బీమా క్లెయిం తిర‌స్క‌రించారా?

ఆల‌స్యంగా క్లెయిం చేశార‌ని బీమా సంస్థ‌లు పాల‌సీని తిర‌స్క‌రించ‌కూడదు

Published : 20 Dec 2020 14:55 IST

ఆల‌స్యంగా బీమా క్లెయిం చేశార‌న్న కార‌ణంతో క్లెయింను తిర‌స్క‌రించ‌వ‌ద్ద‌ని జూన్ 2017లో బీమా నియంత్ర‌ణ సంస్థ స్ప‌ష్టం చేసింది. ఆ త‌ర్వాత సుప్రీంకోర్టు సైతం ఈ విష‌య‌మై నిర్ణ‌యం వెలువ‌రించింది. ఓ వ్య‌క్తికి చెందిన‌ ట్ర‌క్ 2010లో చోరీకి గురైంది. యాజ‌మాని దాని ఆచూకీ క‌నుగొన‌లేక‌పోయాడు. ట్ర‌క్కు కోసం వెతికి చివ‌రికి దొర‌క‌క‌పోయేస‌రికి 8 రోజుల త‌ర్వాత బీమా సంస్థ‌కు క్లెయిం కోసం ద‌ర‌ఖాస్తు చేశాడు. అయితే బీమా సంస్థ అత‌డి క్లెయింని తిరస్క‌రించింది. అప‌హ‌ర‌ణ లాంటి స‌మాచారాన్ని త‌మ‌కు త‌క్ష‌ణ‌మే తెలియ‌జేస్తేనే క్లెయిం వ‌ర్తిస్తుంద‌ని బీమా సంస్థ తెలిపింది.

ఆల‌స్య‌మైంద‌ని తిర‌స్క‌రించ‌డం భావ్యం కాదు: సుప్రీం

 విష‌యం సుప్రీంకోర్టుకు వెళ్లింది. క్లెయింను ఆల‌స్యంగా న‌మోదు చేశార‌న్న ఒక్క కార‌ణంతో తిర‌స్క‌రించ‌డం భావ్యం కాద‌ని సుప్రీం కోర్టు ట్ర‌క్కు యాజ‌మానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా న్యాయబ‌ద్ధ‌మైన క్లెయింల‌ను కార‌ణాలు చెప్పి తిరస్క‌రించ‌డం భావ్యం కాద‌ని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే ఈ తీర్పులోని లొసుగును అవ‌కాశంగా మ‌ల‌చుకొని క్లెయిం ద‌ర‌ఖాస్తుల‌ను ఆల‌స్యం చేయ‌వ‌ద్ద‌ని పాల‌సీదారుల‌కు హిత‌వు ప‌లికింది. వ‌డ్డీతో క‌లిపి ఇవ్వాలి - ఈ కేసును ద‌ర్యాప్తు చేశాక బీమా సంస్థ త‌ర‌ఫు నుంచి క్లెయిమ్స్ మేనేజ‌ర్ రూ.7.85ల‌క్ష‌లు ట్ర‌క్కు యాజ‌మానికి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.

అయితే సుప్రీంకోర్టు మాత్రం క్లెయిం చేసిన తేదీ నుంచి పూర్తి ప‌రిహారం ఇచ్చేదాకా 8శాతం వార్షిక వ‌డ్డీతో క‌లిపి మొత్తం రూ.8.35ల‌క్ష‌లు పాల‌సీదారుకి చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఆల‌స్యానికి నిర్వ‌చ‌నం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పుతో ట్ర‌క్కు యాజ‌మానికైతే సాంత్వ‌న చేకూరింది. అయితే ఇలా క్లెయింలు ఆల‌స్యం చేయ‌డం వ‌ల్ల ఎన్నో స‌మస్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఆల‌స్యం చేయ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచ‌న‌. అయితే ఇక్క‌డ ఆల‌స్యానికి స‌రైన నిర్వ‌చ‌నం ఏమిటి. బీమా సంస్థ‌లు ఆల‌స్యంగా చేసే క్లెయింల‌ను ఎందుకు ఇష్ట‌ప‌డ‌వు. బీమా నియంత్ర‌ణ సంస్థ‌కు దీనిని ఎలా చూస్తుంది లాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు రాక మాన‌వు. ఆల‌స్యంతో అవ‌స్థ‌లు - సాధార‌ణంగా చాలా బీమా సంస్థ‌లు క్లెయిం చేసుకునేందుకు ప‌రిమిత స‌మ‌యాన్ని నిర్దేశిస్తాయి. అయితే స‌మ‌స్య‌ల్లా ఈ విష‌యాన్ని పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో బీమా ఏజెంట్లు పాల‌సీదారుల‌కు స్ప‌ష్టంగా తెలియ‌జేయ‌రు.

పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో పాల‌సీదారులు ఈ విష‌యాన్ని అడిగి తెలుసుకోవ‌డం త‌మ హ‌క్కుగా భావించాలి. మోస‌పూరిత‌మైనవిగా తేలాయి -ఆల‌స్యంగా చేసే క్లెయింలు అనుమానించ‌ద‌గిన కోణంలో బీమా సంస్థ‌లు చూస్తాయి. ఇలాంటి క్లెయింలు మోస‌పూరిత‌మైనవిగా అనేక సంద‌ర్భాల్లో తేలింది. అందుకే బీమా సంస్థ‌లు క్లెయింల కోసం ఒక డెడ్‌లైన్‌ను విధిస్తుంటాయి. పాల‌సీదారులు ఎంత తొంద‌ర‌గా క్లెయిం స‌మ‌ర్పిస్తే స‌త్వ‌ర‌ ద‌ర్యాప్తు జ‌రిపేందుకు బీమా సంస్థ‌ల‌కు వీల‌వుతుంది. డెడ్‌లైన్ అంటూ లేక‌పోతే పాల‌సీదారులు క్లెయిం చేయడాన్ని బాధ్య‌త‌గా భావించ‌రు అనే అభిప్రాయమూ బీమా సంస్థ‌ల నిపుణుల‌కు ఉంది.

గ‌డువెంతుంటే బాగుంటుంది?

  • క్లెయిం చేసుకునేందుకు ఎంత గ‌డువు ఉంటే బాగుంటుంది అనే ప్ర‌శ్న ఉద‌యిస్తుంది. వాహ‌న‌ బీమాలో అయితే ఒక వారం వ‌ర‌కు గ‌డువు ఇస్తారు. ఒక్కో బీమా సంస్థ ఒక్కో ర‌క‌మైన పాల‌సీని బ‌ట్టి క్లెయిం గ‌డువును ఒక్కోలా నిర్ణ‌యిస్తుంది. పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడే ఆ విష‌యాన్ని అడిగి తెలుసుకోవ‌డం పాల‌సీదారుల బాధ్య‌త‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని