Jack Ma: చైనా అణచివేత అనంతరం తొలి విదేశీ పర్యటనలో జాక్‌ మా.. ఎందుకంటే!

చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ఐరోపా పర్యటనలో ఉన్నారు. చైనా ప్రభుత్వంతో చిక్కుల్లో ఇరుక్కున్న తర్వాత జాక్‌ మాకు ఇదే తొలి విదేశీ పర్యటన....

Published : 20 Oct 2021 14:20 IST

బీజింగ్‌: చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ఐరోపా పర్యటనలో ఉన్నారు. చైనా ప్రభుత్వంతో చిక్కుల్లో ఇరుక్కున్న తర్వాత జాక్‌ మాకు ఇదే తొలి విదేశీ పర్యటన. ఐరోపాకు బయలుదేరడానికి ముందు కొన్ని రోజులు ఆయన తన కుటుంబంతో కలిసి హాంకాంగ్‌లో గడిపారు. ప్రస్తుతం జాక్‌ మా స్పెయిన్‌లో ఉన్నారు. వ్యవసాయ, పర్యావరణ సంబంధిత సాంకేతికత అధ్యయనంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్లినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ వెల్లడించింది.

2019లో 55వ పుట్టినరోజు సందర్భంగా అలీబాబా ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకొని జాక్‌ మా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అనంతరం చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపడంతో జాక్‌ మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని జాక్‌ మా హితవు పలికారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ చైనా అగ్రనాయకత్వం‌ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, 37 బిలియన్‌ డాలర్లు విలువచేసే యాంట్‌ గ్రూప్‌ ఐపీవోను అడ్డుకొంది. చైనా విడుదల చేసిన టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి కూడా ఆయనను పక్కనబెట్టేసింది. ఈ పరిణామాల తర్వాత జాక్‌ మా కొన్నాళ్ల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన అదృశ్యంపై పలు అనుమానాలు తలెత్తాయి. కానీ, కొద్ది వారాల తర్వాత వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. అలాగే చైనా కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కూడా కోల్పోయారు. తర్వాత అలీబాబాపై చైనా నియంత్రణా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. వ్యాపారంలో అనైతిక పద్ధతులను అవలంబించారంటూ 2.8 బిలియన్‌ డాలర్ల జరిమానా కూడా విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని