వ్య‌క్తిగ‌త రుణ‌మా..? జాగ్ర‌త్త..!

వ్య‌క్తిగ‌త రుణం తీసుకునేముందు ముందుగా దృష్టిలో పెట్టుకోవాల్సింది వ‌డ్డీ రేట్ల గురించి

Updated : 15 Jul 2021 20:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్య‌క్తిగ‌త రుణాలు సులువుగా ల‌భిస్తాయి. మన అవసరాలను తీరుస్తాయి. అంతమాత్రన వ్యక్తిగత రుణం మంచిది అనుకుంటే పొరపాటే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి మిమ్మల్ని రుణాల ఊబిలో పడేస్తాయి. 

కొన్ని బ్యాంకులు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తాయి. అయితే వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉండి ఐదేళ్ల కాల‌ప‌రిమితితో అవ‌స‌రం ఉన్న‌ప్పుడు రుణం తీసుకోవ‌డం పెద్ద త‌ప్పేమీ కాదు. కానీ, రుణం దొరుకుతోంది కదా అని పెద్ద వ‌స్తువులు కొనుగోలు చేయ‌డానికి, విహార యాత్ర‌ల‌కు వెళ్లేందుకు  తీసుకుంటే భవిష్యత్‌లో తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి వ్యక్తిగత రుణాలు తీసుకునేటప్పుడు ఏమేం చూడాలి? ఎలా వ్యవహరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వ‌డ్డీ రేట్లు: వ్య‌క్తిగ‌త రుణం తీసుకునేముందు దృష్టిలో పెట్టుకోవాల్సింది వ‌డ్డీ రేట్ల గురించి. వ్య‌క్తిగ‌త రుణాలు సుల‌భంగా ల‌భిస్తాయి. బ్యాంకులు వేర్వేరు వ‌డ్డీ రేట్ల‌తో వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తాయి. వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రిస్తాయి. ఎక్క‌డ మీకు త‌క్కువ‌గా వ‌డ్డీ రేట్లకు రుణం ల‌భిస్తుందో దానిని చూసుకోవ‌డం మేలు.

అవ‌స‌రం కంటే ఎక్కువ‌గా వ‌ద్దు: వ్య‌క్తిగ‌త రుణం తీసుకునేట‌ప్పుడు సాధార‌ణంగా చేసే త‌ప్పిదాల్లో ఒకటి అవ‌స‌ర‌మైన‌ దానికంటే ఎక్కువ రుణం తీసుకోవ‌డం. రుణ గ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్ చూసి ఒక్కోసారి బ్యాంకులు వారు అడిగిన దానికంటే ఎక్కువ‌గా ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అయితే అంత డ‌బ్బు నిజంగా మీకు అవ‌స‌ర‌ముందా లేదా అన్న‌ది ఆలోచించుకోవాలి. అవ‌స‌రం లేకపోయినా ఇస్తున్నారు క‌దా అని ఎక్కువ‌గా తీసుకుంటే త‌ర్వాత అప్పుల పాల‌య్యేందుకు దారితీస్తుంది. అది కూడా దీర్ఘ‌కాలానికి తీసుకుంటే అధిక వ‌డ్డీ రేట్ల‌తో భారం మ‌రింత పెరుగుతుంది.

మీ ఆదాయానికి రుణ చెల్లింపుల‌కు స‌రితూగాలి: రుణం తీసుకునేముందు నిర్ణ‌యించుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు ఏంటంటే మీకు ఇది వ‌ర‌కే ప‌లు ర‌కాల రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ రుణాలు ఉన్న‌ట్ల‌యితే అన్ని మొత్తం క‌లిపే మీ వేత‌నంలో 35 శాతానికి మించ‌కూడ‌దు. క్రెడిట్ కార్డుల విష‌యంలో 40 శాతం కంటే ఎక్కువ‌గా వినియోగించ‌కూడ‌దు. లేక‌పోతే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ఇదివ‌ర‌కు ఉన్న రుణాలు చెల్లింపుల విధానాన్ని బ‌ట్టి బ్యాంకులు ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. ఇలా తిర‌స్క‌రిస్తే కూడా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బ‌తింటుందన్న విష‌యాన్ని గుర్తుంచుకోండి.

రుణ ఆర్హ‌త‌ను తెలుసుకోండి: మీకు రుణం ల‌భించే అవ‌కాశం ఎంత‌వ‌ర‌కు ఉందో ముందుగానే తెలుసుకోవాలి. రుణం జారీ చేసేందుకు ఒక్కో బ్యాంకు ఒక్కో అంశాన్ని ప‌రిశీలిస్తాయి. అందుకే అయా బ్యాంకు ప‌రామితులను తెలుసుకొని రుణం ల‌భించే అవ‌కాశం లేక‌పోతే ఫిన్‌టెక్ కంపెనీల‌ను ఆశ్ర‌యించ‌డం మంచిది. ఎందుకంటే బ్యాంకులు తిర‌స్క‌రిస్తే క్రెడిట్ స్కోర్ పై ప్ర‌భావం ప‌డుతుంది. అందుకే ముందుగానే క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవ‌డం ద్వారా సుల‌భంగా రుణం పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని