Coal : విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఆందోళకర స్థాయికి బొగ్గు నిల్వలు

దేశంలోని బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల్లో నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది....

Published : 27 Sep 2021 23:08 IST

దిల్లీ : దేశంలోని బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల్లో నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ‘సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం బొగ్గు నిల్వలు 2017 నవంబరు నాటి స్థాయికి చేరుకున్నాయి. దేశీయ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి వినియోగంలో 60 శాతం వాటా కలిగిన ప్లాంట్లలో నిల్వలు ఒక వారానికి మాత్రమే సరిపోయే స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. 

పరిస్థితి ఇలాగే ఉంటే అధిక ధరతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లేదంటే భారీ ఎత్తున విద్యుత్తు కోతలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అధిక ధరకు బొగ్గు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడితే.. ఛార్జీలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అధిక పెట్రోలియం ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఇది గుదిబండగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

కరోనా మహమ్మారి నుంచి పరిస్థితులు చక్కబడుతుండడంతో విద్యుత్తు గిరాకీ భారీ ఎత్తున పెరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బొగ్గు నిల్వలు వేగంగా తగ్గిపోయాయని పేర్కొన్నారు. జులైలో 10 శాతం, ఆగస్టులో 18 శాతం చొప్పున డిమాండ్‌ పెరిగిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని