
అమెరికా నుంచి రిలయన్స్‌కు కర్బన తటస్థ ఇంధనం
దిల్లీ: అమెరికా నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటి ‘కర్బన తటస్థ ఇంధనా’న్ని ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అందుకుంది. 2035 నాటికి కర్బన రహిత సంస్థగా మారాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి విదితమే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ చమురు శుద్ధి కాంప్లెక్స్‌కు అమెరికాలోని పెరిమియన్ బేసిన్ నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల కర్బన తటస్థ ఇంధనం తరలి వచ్చింది. అమెరికా చమురు దిగ్గజం ఆక్సిడెంటల్ విభాగం ఆక్సీ లో కార్బన్ వెంచర్స్ ఈ ఇంధనాన్ని సరఫరా చేసింది. మెక్వారీ గ్రూప్‌కు చెందిన కమొడిటీస్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ గ్రూప్ భాగస్వామ్యంలో ఈ లావాదేవీ నిర్వహించినట్లు ఆక్సీ లో కార్బన్ తెలిపింది. జనవరి 28న జామ్‌నగర్‌లో కర్బన తటస్థ ఇంధనం కలిగిన కార్గో నౌకను అన్లోడ్ చేశారు.
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌లో నిత్యావసరాలు
దిల్లీ: డిజిటల్ బీ2బీ మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ యాప్‌లో కొత్తగా నిత్యావసరాలను జత చేయనుంది. కిరాణా కొట్లు, చిన్న పాటి రిటైలర్లు మరిన్ని ఉత్పత్తులను ఇందులో నుంచి ఎంచుకునే అవకాశం కలుగుతుందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ బుధవారం తెలిపింది. తొలుత గురుగ్రామ్‌లోని రిటైలర్లకు ఈ గ్రాసరీ విభాగం అందుబాటులో ఉంటుంది. కొద్ది నెలల్లో ఇతర నగరాలకు విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. ఈ విభాగం ద్వారా దేశవ్యాప్తంగా 6,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ ప్రకటనలో తెలిపింది.
ఎస్కేఎఫ్ ఇండియా తొలి ఆన్లైన్ స్టోర్
ముంబయి: స్వీడన్‌కు చెందిన బేరింగ్ తయారీ కంపెనీ ఎస్కేఎఫ్ భారత్‌లో తొలిసారిగా డిజిటల్ విక్రయ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తొలిసారిగా ఆన్లైన్ స్టోర్ ఇ-షాప్‌ను ప్రారంభించింది. ఈ ఆన్లైన్స్టోరులో ఆటోమోటివ్, పారిశ్రామిక వ్యాపారాల నుంచి ఉత్పత్తులు ఉంటాయని.. రిటైల్, పరిశ్రమల కొనుగోలుదార్లకు ఇవి అందుబాటులో ఉంటాయని ఎస్కేఎఫ్ ఇండియా వెల్లడించింది.
వివాదాల పరిష్కార కమిటీతో చిన్న పన్ను చెల్లింపుదార్లకు మేలు
సీబీడీటీ ఛైర్మన్ పి.సి.మోదీ
దిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను వివాదాల పరిష్కార కమిటీలో పలు ధర్మాసనాలు ఉంటాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ పి.సి.మోదీ అన్నారు. అప్పిలేట్ ప్రక్రియకు వెళ్లకుండానే కేసులు పరిష్కరించుకునేందుకు చిన్న పన్ను చెల్లింపుదార్లకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. సెబీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాంటి సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని 26ఏఎస్ ఫారంలో ఐటీ విభాగం అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదార్లు రిటర్న్‌ల్లో సరైన వివరాలు నింపేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ‘పన్ను చెల్లింపుదార్లు స్వచ్ఛందంగా పన్ను చట్టాలను పాటించేలా ప్రోత్సహించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. నిజాయతీగా పన్ను చెల్లించేవారు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. చట్టాల్లో లొసుగులను వినియోగించుకుని, పన్నులు ఎగ్గొట్టాలని ప్రయత్నించే వారిపైనా తగిన చర్యలు ఉంటాయ’ని అసోచామ్ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ మోదీ తెలిపారు. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెబీతో తాము పరస్పరం పంచుకోవడం ద్వారా పన్నుల ఎగవేతదార్లపై మరింతగా నిఘా పెట్టే వీలుంటుందని పేర్కొన్నారు