IPO: ‘క్లీన్ సైన్స్...’ 93% ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

రూ. 1,550 కోట్ల క్లీన్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఐపీఓ.. ప్ర‌మోట‌ర్లు, ఇత‌ర వాటాదారుల‌చే పూర్తి ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్‌.

Updated : 15 Jul 2021 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ రసాయన తయారీ సంస్థ ‘క్లీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ ఐపీవో 94.41 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. దీర్ఘ‌కాలిక వృద్ధి సామ‌ర్థ్యం, లాభాల అవకాశం ఉందంటూ ‘క్లీన్ సైన్స్ ఐపీఓ’ను వివిధ బ్రోకరేజీలు మదుపర్లకు సూచించాయి. దీంతో పెద్దఎత్తున స్పందన వచ్చింది. జులై 19న లిస్టింగ్‌ అవనున్న ఈ ఐపీవో... వాటాల కేటాయింపు ఈ రోజు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సంస్థాగ‌త కొనుగోలుదారులు, సంస్థేత‌ర పెట్టుబ‌డిదారుల నుంచి ఈ షేర్ల‌కు భారీ డిమాండ్ వచ్చింది. రిటైల్ ఇన్వెస్ట‌ర్ల విభాగంలో తొమ్మిది రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఈ ఐపీఓను కోట‌క్ మహీంద్రా క్యాపిట‌ల్ కంపెనీ లిమిటెడ్‌, యాక్సిస్ క్యాపిట‌ల్ లిమిటెడ్‌, జేఎమ్ ఫైనాన్షియ‌ల్ లిమిటెడ్ నిర్వ‌హించాయి. షేర్లు ఖ‌రారు అయిన త‌ర్వాత పెట్టుబ‌డిదారులు ఈ ఐపీవో రిజిస్ట్రార్‌ అయిన ‘లింక్ ఇన్‌టైమ్’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాటా కేటాయింపును త‌నిఖీ చేసుకోవ‌చ్చు. దాంతోపాటు ‘బీఎస్ఈ’ వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు.

₹1,550 కోట్ల క్లీన్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఐపీఓ.. ప్ర‌మోట‌ర్లు, ఇత‌ర వాటాదారుల‌ నుంచి పూర్తి ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్‌గా నడుస్తోంది. కంపెనీ వాటా ధ‌ర‌ను రూ. 880-900గా నిర్ణయించారు. ఐపీఓ ప్రారంభానికి ముందు, యాంకర్ పెట్టుబ‌డిదారుల నుంచి ₹464 కోట్లు వ‌సూలు చేసింది. ర‌సాయ‌న రంగంలో ఉన్న అవ‌కాశాల‌ను, ప్రాసెస్ ఇన్నోవేష‌న్‌, సాంకేతిక నైపుణ్యం, ఉత్ప్రేర‌క అభివృద్ధి, ఆర్అండ్డీ పై స్థిర‌మైన దృష్టి, సానుకూల ప‌రిశ్ర‌మ దృక్ప‌థం, ఉన్న‌త‌మైన మార్జిన్ ప్రొఫైల్, గ‌ణ‌నీయ‌మైన కార్య‌క‌లాపాలు, వ్యూహాత్మ‌క పంథాతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో సంస్థ రాబ‌డి నిష్ప‌త్తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఐపీవో లాభదాయకంగా ఉండొచ్బాచని బ్రోక‌రేజ్ సంస్థ‌లు తెలిపాయి. ‘క్లీన్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ’ ఆదాయం, ఎగుమ‌తుల పెరుగుద‌ల‌, ప్ర‌త్యేక ర‌సాయ‌నాల డిమాండ్ పెరుగుద‌ల‌, మెరుగైన నిర్వ‌హ‌ణ ప‌నితీరుతో కంపెనీ 14%, 43% సీఏజీఆర్ వ‌ద్ద వృద్ధి చెందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని