Life Insurance: ఒకటి కంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలు ఉండొచ్చా?

ఒకటి కంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలు తీసుకోవచ్చా? తీసుకుంటే ప్రయోజనాలేంటి?...

Published : 21 Sep 2021 12:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో బీమా అవసరంపై అవగాహన పెరిగింది. గత ఏడాది వ్యవధిలో చాలా మంది కొత్త పాలసీలు తీసుకున్నారు. ముఖ్యంగా యువత వివిధ బీమా పథకాలపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు పాలసీలు కూడా తీసుకుంటున్నారు. మరి ఒకటి కంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలు తీసుకోవచ్చా? తీసుకుంటే ప్రయోజనాలేంటి?

నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ జీవిత బీమా పాలసీలు ఉండొచ్చు. మన ఆర్థిక లక్ష్యాలు, అవసరాలను సరిగ్గా ప్లాన్‌ చేసుకుంటే అసలు ఒక జీవిత బీమా పాలసీ సరిపోదంటున్నారు ఆర్థిక నిపుణులు. అలా అని మరీ ఎక్కువ ఉండడం కూడా ప్రయోజనకరం కాదని సూచిస్తున్నారు. ఎక్కువ ఉంటే వాటి నిర్వహణ కూడా భారంగా మారుతుంది. పైగా ఏ ఒక్క పాలసీ ప్రీమియం చెల్లింపులో జాప్యం జరిగినా.. అది మన క్రెడిట్‌ చరిత్రపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎందుకు ఎక్కువ పాలసీలు ఉండాలి..

వయసు పెరుగుతున్న కొద్దీ మనపై బాధ్యతలు పెరుగుతుంటాయి. అలాగే ఇంట్లో పిల్లలు ఎదుగుతుంటారు. వారి విద్య, వైద్య ఖర్చులతో పాటు మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీ నుంచి వారికి ఆర్థిక రక్షణ అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ.. వేతనాలు, ఇతరత్రా ఆదాయాలు పెరుగుతాయి. వాటికి అనుగుణంగా పాలసీలు పెంచుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్లలో తీసుకున్న పాలసీ 50ఏళ్ల అవసరానికి సరిపోకపోవచ్చు. కాబట్టి అప్పటి అవసరాలు మీకు అవగతమవుతున్న కొద్దీ పాలసీలు పెంచుకోవాలి. అయితే, పాలసీల ఎంపికలో జాగ్రత్త వహించాలి. మీ అవసరాలు, లక్ష్యాలకు సరిపడే వాటినే ఎంచుకోవాలి. అయితే, ప్రీమియంలు మాత్రం సకాలంలో చెల్లించాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ముందు తీసుకున్న పాలసీల వివరాలు వెల్లడించాలి..

ఒక పాలసీ ఉండగానే ఇంకొకటి తీసుకోవాలనుకుంటే.. ముందు తీసుకున్న దాని వివరాలు రెండో పాలసీలు కచ్చితంగా తెలియజేయాలి. అలా కొత్త పాలసీ తీసుకున్న ప్రతిసారీ మునుపటి వాటి వివరాలు వెల్లడించాలి. అలాగే ఆ పాలసీల వెనుక ఉద్దేశ్యమేంటో కూడా తెలియజేయాలి. అప్పుడే క్లెయిమ్‌ చేసుకునే సమయంలో రిజెక్ట్‌ కాకుండా ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు.

పన్ను మినహాయింపులు..

జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఎన్ని పాలసీలు ఉంటే అన్నింటిపై పన్ను రాయితీ లభించకపోవచ్చు. కానీ, మీరు చెల్లిస్తున్న పాలసీల్లో అత్యధిక ప్రీమియం దేనికి ఉంటే దానికి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ మినహాయింపు పొందే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని