ఇ- కామర్స్‌ రూల్స్‌ విషయంలో వెనక్కి తగ్గొద్దు

ఇ-కామర్స్‌ సంస్థల కోసం రూపొందించిన ముసాయిదా నిబంధనల విషయంలో వెనక్కి తగ్గొద్దని దేశీయ వర్తక సంఘం కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) కేంద్రాన్ని...

Published : 27 Jun 2021 19:46 IST

దిల్లీ: ఇ-కామర్స్‌ సంస్థల కోసం రూపొందించిన ముసాయిదా నిబంధనల విషయంలో వెనక్కి తగ్గొద్దని దేశీయ వర్తక సంఘం కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) కేంద్రాన్ని కోరింది. విదేశీ నిధులతో నడుస్తున్న ఇ-కామర్స్‌ సంస్థల ఒత్తిడులకు తలొగ్గొద్దని విజ్ఞప్తి చేసింది. నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ స్వరాలు వినిపిస్తున్న వేళ ఈ మేరకు కాయిట్‌ ప్రధానికి లేఖ రాసింది.

నూతనంగా రూపొందించిన నిబంధనలను వ్యతిరేకిస్తున్న ఇ-కామర్స్‌ సంస్థలు ఆ మేరకు ఒత్తిడులు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసి ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు కాయిట్‌ పేర్కొంది. ముసాయిదా నిబంధనల విషయంలో ఏమాత్రం మార్పులు చేయొద్దని కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ముసాయిదా నిబంధనలపై వచ్చిన సలహాలు, సూచనలను పరిశీలించి వెంటనే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా నోటిపై చేయాలని కోరింది. ఇ-కామర్స్‌ కంపెనీలు అనైతిక వ్యాపార పోకడలతో దేశంలో పెద్ద మొత్తంలో దుకాణాలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేసింది.

దేశంలో ఇ-కామర్స్‌ సంస్థలు వస్తు, సేవల ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించడానికి వీల్లేకుండా నిబంధన విధించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇటీవల ప్రతిపాదించింది. దీనికి సంబంధించి వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టానికి సవరణలను సూచించింది. జులై 6లోపు దీనిపై సూచనలు, సలహాలు తెలిపే వీలుంది. ముసాయిదా ప్రకారం.. ఆయా కంపెనీలు చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే, చట్టబద్ద ఏజెన్సీలతో సమన్వయం కోసం 24×7 అందుబాటులో ఉండే వ్యక్తి నంబర్‌ అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు పలు నిబంధనలను ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని