కెయిర్న్ ఎనర్జీ వివాదం.. భారత్‌కు షాక్
కెయిర్న్ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్(పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బు చెల్లించనందుకు గానూ.
పారిస్‌లో ఆస్తులు జప్తు చేసుకున్న కంపెనీ..!
దిల్లీ: కెయిర్న్ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్(పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బు చెల్లించనందుకు గానూ.. ఫ్రాన్స్‌లోని భారత ప్రభుత్వ ఆస్తుల జప్తుకు అవసరమైన న్యాయప్రక్రియను బుధవారం పూర్తి చేసినట్లు పీటీఐ పేర్కొంది. ఫ్రెంచ్ కోర్టు అనుమతుల మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు కూడా వెల్లడించాయి.
భారత ప్రభుత్వ ఆస్తుల యాజమాన్య హక్కులను కెయిర్న్ ఎనర్జీ తీసుకునేందుకు ఫ్రెంచ్ కోర్టు జూన్ 11నే ఉత్తర్వులు జారీ చేసిందని, అందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ బుధవారంతో ముగిసిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. పారిస్‌లో భారత ప్రభుత్వానికి చెందిన దాదాపు 20 ఆస్తులను కంపెనీ జప్తు చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ 20 మిలియన్ యూరోలకు పైనే ఉంటుందట.
భారత ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ గతేడాది డిసెంబర్‌లో ఆర్బిట్రేషన్ న్యాయస్థానం కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ కంపెనీకి 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని భారత్‌ను ఆదేశించింది. అయితే, ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో సొమ్ము రాబట్టుకోవడం కోసం కెయిర్న్ ఎనర్జీ పలు దేశాల్లోని న్యాయస్థానాలను ఆశ్రయించింది. అమెరికా, యూకే, నెదర్లాండ్స్, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, జపాన్, యూఏఈ తదితర దేశాల్లోని కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. ఆయా దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్ కోర్టు నుంచి అనుమతులు రావడంతో అక్కడి భారత ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఏంటీ వివాదం..
2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ ‘కెయిర్న్ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.
దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్-భారత్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్ ఎనర్జీ ఆర్బిట్రేషన్(అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు)ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్ ఎనర్జీకి 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఆర్బిట్రేషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ భారత్ కూడా పిటిషన్ దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justin Trudeau: ‘మేం చేసింది ఘోర తప్పిదం.. క్షమించండి’: కెనడా ప్రధాని ట్రూడో
-
Balapur Laddu Auction: అత్యధిక ధరకు బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఎంత పలికిందంటే?
-
Nitish kumar: మనం బ్రిటీష్ కాలంలో జీవించట్లేదు కదా.. ఆంగ్లంలో డిజిటల్ సైన్బోర్డ్ ఏర్పాటుపై మండిపడ్డ నీతీశ్
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్