స్విగ్గీలో వాటా కొనుగోలుకు సాప్ట్‌బ్యాంక్‌కు సీసీఐ పచ్చజెండా

స్విగ్గీలో వాటా కొనుగోలు చేసేందుకు సాప్ట్‌బ్యాంక్‌ గ్రూపు సంస్థ కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. బుండి టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఎస్‌వీఎఫ్‌-2

Published : 13 Jul 2021 00:52 IST

దిల్లీ: స్విగ్గీలో వాటా కొనుగోలు చేసేందుకు సాప్ట్‌బ్యాంక్‌ గ్రూపు సంస్థ కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. బుండి టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఎస్‌వీఎఫ్‌-2 సాంగ్‌బార్డ్‌ (డీఈ) ఎల్‌ఎల్‌సీ కొంత వాటాను కొనుగోలు చేయనుందని సీసీఐకి సమర్పించిన ఓ నోటీసు ఆధారంగా తెలుస్తోంది. ఎస్‌వీఎఫ్‌... సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూపునకు చెందిన సంస్థ. కంపెనీల్లో మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టే సంస్థగా దీనిని ఏర్పాటు చేశారు. బుండి భారత్‌లో ఏర్పాటైన ఓ ప్రైవేట్‌ లిమిడెడ్‌ కంపెనీ. ఈ సంస్థ స్విగ్గీతో కలిసి పనిచేస్తోంది. ఈ కొనుగోలు లావాదేవీ అనంతరం స్విగ్గీ విలువ 5 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘బుండి టెక్నాలజస్‌లో (స్విగ్గీ) ఎస్‌వీఎఫ్‌-2 సాంగ్‌బర్డ్‌ (సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూపు) కొంత వాటా కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపామ’ని సోమవారం సీసీఐ ట్వీట్‌ చేసింది.


భారత స్థిరాస్తిలో పీఈ పెట్టుబడుల జోరు

దిల్లీ: ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత స్థిరాస్తి రంగంలో ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు మూడింతలకు పైగా పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.14,300 కోట్లు)కు చేరినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్‌ సవిల్స్‌ ఇండియా పేర్కొంది. వాణిజ్య ఆస్తులకు గిరాకీ పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. 2020 జనవరి- జూన్‌లో 870 మిలియన్‌ డాలర్లుగా ఉన్న పీఈ పెట్టుబడులు.. 2021 ప్రథమార్థంలో 2,729 మిలియన్‌ డాలర్లకు దూసుకెళ్లాయి. 2020 మొత్తం ఏడాదిలో పీఈ పెట్టుబడులు 6.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కొవిడ్‌-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పటికీ.. పెట్టుబడిదార్ల విశ్వాసం చెదరకపోవడాన్ని పీఈ పెట్టుబడుల జోరు సూచిస్తున్నట్లు సవిల్స్‌ తెలిపింది. 2021 రెండో త్రైమాసికంలో పెట్టుబడులు 54 శాతం తగ్గి 865 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6300 కోట్లు)గా చేరినట్లు పేర్కొంది. ఇంటి నుంచే పని సంస్కృతి పెరుగుతున్నప్పటికీ.. వాణిజ్య కార్యాలయాల ఆస్తులకు గిరాకీ బాగానే ఉందని, పీఈ పెట్టుబడుల్లో 40 శాతం వాటా వీటిదేనని సవిల్స్‌ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు