
అమెజాన్‌కు సీసీఐ షోకాజ్
దిల్లీ: ఫ్యూచర్‌గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అమెజాన్‌కు షోకాజ్‌ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసింది. ఫ్యూచర్‌గ్రూప్‌లోని ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఎఫ్‌సీఎల్)లో 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అమెజాన్ చేసుకున్న ఈ ఒప్పందాన్ని సీసీఐ ఆమోదించిన సంగతి విదితమే. ఫ్యూచర్ రిటైల్‌లో ఎఫ్‌సీఎల్ కూడా వాటాదారే. తదుపరి ఫ్యూచర్ రిటైల్‌ను రిలయన్స్ రిటైల్‌కు రూ24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్‌గ్రూప్ ఒప్పందం చేసుకోవడాన్ని నిలిపేందుకు అమెజాన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని, కోర్టులను ఆశ్రయించింది.
మధ్యవర్తిత్వ కోర్టు తీర్పునకు బియానీ కట్టుబడాలి
సుప్రీంకోర్టులో అమెజాన్
దిల్లీ: ఫ్యూచర్ గ్రూప్ అధిపతి బియానీ పలు ఒప్పందాలు చేసుకునేందుకు తమతో చర్చలు జరిపారని అమెజాన్ పేర్కొంది. రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ రిటైల్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేస్తూ సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పునకు ఆ సంస్థ కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టులో అమెజాన్ తన వాదనగా వినిపించింది. రిలయన్స్ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంపై ముందుకెళ్లకుండా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటల్ (ఎస్‌ఐఏసీ) ఇచ్చిన తీర్పు అమలు చేయతగినదని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన బెంచ్ ముందు అమెజాన్ పునరుద్ఘాటించింది. పలు ఒప్పందాలను అమెజాన్‌తో కుదుర్చుకునే విధంగా బియానీలు చర్చలు జరిపారని, మధ్యవర్తిత్వ కోర్టులో పార్టీలుగా ఉన్న బియానీలు తీర్పునకు కట్టుబడి ఉండాలని అమెజాన్ తరఫున సీనియర్ అడ్వకేట్ ఆస్పి చినోయ్ వాదించారు. రిలయన్స్‌తో ఫ్యూచర్ ఒప్పందంపై ముందుకెళ్లేందుకు దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించడాన్ని సవాల్ చేస్తూ అమెజాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో కిశోర్ బియానీ, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కూపన్‌లతో పాటు 15 మంది ఇతరులను ప్రతివాదులుగా చేర్చింది.
Advertisement