Insurance: ఆన్‌లైన్‌లో బీమా పాల‌సీ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

పాలసీదారుడు క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని ట్రాక్‌ చేయడం చాలా ముఖ్యం

Updated : 26 Jul 2021 17:12 IST

కొవిడ్-19 మ‌హ‌మ్మారి నేపథ్యంలో ప్రజల్లో బీమా ప‌థ‌కాలపై అవ‌గాహ‌న పెరిగింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో జీవిత బీమా పాల‌సీని క్ష‌ణాల్లో, సుల‌భంగా, సుర‌క్షితంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, ఆన్‌లైన్‌లో బీమా తీసుకునే ముందు ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకోండి..

సమగ్ర పరిశోధన:

జీవిత బీమా పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడు దానికి త‌గిన‌ పరిశోధన చాలా అవసరం. ఈ పరిశోధన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటి మిశ్రమంగా ఉండాలి. దీంతో ఎక్కడ ఎంత ఖ‌ర్చు అవుతుందో తెలుసుకోవ‌చ్చు. అప్పుడు ఉత్తమ కవర్‌ను ఎంచుకోవ‌చ్చు. తగిన మొత్తంతో జీవిత బీమా పాలసీని ఎంచుకోవడం చాలా అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఇది మీకు త‌గినంత హామీ ఇస్తుంది.  దాంతో ఇది మీ ప్రియమైనవారి ఆర్థిక భవిష్యత్తుకు భ‌రోసా ఉంటుంది.  మీ భవిష్యత్ లక్ష్యాలు, జీవనశైలి, ఇతర ఆర్థిక అవసరాల ప్రకారం కవరేజ్ మొత్తాన్ని లెక్కించడానికి ఆన్‌లైన్ కాలిక్యులేటర్ సౌకర్యవంతంగా ఉంటుంది.

ప‌థ‌కాల‌ను సరిపోల్చండి:

ఇప్పుడు ఆన్‌లైన్ పాలసీదారుడు మార్కెట్లో లభించే వివిధ ర‌కాల పాల‌సీల‌ గురించి సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. వేర్వేరు బీమా ప‌థ‌కాల‌ ఫీచ‌ర్లు, ప్రయోజనాలు, మినహాయింపులను  అర్థం చేసుకోవచ్చు. ఇలా ప‌థ‌కాల‌ను పోల్చి చూడ‌టం వ‌ల‌న పాల‌సీ వివరాలను సరిగ్గా అర్థం చేసుకొని, మీకు స‌రైన‌దేదో సుల‌భంగా నిర్ణ‌యించుకోవ‌చ్చు

క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి:

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్ప‌త్తి పాల‌సీదారుల‌ క్లెయిమ్‌లను ఎంత వేగంగా ప‌రిష్క‌రిస్తుందో తెలుపుతుంది. పాలసీదారుడు లేదా వారి కుటుంబం అత్యవసర సమయంలో బీమా హామీని పొందటానికి బీమా సంస్థ వెంట ప‌డాల్సిన‌ అవసరం లేదని నిర్ధారించడానికి క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని ట్రాక్‌ చేయడం చాలా ముఖ్యం.

బీమా నియంత్ర‌ణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) వెబ్‌సైట్‌లో క్లెయిమ్‌లకు సంబంధించిన సమాచారం ఉంటుంది. బీమా సంస్థ ఇచ్చిన హామీకి అనుగుణంగా అన్ని ప్రయోజనాలను చెల్లిస్తుందో.. లేదో.. తెలుసుకోవడానికి కూడా క్లెయిమ్ చెల్లింపు నిష్పత్తిని ప‌రిశీలించాలి.

యాడ్-ఆన్ కవర్:

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధిక క‌వ‌రేజ్ ఉండే పాల‌సీని ఎంచుకోండి. క‌వ‌రేజ్ అనేది స్థిరంగా ఉంటుంది. తిరిగి మార్చుకునేందుకు వీలుండ‌దు. ఒక‌వేళ మీకు ఆ బీమా హామీ స‌రిపోలేద‌నుకుంటే కొత్త పాల‌సీని తీసుకోవ‌చ్చు. లేదా యాడ్-ఆన్‌ల సహాయంతో ఇప్పటికే ఉన్న పాల‌సీని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు అనేక‌ రకాల యాడ్-ఆన్ క‌వ‌ర్‌లు చాలా ప్రయోజనాలను అందిస్తున్నాయి. కొన్ని ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం, క్లిష్టమైన వ్యాధుల‌కు కవరేజీని అందిస్తున్నాయి.  రైడర్స్ ఏదైనా వ్యాధికి హామీని చెల్లించలేకపోతే కొన్ని బీమా సంస్థ‌లు ప్రీమియంను ర‌ద్దు చేస్తాయి. మీ అవసరాలపై ఆధారపడి యాడ్‌-ఆన్‌ల‌ను ఎంచుకోవాలి. ఇప్పటికే ఉన్న పాలసీకి జోడించగల, అదనపు ప్రయోజనాలను అందించగల తగిన రైడర్‌ను ఎంచుకునే ముందు మీ ప్రస్తుత జీవిత బీమా రక్షణ, నష్టాలు, ఆర్థిక అవసరాలను ముందుగా అంచనా వేయడం చాలా ముఖ్యం.

తెలివిగా పాల‌సీ ఎంపిక‌:

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, వైద్య చరిత్ర, జీవనశైలి అలవాట్లతో సహా అన్ని రకాల సమాచారాన్ని బహిర్గతం చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది స‌త్వ‌ర‌ దావాల పరిష్కారానికి తోడ్ప‌డుతుంది. క్లెయిమ్‌ల‌ను దాఖలు చేసేటప్పుడు మీ కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఎదుర‌వ‌కుండా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు