Updated : 24 Jun 2021 04:45 IST

గూగుల్‌పై సీసీఐ దర్యాప్తు

స్మార్ట్‌టీవీ ఆపరేటింగ్‌ వ్యవస్థలో ఆధిపత్యం చూపుతోందనే ఆరోపణలు

దిల్లీ: దేశంలోని స్మార్ట్‌ టీవీ ఆపరేటింగ్‌ వ్యవస్థ విపణిలో అనైతిక వ్యాపార పద్ధతులు పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్‌పై సమగ్ర దర్యాప్తునకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. గూగుల్‌పై వచ్చిన ఫిర్యాదును మదింపు చేసిన తర్వాత.. భారత్‌లోని స్మార్ట్‌ టీవీ డివైజ్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థల లైసెన్సుల్లో సంస్థ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నట్లు సీసీఐ నిర్థారణకు వచ్చింది. టాడా కింద గూగుల్‌ యాప్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేయడాన్ని తప్పనిసరి చేస్తోందని, స్మార్ట్‌ టీవీ తయారీదార్లుపై అనైతికంగా షరతులు విధిస్తున్నట్లు సీసీఐ 24 పేజీల ఆదేశాల్లో పేర్కొంది. ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్ట్‌ ప్రాజెక్ట్‌ (ఏఓఎస్‌పీ)ను మూడో పార్టీకి ఓపెన్‌ సోర్స్‌ లైసెన్స్‌ కింద ఎవరికైనా ఇస్తూనే, గూగుల్‌కు మేధోపరమైన హక్కులున్న ప్లేస్టోర్‌, యూట్యూబ్‌ వంటి వాటిని టీవీ తయారీ సంస్థలకు ఇవ్వడం లేదని, ఆండ్రాయిడ్‌ లోగో వినియోగానికీ హక్కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఇవి ఇవ్వాలంటే, టాడా కింద ఒప్పందం చేసుకోవాలని టీవీ తయారీ కంపెనీలకు షరతు విధిస్తోందని తెలిపింది. పోటీ చట్టంలోని సెక్షన్‌ 4(2)(ఏ)కు ఇది విరుద్ధమని తెలిపింది. స్మార్ట్‌ టీవీ లైసెన్సింగ్‌ విధానాల్లో పూర్తిగా నిబంధనలను పాటిస్తున్నట్లు గూగుల్‌ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

హైబ్రిడ్‌ క్లౌడ్‌ పరిశోధనలకు చేతులు కలిపిన ఐబీఎం, ఐఐఎస్‌సీ 

ఈనాడు, హైదరాబాద్‌: హైబ్రిడ్‌ క్లౌడ్‌ పరిశోధనల విభాగంలో ఐబీఎం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) కలిసి పనిచేయనున్నాయి. ఇందులో భాగంగా హైబ్రిడ్‌ క్లౌడ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బెంగళూరులోని ఐఐఎస్‌సీ ప్రాంగణంలో దీన్ని నెలకొల్పుతారు. ఈ ల్యాబ్‌ లో ఐఐఎస్‌సీ విద్యార్థులు, అధ్యాపకులు, ఐబీఎం శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తారు. ఈ భాగస్వామ్యం మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నట్లు ఐబీఎం రీసెర్చ్‌ ఇండియా డైరెక్టర్‌ గర్గి దాస్‌గుప్తా అన్నారు. హైబ్రిడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఐబీఎం కట్టుబడి ఉందని వివరించారు. పరిశ్రమ- విద్యాసంస్థల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని ఐఐఎస్‌సీ డీన్‌ నవకాంత భట్‌ అభిప్రాయపడ్డారు. ఐబీఎంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts