పిల్లల బీమా పాలసీలు

పిల్ల‌ల బీమా పాల‌సీల గురించి ఈ క‌థ‌నంలో వివ‌రంగా తెలుసుకుందాం

Published : 20 Dec 2020 19:16 IST

పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడం పెద్దల బాధ్యత. తల్లిదండ్రుల ఆర్థిక ప్రణాళికలో సైతం ఇది ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి బీమా తీసుకోవడం అవసరం. పిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాల రీత్యా డబ్బు పొదుపు చేయడం సాధారణ విషయేమీ కాదు. అందుకు అనుగుణంగా బీమా కంపెనీలు పిల్లల బీమా పాలసీలను రూపొందిస్తున్నాయి.

ఉదాహరణకు ఇప్పుడు ఎంబీఏ చదివేందుకు రూ. 10 లక్షలు అవుతుంది అనుకుంటే మరో 20 సంవత్సరాల తర్వాత 5శాతం ద్రవ్యోల్బణంతో అది రూ. 25 లక్షలపైనే కావచ్చు. అంత మొత్తం ఒక్కసారిగా భరించాలంటే కొద్దిగా కష్టమైన పనే. అదే పిల్లల బీమా పాలసీ ఉంటే, చదువు ఖర్చులకు డబ్బు రాబడితో పాటు కాలపరిమితి ఉన్నంత వరకూ పాలసీదారుకు బీమా సైతం లభిస్తుంది. ఈ విధంగా రెండు ప్రయోజనాలను పొందిన వారవుతారు.

అర్హత వయసు:

పాలసీదారు కనిష్ఠ వయసు: 18, గరిష్ఠ వయసు: 55 సంవత్సరాలు
పిల్లల కనిష్ఠ వయసు: 30 రోజులు గరిష్ఠ వయసు: 13 సంవత్సరాలు

మెచ్యూరిటీ వయసు:

పాలసీదారు: 55 నుంచి 70 ఏళ్లు
పిల్లలు: 18 ఏళ్లు

పాలసీ కాలపరిమితి:

7 ఏళ్ల నుంచి మొదలుకొని 25 ఏళ్లవరకూ కాలపరిమితి కలిగిన పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే పాలసీ మెచ్యూర్‌ అయ్యే సరికి పిల్లల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రీమియం చెల్లింపు:

ప్రీమియంను ఒక్కసారిగా నెలవారీ లేదా త్రైమాసికానికి ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించేందుకు వీలుంటుంది. రూ. 5000 నుంచి మొదలై గరిష్ఠ పరిమితి లేని పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

బీమా హామీ మొత్తం ఆధారంగా కంపెనీలు ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. ప్రీమియం చెల్లించే కాలపరిమితి 5 ఏళ్ల నుంచి మొదలుకొని 20 ఏళ్ల వరకూ ఉండవచ్చు. (సింగిల్‌ ప్రీమియం చెల్లించే పాలసీలు సైతం అందుబాటులో ఉన్నాయి.)

బీమా హామీ మొత్తం:

రూ. లక్ష నుంచి మొదలై రూ.కోటి దాకా బీమా హామీ మొత్తం కలిగిన పాలసీలు ఉన్నాయి. పాలసీల్లో రెండు రకాలు ఉన్నాయి.

  1. పాలసీ మెచ్యూర్‌ అయిన తర్వాత ఒక్కసారిగా పెద్దమొత్తంలో చెల్లించేవి

  2. విడతల వారీగా చెల్లిస్తూ, చివర్లో కొంత మొత్తాన్ని చెల్లించేవి

డెత్‌ బెనిఫిట్‌:

పాలసీదారు మరణిస్తే అప్పటివరకూ చెల్లించిన ప్రీమియంలపై 100 నుంచి 125 శాతం దాకా లేదా బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు.

పన్ను ప్రయోజనాలు:

బీమా హామీ మొత్తంలో 10 శాతం వరకూ ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయి.

పిల్లల బీమా పాలసీ ప్రయోజనాలు:

  • ఆకస్మికంగా పాలసీదారుకు ఏమైనా జరిగితే

  • లబ్ధిదారుకు(పిల్లలకు) బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు

  • భవిష్యత్తులో ఎలాంటి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు

  • పాలసీ మెచ్యూర్‌ అయిన వెంటనే అదనపు ప్రయోజనాలను సైతం అందజేస్తారు

  • ఆదాయపు పన్నుచట్టం 80 సీ, 10(10డీ)ని అనుసరించి పన్ను మినహాయింపులు ఉంటాయి.

  • మన అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంచుకోవచ్చు.

  • వైద్య పరీక్షలు లేకుండా కొన్ని ఆరోగ్య స్థితికి సంబంధించిన ప్రశ్నలతో పాలసీ పూర్తవుతుంది.

పాలసీదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే, ప్రీమియంను రద్దు చేసే పాలసీలను ఎంచుకోవడం మంచిది. పిల్లల అవసరాలు, వార్షికాదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా హామీ మొత్తాన్ని నిర్దేశించుకోండి. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులు వేసే మొదటి అడుగు ఇదే. కాబట్టి పాలసీ డాక్యుమెంట్‌ను చదివి నిర్ణయం తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని