌స్టిట్యూట్‌
‘‘ప్రత్యేకంగా ఆరోగ్య సేవలు, వ్యాక్సిన్లను గురించి కేటాయిస్తూ  నిర్మలా సీతారామన్‌ గారి బడ్జెట్‌ 2021 ప్రకటన అద్భుతం.  ఇది ఏ దేశమైనా చేయగల ఉత్తమమైన పెట్టుబడి. ఆరోగ్యకరమైన భారతదేశమే, మరింత ఉత్పాదక సామర్థ్యం సాధించగలదు.’’
కిరణ్‌ మజుందార్‌ షా, బయోకాన్‌ చైర్‌పర్సన్‌
‘‘మొత్తం మీద ఏ రుణాత్మక నిర్ణయాలు లేకుండా హామీ ఇచ్చే బడ్జెట్‌ ఇది. దీనిలో ఆరోగ్య సేవలకు ప్రముఖ స్థానం లభించింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ గురించి రూ. 35,400 కోట్లు కేటాయించటమే కాకుండా.. దేశ ప్రాథమిక,, ద్వితీయ, తృతీయ ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు రూ.64,184 కోట్లు కేటాయించటం హర్షణీయం.’’

హేమంత్‌ దాగా, ఎడిల్‌వెయిస్‌ అస్సెట్‌
‘‘ఇది అద్భుతమైన స్ట్రోక్‌ . రోడ్లు, విమానాశ్రయాలు వంటి నిర్మాణాత్మక ఆస్తులపై పెద్ద ఎత్తున ప్రభుత్వం కేటాయించడం.. ప్రభుత్వం, పెట్టుబడిదారులకు కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇది ప్రభుత్వం ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు మాత్రమే కాకుండా.. మూలధనాన్ని ఇతర గ్రీన్‌ఫీల్డ్‌ పథకాల్లో పెట్టుబడులు సమకూరేందుకు దోహదపడుతుంది.

పీ గోపీచంద్‌, హిందుజా గ్రూప్, కో చైర్‌ పర్సన్‌
‘‘ఈ కష్ట కాలంలో మార్గదర్శకమైన, విభిన్నమైన అందరినీ కలుపుకుపోయే బడ్జెట్‌ను సమర్పించినందుకు ఆర్థికమంత్రికి అభినందనలు.  రూ.5.54 లక్షల కోట్ల మూలధన వ్యయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 34.5 శాతం ఎక్కువ.. ఇది మౌలిక వసతులు, నిర్మాణ రంగం, ఉపాధి కల్పనలకు ఊతమిస్తుంది. బీమారంగంలో విదేశీ పెట్టుబడులక శాతం పెంపు తదితర చర్యలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహిస్తుంది.

ఎంపీ అహ్మద్‌, ఛైర్మన్‌, మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌
‘‘పసిడి మీద 7.5 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.. సరైన దిశగా తీసుకున్న చర్య. ఆభరణాల రంగం ఎంతకాలంగానో విజ్ఞప్తి ఈ మేరకు చేస్తోంది. అధిక దిగుమతి సుంకం పరోక్షంగా అక్రమ బంగారం రవాణాలు ప్రోత్సహించటమే కాకుండా.. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతుంది. తాజా చర్య వాణిజ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పారదర్శకమైన వర్తకం వినియోగదారుల నమ్మకాన్ని ఎప్పుడూ బలోపేతం చేస్తుంది.’’

రస్సెల్‌ గైటోండే, భాగస్వామి, డెలాయిట్‌ ఇండియా (బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌)
‘‘బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంచాలంటూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఇది ఎప్పటి నుండో మేము అభ్యర్థిస్తున్న చర్య. బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, దానిని మరింత బలోపేతం చేసేందుకు దారితీస్తుంది. ఇక నిరర్ధక ఆస్తులను బ్యాంకింగ్‌  రంగంలో తీసుకున్న చర్యలు కూడా ఉత్తమమైనవి. ఇది ఆ రంగం మరింత మెరుగయేందుకు సహాయపడతాయి.’’

పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌, ఆగ్నేయాసియా రీజనల్‌ డైరక్టర్‌
‘‘2021 నాటి భారత బడ్జెట్‌లో ఆరోగ్య రంగంపై చూపించిన శ్రద్ధ, దృష్టి కేంద్రీకరించటం ఆ దేశం కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకే కాకుండా, ఆరోగ్యవంతమైన, సమయానుకూలమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించేందుకు నిదర్శనం.’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని