రిజిష్ట‌ర్ కాకుండా ఇల్లు అమ్మితే.. పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయా?

ఇంటిని కొనుగోలు చేసిన వెంట‌నే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌డం ద్వారా భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Updated : 19 Jun 2021 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధార‌ణంగా ఇల్లు కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించిన పూర్తి మొత్తాన్ని చెల్లించి త‌మ‌ పేరుపై రిజిస్ట్రేష‌న్ చేయించుకుంటారు. కొన్నిసార్లు కొనుగోలుదారులు పూర్తి డ‌బ్బు చెల్లించిన‌ప్ప‌టికీ రిజిస్ట్రేష‌న్ పూర్తిచేయ‌రు. దీనికి అనేక కార‌ణాలు ఉండొచ్చు. ఇంట్లో నివసించడం ప్రారంభించాక రిజిస్ట్రేషన్‌ వాయిదా వేసేవారు కొంద‌రైతే.. డెవలపర్‌ లేదా అమ్మకందారు సహకారం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తుంటారు మరికొందరు. ఒక‌వేళ ఇల్లు అమ్మాల‌నుకుంటే.. రిజిస్ట్రేష‌న్ పూర్తి చేయ‌క‌పోతే దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి కింద ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతారా? దీర్ఘ‌కాల రాబ‌డిని లెక్కించేందుకు ఏ తేదీని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి?

ఒక వ్య‌క్తి ఆస్తి కొనుగోలు చేసిన త‌ర్వాత 24 నెల‌ల పాటు అమ్మ‌కుండా త‌న అధీనంలోనే ఉంచుకుంటే దానిని దీర్ఘ‌కాల మూల‌ధ‌న ఆస్తిగా ప‌రిగ‌ణిస్తారు. ఇటువంటి సంద‌ర్భంలో అనుస‌రించేందుకు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేష‌న్ రెండు సర్క్యలర్లు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం... డెవ‌ల‌ప‌ర్ ఆస్తి కేటాయింపు లెట‌ర్‌ (ఎలాట్‌మెంట్ లెట‌ర్‌)ను జారీ చేసిన‌ప్పుడు, కొనుగోలుదారుడు ఆస్తి టైటిల్‌ను పొందుతాడు. బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించిన త‌ర్వాత స్వాధీన లేఖ‌, ప్లాట్ రిజిస్ట్రేష‌న్ వంటి ఫార్మాలిటీలు పూర్తిచేస్తారు. 

కొనుగోలుదారులు టోకెన్ అమౌంట్‌ను చెల్లించి, కేటాయింపు లేఖ‌ను స్వీక‌రించిన త‌రువాత ఆస్తి య‌జ‌మానులుగా ప‌ర‌గ‌ణించొచ్చని ఆదాయ‌పు ప‌న్ను ట్రిబ్యున‌ల్ స‌ర్క్యులర్‌లో సూచించారు. 

‘‘ఒక వ్య‌క్తి ఇంటి కొనుగోలు హ‌క్కును పొందిన‌ట్ల‌యితే, అది అత‌డికి చెందిన మూల‌ధ‌న ఆస్తి అవుతుంది. అందువ‌ల్ల అత‌డు త‌న హ‌క్కును విక్ర‌యించిన‌ప్పుడు, దానిపై వ‌చ్చే లాభాన్ని మూల‌ధ‌న లాభంగానే చూడాలి. కొనుగోలుదారులు కేటాయింట‌పు లెట‌ర్‌ను తీసుకున్న‌ప్ప‌టి నుంచి యాజ‌మాన్య హ‌క్కు ప్రారంభ‌మ‌వుతుంది. ఈ కేటాయింపు ప‌త్రంలో ఆస్తికి సంబంధించిన వివ‌రాలతో పాటు, చెల్లింపు వివ‌రాలు (కొనుగోలుకు సంబంధించి అమ్మిన వ్య‌క్తికి చెల్లించిన మొత్తం.. చెల్లించాల్సిన బ్యాలెన్స్ త‌దిత‌రాలు) ఉంటాయి’’ అని ట్యాక్స్‌మేన్‌.కామ్‌ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ న‌వీన్ వాధ్వా వివ‌రించారు.

ఏది ఏమైన‌ప్ప‌టికీ కొనుగోలు చేసిన వెంట‌నే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌డం మంచింది. అయితే, ఇవి సీబీడీటీ స‌ర్క్యుల‌ర్‌లో ఉన్న‌ మార్గ‌ద‌ర్శ‌కాలు మాత్ర‌మే. ఇవి నిబంధ‌న‌ల్లో అయితే భాగం కాదు. ఇందుకోసం రిజిస్ట్రేష‌న్ యాక్ట్‌, ఇండియ‌న్ స్టాంప్ డ్యూటీ యాక్ట్‌, ట్రాన్స‌ఫ‌ర్ ఆఫ్ ది ప్రాప‌ర్టీ యాక్ట్ వంటి కొన్ని చ‌ట్టాలు, నిబంధ‌న‌లు ఉన్నాయి. ఇవి ఆస్తిని రిజిస్ట్రేష‌న్ చేయించాల్సిన‌ అవ‌స‌రాన్ని స్పష్టంగా తెలియ‌జేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని