కొవిడ్‌ రోగులకు ఐటీ శాఖ ఊరట..!

ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌లో తప్పులు ఉండటంతో ఆఘమేఘాల మీద సవరించింది. మే7 తేదీన కేంద్ర ప్రభుత్వం

Published : 11 May 2021 20:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌లో తప్పులు ఉండటంతో ఆగమేఘాల మీద సవరించింది. మే7 తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ ఇచ్చింది.  రోగులు ఆసుపత్రుల్లో రూ.2 లక్షల మించి అయ్యే కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ ఖర్చును నగదు రూపంలో మే31 వరకు చెల్లించేందుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవోలో రోగి తరపున నగదు చెల్లించిన వారిని ‘పేయి’ (నగదు స్వీకర్త) పేర్కొంటూ రోగితో ఉన్న సంబంధాన్ని (రిలేషన్‌షిప్‌ను)చెప్పాలని పేర్కొంది.  వాస్తవానికి అక్కడ నగదు స్వీకరించేది ఆసుపత్రులు  కావడంతో ఒక్కసారిగా దీనిపై గందరగోళం నెలకొంది.

వాస్తవానికి నగదు స్వీకరించే వ్యక్తిని ‘పేయి’గా  గుర్తిస్తారు.. నగదు చెల్లించే వ్యక్తిని ‘పేయర్‌’గా పేర్కొంటారు. ఈ తప్పు కారణంగా ఆ నోటిఫికేషన్‌ అమలుకు నోచుకోలేదు. దీంతో తప్పును గుర్తించిన  కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ  సోమవారం రాత్రి దానిని సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మే7వ తేదీన వెలువరించిన నోటిఫికేషన్‌లో ‘పేయి’గా పేర్కొన్న పదాన్ని ‘పేయర్‌’గా చదువుకోవాలని ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీనిపై కన్సల్టెన్సీ సంస్థ ఈవై స్పందిస్తూ .. రోగి తరపున ఆసుపత్రిలో నగదు బిల్లు చెల్లించే బంధువు, మిత్రులను ‘పేయర్‌’గా పరిగణించడం సరైన పదం అని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ను మే31 తర్వాత మరింత కాలం పొడిగించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. 

గతంలో ఆసుపత్రుల్లో బిల్లు రూ.2 లక్షలకు మించితే నగదు రూపంలో చెల్లించడానికి అవకాశం లేదు. దీంతో బ్యాంకింగ్‌ వినియోగించడం రాని వ్యక్తులు ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించడం సమస్యాత్మకంగా మారింది. ఈ ఇబ్బందులు తొలగించేదుకు కేంద్ర ప్రభుత్వం మే7వ తేదీన జీవో తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని