నిరుప‌యోగ ఖాతానా? ఇప్ప‌టికీ మించిపోలేదు!

ఖాతా నిరుప‌యోగంగా మారిన‌ట్టు ఎలా ప్ర‌క‌టిస్తారు. ఖాతాదారుల‌ను కాపాడుకోవ‌డానికి బ్యాంకులు చేసే ప్ర‌య‌త్నాలు ఏమిటి?

Published : 04 Feb 2021 16:07 IST

విక్ర‌మ్ త‌న కాలేజీ రోజుల్లో ఉప‌కార వేత‌నం పొందే నిమిత్తం స్టేట్ బ్యాంకులో ఖాతా తెరిచాడు. చ‌దువైపోయాక మంచి సంస్థ‌లో ఉద్యోగం సంపాదించాడు. కంపెనీవారు వేరొక బ్యాంకులో పొదుపు ఖాతా తెరిపించి దాంట్లో అత‌డి నెల‌వారీ వేత‌నాన్ని జ‌మ చేయ‌డం మొద‌లుపెట్టారు. విక్ర‌మ్‌కు ఇక త‌న కాలేజీ రోజుల్లో తెరిచిన ఖాతాతో ప‌నిలేకుండా పోయింది. దాన్ని వాడ‌కుండా అలాగే వ‌దిలేశాడు. కొన్ని రోజుల‌కు ఏదో ప‌నినిమిత్తం రూ.20వేల చెక్కును అందులో జ‌మ‌చేశాడు. మ‌రునాడు బ్యాలెన్స్ చెక్ చేసుకొని చూసుకుంటే రూ.18,500 మాత్ర‌మే ఉన్న‌ట్టు గుర్తించాడు. దీంతో విష‌యం ఏమిట‌ని బ్యాంకుకు వెళ్లి ఆరాతీస్తే … ఇన్ని రోజులు ఖాతాను వినియోగించ‌నందు వ‌ల్ల పెనాల్టీ వేసిన‌ట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇక చేసేదేమీ లేక విక్ర‌మ్ వెనుదిరిగాడు.

విక్ర‌మ్ లాంటి ప‌రిస్థితినే మ‌న‌లో చాలా మంది ఎదుర్కొని ఉంటారు. ఇలా నిరుప‌యోగంగా ఉన్న ఖాతాల సంఖ్య కోకొల్ల‌లుగా ఉన్న‌ట్టు ఓ స‌ర్వే ద్వారా వెల్ల‌డైంది.

రెండు సంవ‌త్స‌రాల పాటు అవ‌కాశం:
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోతే అటువంటి వాటిని ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా పరిగణిస్తారు. ఒక్కోసారి ఖాతాదారులు ఖాతా నంబరు కూడా మరిచిపోతూ ఉండొచ్చు. పదేళ్లపాటు ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాదారుల పేర్లు, చిరునామాలను వెబ్‌సైట్లలో ఉంచాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది

ఇన్ ఆప‌రేటివ్ అకౌంట్ల‌పై అవ‌గాహ‌న పెంచుకోండి:
ఆర్‌బీఐ ఇలాంటి ఇన్ ఆప‌రేటివ్ అకౌంట్ల విష‌యంలో కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలపై అవ‌గాహ‌న ఉంటే ఖాతాదారులు త‌మ త‌మ ఖాతాలు నిరుప‌యోగంగా మార‌కుండా జాగ్ర‌త్త ప‌డే అవ‌కాశం ఉంటుంది.

ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాల విషయంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలు:
ఒక సంవ‌త్స‌రంపాటు ఎలాంటి లావాదేవీలు జ‌ర‌ప‌ని ఖాతాలేమైనా ఉంటే అలాంటి వాటిని బ్యాంకులు స‌మీక్షిస్తాయి. ఇన్ని రోజులు ఎలాంటి లావాదేవీలు జ‌ర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణాల‌ను కోరుతూ సూచ‌న‌ప్రాయంగా లిఖిత రూపంలో ఖాతాదారుల‌కు తెలియ‌జేస్తారు. ఇది ఓ చిన్న రిమైండ‌ర్ లాంటిది.
ఖాతాదారుడు బ్యాంకు పంపించిన రాత‌పూర్వ‌క ప్ర‌తికి స్పందించ‌కుండా ఉన్న‌ట్ల‌యితే ఫోన్‌, ఈ మెయిల్ ద్వారా … అదీ కుద‌ర‌క‌పోతే ఖాతా తెరిచేట‌ప్పుడు సాక్షిగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తి ద్వారా సంప్ర‌దించేందుకు లేదా ఖాతాదారుడు ప‌నిచేసే చోట సంప్ర‌దించే ప్ర‌య‌త్నాల‌ను బ్యాంకులు చేస్తాయి. చేయాలి… కానీ వాస్త‌వానికి ప‌ని భారం వ‌ల్ల అన్ని ప‌నులు బ్యాంకు సిబ్బంది చేయ‌లేక‌పోతున్నారు.
సంవ‌త్స‌రంపాటు ఎలాంటి లావాదేవీలు జ‌రప‌కుండా ఉన్న ఖాతాను తిరిగి వాడుక‌లోకి తెప్పించే ప్ర‌య‌త్నాలు బ్యాంకులు చేస్తాయి. కొంత గ‌డువు ఇచ్చి ఖాతాను నిర్వ‌హించుకోవాల్సిందిగా సూచిస్తాయి. ఇచ్చిన గడువులోపు ఖాతాలను మళ్లీ పట్టించుకోకుండా వదిలేస్తే వాటిని ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా ప్రకటించే అవ‌కాశం ఉంది.
ఖాతాదారులకు పంపించే ఉత్తరాలు చేరకుండా వెనక్కి వస్తుంటే, చట్టబద్ధ వారసులు లేదా బంధువులు, స్నేహితుల ద్వారా ఖాతాదారుడి చిరునామా కోసం ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంది. రెండేళ్లపాటు పొదుపు ఖాతాలో ఖాతాదారుడి వైపు నుంచి లావాదేవీలు జరగకపోతే అలాంటి ఖాతాలను, ఇన్‌ఆపరేటివ్‌ అకౌంట్‌లుగా పరిగణించవచ్చు.
ఇన్ ఆప‌రేటివ్ ఖాతాలుగా ప్ర‌క‌టించాలంటే…
ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా ప్రకటించాల‌నుకుంటే… ఖాతాదారుడు చేసే డెబిట్‌, క్రెడిట్‌లను పరిగణలోకి తీసుకుంటారు. బ్యాంకు జమ చేసే వడ్డీ, వసూలు చేసే సేవా రుసుములను ఇన్ ఆప‌రేటివ్ ఖాతాగా పేర్కొనేందుకు ప‌రిగ‌ణించ‌రు. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ ఖాతాలో జమ అవడం, బీమా పాలసీ ప్రీమియం కోసం ఖాతాలో నుంచి డబ్బు డెబిట్‌ అవడం లాంటి థర్డ్‌ పార్టీ లావాదేవీలు సైతం ఖాతాదారుడు జరిపే లావాదేవీలే కిందికే వ‌స్తాయి. అప్పుడు స‌ద‌రు ఖాతాను ఇన్ ఆప‌రేటివ్‌గా మ‌లిచేందుకు ఆస్కారం త‌క్కువ‌. ఎటు తిరిగి ఖాతాదారుడిని కాపాడుకోవ‌డ‌మే బ్యాంకుల ల‌క్ష్యం.

భద్రతా చర్యలో భాగంగా ఒకవేళ ఖాతాను తాత్కాలికంగా ఇన్‌ఆపరేటివ్‌గా ప్రకటించినా, ఖాతా వర్గీకరణ ఆధారంగా నియమ నిబంధనల మేరకు ఖాతా కొనసాగింపుకై వీలు ఉంటుంది. ఇలా కొనసాగించే ముందు లావాదేవీ/ఖాతా కచ్చితత్వాన్ని, ఖాతాదారుడి వ్యక్తిగత గుర్తింపును నిర్ధారించి తదుపరి చర్యలు ఉంటాయి. ఈ విధమైన బ్యాంకు జాగ్రత్తల్లో భాగంగా ఖాతాదారుని ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని ఆర్‌బీఐ సూచ‌న‌.
పొదుపు ఖాతాలో లావాదేవీలు జ‌రిపినా, జ‌ర‌ప‌క‌పోయినా తగిన వడ్డీని మాత్రం బ్యాంకు తప్పనిసరిగా జమ చేయాలి.
పదేళ్లకు పైబడిన అన్‌క్లెయిమ్‌డ్‌ డిపాజిట్లు, ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలకు సంబంధించి, వారి పేరు, చిరునామాలను బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో పొందుపరచాల్సిందింగా ఆర్‌బీఐ సూచించింది. ఖాతా సంఖ్య, ఖాతా రకం, బ్రాంచి వంటి వివరాలు వెబ్‌సైట్లో పెట్టరాదు.

ఆర్‌బీఐ సూచించిన మేరకు బ్యాంకులన్నీ వెబ్‌సైట్‌ హోం పేజీలో ఫైండ్‌/సెర్చ్‌ ఆప్షన్‌తో కూడిన ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాల జాబితాను ఇవ్వాలి. పేరు టైప్‌ చేస్తే మనం చిరునామాతో కూడిన సమాచారాన్ని రాబట్టవచ్చు. తదుపరి ఖాతాను యాక్టివేట్‌ చేసుకోవాలనుకుంటే బ్యాంకు బ్రాంచిని సంప్రదించాలి.
ఖాతాదారులు ఇలా చేయండి:
మీరు ఏదైనా ఖాతాను నిరుప‌యోగంగా వాడ‌కుండా ఉన్న‌ట్లుగా గుర్తించి దాన్ని తిరిగి మ‌నుగ‌డ‌లోకి తెచ్చుకోవాలంటే వెంట‌నే మీ బ్యాంకును సంప్ర‌దించండి.
వీలైనంత వ‌ర‌కు ఒక‌టి లేదా రెండు బ్యాంకుల్లో ఖాతాల‌ను ఉంచుకుంటే స‌రిపోతుంది. మిగ‌తా వాటిని ర‌ద్దు చేసుకోవ‌డ‌మో , మూసివేయ‌డ‌మో మంచిది. ఇది మ‌న ఆర్థిక ఆరోగ్యానికి మంచిది. భ‌విష్య‌త్తులో క్రెడిట్ స్కోరు, రుణాల మంజూరులోనూ సానుకూలంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని