Byju's: ప్రపంచంలో అత్యంత విలువైన ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌

అంతర్జాతీయంగా టాప్‌ 35 యునికార్న్‌లలో మాత్రం ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ ఒక్కటే స్థానం దక్కించుకుంది....

Updated : 03 Aug 2022 17:08 IST

దిల్లీ: భారత్‌లో ఈ ఏడాది ప్రతి నెలా ఓ యునికార్న్‌(బిలియన్‌ డాలర్లు = రూ.7500 కోట్లు విలువ కలిగిన కంపెనీ) సంస్థ పుట్టుకొచ్చింది. కానీ, అంతర్జాతీయంగా టాప్‌ 35 యునికార్న్‌లలో మాత్రం ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ ఒక్కటే స్థానం దక్కించుకుంది. 

దేశీయంగా 21 బిలియన్ డాలర్ల విలువ కలిగిన తొలి సంస్థగా బైజూస్‌ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 13వ అత్యంత విలువైన అంకుర సంస్థ ఇదేనని సీబీ ఇన్‌సైట్స్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్యుటెక్ సంస్థగా నిలిచి రికార్డు సృష్టించింది. గతంలో తొలిస్థానంలో ఉన్న చైనా స్టార్టప్‌ యువాన్‌ఫుడావో విలువ 15.58 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

ఇక అంకుర సంస్థల విషయానికి వస్తే.. ప్రపంచంలో 35 టాప్‌ స్టార్టప్‌లలో 75 శాతం వాటా చైనా, అమెరికా కంపెనీలదే కావడం గమనార్హం. చైనాలో ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. స్టార్టప్‌ల సృష్టి మాత్రం ఆగలేదు. ఈ జాబితాలో భారత్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, స్వీడన్‌ నుంచి ఒక్కో కంపెనీ ఉన్నాయి. యూకే నుంచి మూడు కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి.

హోటల్‌ చైన్‌ ప్లాట్‌ఫాం ఓయో రూమ్స్ విలువ 10 బిలియన్‌ డాలర్లుగా‌, క్యాబ్‌ సేవల సంస్థ ఓలా విలువ 6.3 బిలియన్‌ డాలర్లుగా జనవరిలో బీఓఎఫ్‌ఏ గ్లోబల్‌ రీసెర్చి కంపెనీ అంచనా వేసింది. ఈ ఏడాది ఈ రెండు సంస్థలు కచ్చితంగా 10 బిలియన్‌ డాలర్ల మార్కుని దాటేస్తాయని అప్పట్లో తెలిపింది. కానీ, కరోనా రెండో దశ పరిస్థితుల్ని తలకిందులు చేసింది.

కొన్ని కంపెనీలు అంచనాలకు మించి రాణించాయి. జనవరిలో 2.5 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసిన గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌11 విలువ డిసెంబరు నాటికి ఏకంగా 8 బిలియన్‌ డాలర్లకు చేరడం గమనార్హం. భారత్‌లో మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఇదే కావడం విశేషం. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ విలువ ఈ ఏడాది 56 శాతం ఎగబాకి 5.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక 2020లో అసలు యునికార్న్‌ దరిదాపుల్లో కూడా లేని మీషో, క్రెడ్‌ వంటి సంస్థలు ఈ ఏడాది భారీగా రాణించాయి. ఈ రెండు కంపెనీలకు గత ఏప్రిల్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ నుంచి పెట్టుబడులు రావడంతో యునికార్న్‌ల జాబితాలో చేరాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని