ఎయిర్‌టెల్‌కు సీఈఆర్‌టీ-ఐఎన్‌ గుర్తింపు

కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఐఎన్‌) నుంచి తమకు ఎంపానెల్‌మెంట్‌ (గుర్తింపు) లభించిందని భారతీ...

Published : 01 Apr 2021 01:14 IST

ప్రభుత్వ సంస్థలకు సైబర్‌ భద్రతా సేవలు అందించే అవకాశం

దిల్లీ: కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఐఎన్‌) నుంచి తమకు ఎంపానెల్‌మెంట్‌ (గుర్తింపు) లభించిందని భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఈ గుర్తింపు లభించడంతో తాము ప్రభుత్వ సంస్థలకు సైబర్‌ భద్రతా సేవలు అందించే అవకాశం లభించిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సైబర్‌ భద్రతా సొల్యూషన్స్‌ అందించే వెసులుబాటును సాధించామని, కార్పొరేట్‌ ఖాతాదారులకు అందించే సేవలకు ఇవి అదనమని పేర్కొంది.

సెప్టెంబరు 30 వరకు ప్రస్తుత విదేశీ వాణిజ్య విధానం పొడిగింపు

దిల్లీ: ప్రస్తుతం అమల్లో ఉన్న విదేశీ వాణిజ్య విధానమే (ఎఫ్‌టీపీ) మరో 6 నెలల పాటు కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబరు 30 వరకు ప్రస్తుత పాలసీనే కొనసాగించనున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్థిక వృద్ధిని పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించేందుకు ఎగుమతులు పెంచేలా మార్గదర్శకాలను ఎఫ్‌టీపీ రూపొందిస్తుంది. 2020 మార్చి 31న ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానాన్ని (2015-20) మరో ఏడాది పాటు (2021 మార్చి 31 వరకు) పొడిగించింది. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం మళ్లీ కేసులు పెరుగుతున్నందున, ఎఫ్‌టీపీని మరో 6 నెలలు పొడిగించామని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇదిలా ఉంటే, ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య భారత ఎగుమతులు 12.23 శాతం తగ్గి 25,600 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. దిగుమతులు 23.11 శాతం తగ్గి, 34,080 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 8,462 కోట్ల డాలర్లుగా నమోదైంది.

హెమ్మోను కోనుగోలు చేయనున్న పిరమిల్‌

దిల్లీ: పిరమిల్‌ గ్రూపునకు చెందిన పిరమిల్‌ ఫార్మా లిమిటెడ్‌ (పీపీఎల్‌), రూ.775 కోట్లకు హెమ్మో ఫార్మాసూటికల్స్‌ను కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా హెమ్మా ఫార్మాసూటికల్స్‌, పీపీఎల్‌కు అనుబంధ సంస్థగా మారుతుంది. దీంతో పెప్టైడ్‌ ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) తయారీలోకి విస్తరించే అవకాశం ఏర్పడుతుందని పిరమిల్‌ గ్రూపు పేర్కొంది. పిరమిల్‌ గ్రూపు నేతృత్వంలో హెమ్మో ఫార్మాసూటికల్స్‌ వేగంగా వృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నట్లు హెమ్మో ఫార్మాసూటికల్స్‌ ఎండీ మధు ఉతమ్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని