Crowdfunding:  విరాళాలపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌చ్చా? 

క్రౌడ్‌ఫండింగ్ సంస్థ‌ల‌ ద్వారా డొనేట్ చేసే వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జి ప్రకారం పన్ను మినహాయింపు పొంద‌చ్చు  

Updated : 15 Jun 2021 13:14 IST

ప్ర‌స్తుతం కోవిడ్ మ‌హ‌మ్మారితో దేశం పోరాడుతుంది. అవ‌స‌రంలో ఉన్న వారికి స‌హాయప‌డ‌మ‌ని కోరుతూ సోష‌ల్ మీడియా వెబ్‌సైట్‌ల‌లో త‌రుచుగా పోస్టులు చూస్తూనేవున్నాం. సాధార‌ణంగా ఇటువంటి అభ్య‌ర్థ‌న‌లు క్రౌడ్‌ఫండింగ్ వేదిక‌ల నుంచి వ‌స్తుంటాయి. మంచి మ‌న‌స్సుతో సాయం చేయాల‌నుకునే వారిని, సాయం కోరే వారిని ఒకే వేదిక‌పైకి తీసుకురావ‌డ‌మే ఈ క్రౌడ్ ఫండింగ్‌. 

ఉదాహ‌ర‌ణ‌కి, ఒక వ్య‌క్తి వైద్యానికి రూ. 10 ల‌క్ష‌లు కావాల‌నుకుంటే, ఒకే వ్య‌క్తి అంత మొత్తాన్ని స‌మ‌కూర్చ‌డం క‌ష్టం. అదే వెయ్యి మంది రూ.1000 చొప్పున విరాళం ఇస్తే అది స‌మ‌కూర్చ‌డం పెద్ద క‌ష్టం కాదు. ఇటీవ‌లే ఒక చిన్నారి కోసం క్రౌడ్‌ఫండింగ్ ద్వారా సుమారు రూ.16కోట్లు సేక‌రించ‌డం మ‌నం చూసాం. ఇందుకోసం ఏదైనా క్రౌడ్‌ఫండింగ్ వెబ్‌సైట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే, వైబ్‌సైట్ వారు వివ‌రాల‌ను వెరిఫై చేసి స‌రైన‌వ‌నుకుంటే సాయం కోసం ప్ర‌చారం చేస్తారు.
 
మీరు అలాంటి ఏదైనా ప్లాట్‌ఫామ్ ద్వారా విరాళం ఇస్తుంటే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జి ప్రకారం పన్ను మినహాయింపు పొంద‌చ్చు. అయితే మీరు ఇచ్చే ప్ర‌తీ విరాళానికి మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోలేక‌పోవ‌చ్చు. కార‌ణం అన్ని సంస్థ‌లు సెక్ష‌న్ 80జి ప్ర‌కారం క్వాలిఫైడ్ స‌ర్టిఫికేట్‌ను జారీచేయ‌వు. అలాగే ఆహారం, బ‌ట్ట‌లు రూపంలో చేసే విరాళాల‌కు సెక్ష‌న్ 80జి కింద త‌గ్గింపు వ‌ర్తించ‌దు.

విరాళాల‌పై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవాలంటే.. ఏంచేయాలి?

రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి..
ఇచ్చిన విరాళంపై ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఏ స్వ‌చ్ఛంద‌ సంస్థ‌కైతే విరాళం ఇస్తారో.. సదరు సంస్థ సెక్ష‌న్ 80జి ప్రకారం స‌ర్టిఫికేట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకుగానూ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆదాయ‌పు శాఖ వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. న‌మోదిత స్వ‌చ్ఛంద సంస్థ‌కు ఇచ్చిన విరాళంపై 50 నుంచి 100శాతం మిన‌హాయంపును క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

"ఐటీ శాఖ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన సంస్థ‌లు.. రిజిస్ట‌ర్ కానీ లాభాపేక్ష లేని సంస్థ‌లు కూడా క్రౌడ్ ఫండింగ్‌లో పాలుపంచుకుంటాయి. మీరు క్రౌడ్‌ఫండింగ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా డొనేట్ చేస్తున్న‌ట్ల‌యితే, సెక్ష‌న్ 80జి ప్రకారం వ్యాలీడ్ స‌ర్టిఫికేట్ ఇస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అటువంటి సంస్థ‌ల ద్వారా మాత్ర‌మే డొనేట్ చేయాలి." అని క్లియ‌ర్ ట్యాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ అర్చిత్ గుప్తా తెలిపారు.  

రిజిస్ట్రేష‌న్ వివ‌రాల‌ను తెలుసుకోవ‌డం ఎలా?
"ప్రతి క్రౌడ్ ఫండింగ్ సంస్థ  సెక్ష‌న్ 80జి ప్ర‌కారం మినహాయింపును పొందే అర్హత వివరాలను.. విరాళం స్వీకరించే సమయంలో అందిస్తుంది. ఇది కాకుండా,  80జి కింద ఆమోదం పొందిన‌ సంస్థలను ప‌న్ను పోర్ట‌ల్‌లో చూసి ధృవీకరించవచ్చు "అని డెలాయిట్ ఇండియా భాగస్వామి సుధాకర్ సేతురామన్ అన్నారు.

ఫారం 10 బిడి..
ప్రజల తరపున విరాళాలు సేక‌రించిన‌ స్వచ్ఛంద సంస్థ.. విరాళాలు ఇచ్చిన వ్యక్తుల వివరాలను పన్ను శాఖ‌కు తెలిపేందుకు ఫారం10బిడి ని దాఖలు చేయాలి. ఐటి శాఖ ఫ్రీ ఫైల్డ్ ఫారం(ముందుగా నింపిన సమాచార ప‌త్రాల‌ను)ల‌ను పన్ను చెల్లింపుదారులకు ఇచ్చేందుకు ఇది సహాయపడుతుంది.

"ప్ర‌భుత్వ జాబితాలో ఉన్న స్వ‌చ్చంధ సంస్థ‌లు..వివిధ దాత‌లు నుంచి సేక‌రించిన విరాళాలకు సంబంధించి స్టేట్‌మెంట్‌ను.. వారి పాన్ నెంబ‌రు, విరాళం విలువ‌తో స‌హా ఫారం 10బిడి లో పూర్తిచేసి ఇవ్వాలి. దీంతో ప‌న్ను అధికారులు, దాత‌ల ప‌న్ను రిట‌ర్నుల‌లో సెక్ష‌న్ 80జి కింద డిడెక్ష‌న్ ఫ్రీ-ఫైల్ చేస్తారు.  ఫారం 10బిఇ రూపంలో డొనేష‌న్‌కు సంబంధించిన స‌ర్టిఫికేట్‌ను ప‌న్ను చెల్లింపుదారుడు పొందుతుండ‌చ్చు." అని  సేతురామన్ అన్నారు.

ప్రీ-ఫైల్డ్ వివ‌రాల ధృవీక‌ర‌ణ‌..
స్వ‌ఛ్చంద సంస్థ‌లు ఇచ్చిన స‌మాచారంతో ఐటీ శాఖ ముందుగానే ప‌త్రాల‌ను నింపి ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఇస్తుంది.  ఐటీఆర్‌ను దాఖ‌లు చేసేముందు ఈ స‌మాచారాన్ని త‌ప్ప‌నిస‌రిగా ధృవీక‌రించాలి. సంస్థ జారీచేసిన ర‌శీదుతో వెరిఫికేష‌న్ పూర్తి చేయ‌వ‌చ్చు. 

"పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ముందు విరాళం మొత్తం, సంస్థ వివరాలు, విరాళం అర్హత ప్రమాణాలు (50 శాతం లేదా 100 శాతం క్లెయిమ్‌కు ఉన్న‌) ధృవీకరించడం మంచిది" అని సేతురామన్ అన్నారు.

సంస్థ ఇచ్చిన రశీదులో మీ పేరు, చిరునామా, పాన్ వివ‌రాలు స‌రిచూసుకోవాలి. ఆదాయ‌పు ప‌న్ను శాఖ జారీచేసిన‌ ట్ర‌స్ట్ రిజిష్ట‌ర్ నెంబ‌రు ర‌శీదుపై ముద్రించి ఉండాలి. సంస్థ రిజిస్ట‌ర్ నెంబ‌రు ప్ర‌స్తుతం మ‌నుగ‌డ‌లో ఉందా.. పున‌రుద్ధ‌రించాల్సి ఉందా తెలుసుకునేందుకు వ్యాలిడిటీ తేదిని కూడా ర‌శీదుపై ముద్రిస్తారు. అది కూడా వెరిఫై చేయాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని