టాప్‌-అప్ లోన్ కోసం రుణాన్ని వేరే బ్యాంక్‌కి బ‌దిలీ చేయ‌డం మంచిదేనా?

కాలవ్య‌వ‌ధి పెరిగే కొద్ది.. వ‌డ్డీ కూడా పెరుగుతుంద‌ని మ‌ర‌వ‌ద్దు

Published : 07 Jun 2021 14:02 IST

గృహ రుణం తీసుకున్న‌వారికి, ఇంటి పున‌ర్మిణానం, మ‌ర‌మ్మ‌త్తులు, విస్త‌ర‌ణ‌(మ‌రో అంత‌స్తును నిర్మించ‌డం వంటివి), నిర్వ‌హ‌ణ వంటి వాటి కోసం టాప్‌-అప్ లోన్ అందిస్తాయి బ్యాంకులు. ఈ టాప్‌-అప్ లోన్‌ను ఇప్ప‌టికే గృహ రుణం తీసుకున్న బ్యాంకు నుంచి తీసుకోవ‌చ్చు. లేదా టాప్‌-అప్‌లోన్‌ను అభ్య‌ర్థిస్తూ వేరొక బ్యాంకుకు గృహ రుణాన్ని బ‌దిలీ చేయ‌వ‌చ్చు. 

సాధార‌ణంగా ప్ర‌స్తుతం గృహ రుణం ఉన్న బ్యాంకు వ‌డ్డీ రేటు కంటే.. వేరొక బ్యాంకు త‌క్కువ వ‌డ్డీకే  రుణం ఇస్తుంటే, వ‌డ్డీ త‌గ్గించుకునేందుకు రుణ బ‌దిలీ చేస్తుంటారు చాలామంది. అయితే రుణ బ‌దిలీకి ఇది ఒక్క‌టే కార‌ణం కాక‌పోవ‌చ్చు. టాప్‌-అప్‌లోను కోసమూ బ‌దిలీ చేయ‌వ‌చ్చు. అంటే మ‌రొక బ్యాంక్ లేదా బ్యాంకింగేత‌ర సంస్థ‌లు ప్ర‌స్తుతం ఉన్న గృహ రుణాన్ని త‌మ బ్యాంక్‌కు బ‌దిలీ చేస్తే, టాప్‌-అప్ లోన్‌ను ఇచ్చేందుకు సిద్ధప‌డ‌తాయి. అలాంట‌ప్పుడు కూడా కొంతమంది వినియోగ‌దారులు రుణ బ‌దిలీ చేసేందుకు చూస్తుంటారు. 

గృహ రుణాన్ని ప్ర‌స్తుతం ఉన్న బ్యాంక్ నుంచి మ‌రొక బ్యాంకుకు బ‌దిలీ చేసేవారు.. కొత్త బ్యాంక్ రుణ పాల‌సీని అధ్య‌య‌నం చేయాలి. ప్ర‌తీ బ్యాంకు ఒకే విధానాన్ని అనుస‌రించ‌దు. ఉదాహ‌ర‌ణ‌కి, పైసాబ‌జార్.కామ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. కెనరా బ్యాంక్ గ‌రిష్టంగా రూ.25 ల‌క్ష‌ల టాప్‌-అప్ లోన్ అందిస్తుండ‌గా, ఇండియ‌న్ బ్యాంక్‌ రూ.60 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వంటి కొన్ని బ్యాంకులు టాప్‌-అప్ రుణంపై ఎలాంటి గ‌రిష్ట‌ ప‌రిమితి విధించ‌డం లేదు. రుణం తీసుకునే వ్య‌క్తి అర్హ‌త‌, ఆదాయం, తిరిగి తీర్చ‌గ‌ల సామ‌ర్ధ్యం వంటి అంశాల‌ను ప‌రిశీలించి టాప్‌-అప్ రుణంపై నిర్ణ‌యం తీసుకుంటున్నాయి.

కొన్ని బ్యాంకులు కాల‌వ్య‌వ‌ధిపై కూడా ప‌రిమితులు విధిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు, పంజాబ్‌& సింద్ బ్యాంక్, కెన‌రా బ్యాంకులు 10 సంవ‌త్స‌రాల గ‌రిష్ట‌ కాల‌ప‌రిమితితో టాప్‌-అప్ గృహ రుణాన్ని అందిస్తుండ‌గా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 12 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో టాప్‌-అప్ లోన్‌ ఆఫ‌ర్ చేస్తుంది. 

ప్రాథ‌మిక గృహ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు మిగిలి ఉన్న కాల‌ప‌రిమితి ఆధారంగా కూడా టాప్‌-అప్ లోన్ కాల‌వ్య‌వ‌ధిని నిర్ణ‌యిస్తున్నాయి కొన్ని బ్యాంకులు. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌స్తుతం ఉన్న గృహ రుణం చెల్లించేందుకు 15 సంవ‌త్స‌రాల కాలం ఉంటే, అంతే వ్య‌వధితో టాప్‌-అప్ లోన్ మంజూరు చేస్తున్నాయి.  

టాప్‌-అప్ లోన్ కాల‌ప‌రిమితి ఈఎమ్ఐ(ఈక్వీటెడ్ మంత్లీ ఇన్‌స్టాల‌మెంట్స్‌)ను ప్ర‌భావితం చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కి, 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో రూ.25 ల‌క్ష‌ల టాప్‌- అప్ లోన్ తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎమ్ఐ రూ.30,332. అదే 15 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి ఇస్తే చెల్లించాల్సిన ఈఎమ్ఐ రూ.23,891, 20 సంవ‌త్స‌రాలు అనుమ‌తిస్తే, ఈఎమ్ఐ రూ.20,911 గా ఉంటుంది. 

అయితే కాలవ్య‌వ‌ధి పెరిగే కొద్ది.. వ‌డ్డీ కూడా పెరుగుతుంద‌ని మ‌ర‌వ‌ద్దు. ఉదాహ‌ర‌ణికి, రూ. 26 ల‌క్ష‌ల రుణాన్ని 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో తీసుకుంటే, చెల్లించాల్సిన వ‌డ్డీ రూ.11,39,828. అదే 20 సంవ‌త్స‌రాలకు తీసుకుంటే రూ.25,18,640 వ‌డ్డీ రూపేణా చెల్లించాలి. 

చివ‌రిగా..
ఇప్ప‌టికే గృహ రుణం ఉన్న‌వారు.. టాప్‌-అప్ లోన్ తీసుకోవాల‌నుకుంటే, ముందుగా మీరు రుణం తీసుకున్న బ్యాంకును సంప్ర‌దించాలి. ఆ బ్యాంకు ఆఫ‌ర్ చేస్తున్న వ‌డ్డీ రేటు, కాల‌వ్య‌వ‌ధి త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకున్న‌, ఇత‌ర రుణ‌దాత‌లతో పోల్చి చూడాలి.  రుణాన్ని బ‌దిలీ చేయాల‌నుకుంటే.. ప్రాసెసింగ్ ఫీజు వంటి వాటిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. చ‌క్క‌గా ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకుని, దాని ప్ర‌కారం నిధుల‌ను నిర్వ‌హిస్తే, ఎటువంటి పెనాల్టీలు లేకుండా.. అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే టాప్‌-అప్ రుణాన్ని చెల్లించ‌వ‌చ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని