బడ్జెట్‌లో ఎన్నికల వరాలు!

కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రాలన్నీ ఆశగా చూస్తున్న వేళ.. కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తాజా బడ్జెట్‌లో కనిపించింది.

Updated : 01 Feb 2021 20:04 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రాలన్నీ ఆశగా చూస్తున్న వేళ.. కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తాజా బడ్జెట్‌లో కనిపించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో రోడ్లు, రైల్వేల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న భాజపా ప్రభుత్వం తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసింది. వీటితోపాటు కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, అసోంలకూ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం కలిపించింది.

తమిళనాడుకు లక్ష కోట్లతో..
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న భాజపా ఇప్పటికే వ్యూహాలు అమలు చేయడంలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు జరిపింది. రాష్ట్రంలో 3500కి.మీ జాతీయ రహదారుల అభివృద్ధికోసం ఏకంగా రూ.1.03లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వీటిలో మధురై-కొల్లం కారిడార్‌, చిత్తూర్‌-తాచ్చూర్‌ కారిడార్లను అభివృద్ధి చేయనుంది. అంతేకాకుండా ఆదిచనల్లూర్‌లో పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించింది.

కేరళలోనూ..
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్న కేరళకు తాజా బడ్జెట్‌లో అధిక మొత్తంలో కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఏకంగా రూ.65వేల కోట్లను కేంద్రం కేటాయించింది. ఇలా ఉంటే, 2016 ఎన్నికల్లో ఇక్కడ ఒకేఒక్క  స్థానాన్ని భాజపా కైవసం చేసుకోగలిగింది. తాజా ఎన్నికల్లో మాత్రం తన బలాన్ని ప్రదర్శించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే బడ్జెట్‌లో కేరళకు ప్రాధాన్యత ఇచ్చినట్లు రాజకీయ ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమతా ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో ఇప్పటికే భాజపా పలు వ్యూహాలు రచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో భారీగానే కేటాయింపులు జరిపింది. రాష్ట్రంలో దాదాపు 695కి.మీ జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ.25వేల కోట్లను కేటాయించింది. అంతేకాకుండా బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు మరో వెయ్యి కోట్ల నిధితో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. దీంతో అక్కడి మహిళలు, గిరిజనులకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

బడ్జెట్‌లో కేటాయింపుల విషయం ఇలా ఉంటే, పశ్చిమ బెంగాల్‌ ప్రజలను ఆకట్టుకునేందుకు భాజపా ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్‌ షా, జేపీనడ్డా వంటి నేతలు అక్కడి బహిరంగ సభల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేసి బెంగాల్‌ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రసంగంలోనూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ మరోసారి బెంగాలీయులను ఆకట్టుకునే ప్రయత్నంచేశారు.

అసోంలో రూ.35వేల కోట్లు..
మరో కీలక రాష్ట్రమైన అసోంలో భాజపా గెలుపునకు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, రానున్న మూడు సంవత్సరాల్లో రూ. 34వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఖర్చుచేసేందుకు సిద్ధమైంది. తాజా బడ్జెట్‌లో ఈ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయింపులు చూస్తుంటే, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కేంద్రం వీటికి ఎక్కువ కేటాయింపులు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇవీ చదవండి..
నిర్మలమ్మ సిక్సర్‌: అభివృద్ధికి ఆరు పిల్లర్లు
బడ్జెట్‌లో ఆరోగ్యమస్తు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని