China: జిన్‌పింగ్‌ దెబ్బకు రూ.2లక్షల కోట్లు కోల్పోయిన హువాంగ్‌!

బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఈ ఏడాది అత్యధిక సంపద కోల్పోయిన వారిలో ఈ-కామర్స్‌ వేదిక పిండోడో(పీడీడీ) వ్యవస్థాపకుడు కోలిన్‌ హువాంగ్‌ ముందున్నారు....

Published : 17 Sep 2021 23:10 IST

బీజింగ్‌: చైనాలోని టెక్‌ కంపెనీలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆంక్షల పేరిట కంపెనీలపై విరుచుకుపడుతోంది. ఆయా రంగాల్లో ప్రపంచంలోనే మేటి కంపెనీలుగా కొనసాగిన పలు సంస్థల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. దీంతో పలు కంపెనీల విలువ ఒక్కసారిగా పడిపోయింది.

బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఈ ఏడాది అత్యధిక సంపద కోల్పోయిన వారిలో ఈ-కామర్స్‌ వేదిక పిండోడో (పీడీడీ) వ్యవస్థాపకుడు కోలిన్‌ హువాంగ్‌ ముందున్నారు. హువాంగ్‌ 27 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) సంపదను కోల్పోయారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో ఉన్న 500 మందిలో అత్యధిక సంపదను కోల్పోయింది హువాంకేనే. స్టాక్‌ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు సైతం భారీగా పడిపోయాయి. పెద్ద కంపెనీలైన అలీబాబా, టెన్సెంట్‌ కంటే కూడా పీడీడీ అధికంగా నష్టపోయింది. అలీబాబా అమెరికా డిపాజిటరీ రిసీట్‌లు 33 శాతం తగ్గగా.. పీడీడీవి 44 శాతం తగ్గడం గమనార్హం. డిసెంబరులో పీడీడీ ఆన్‌లైన్‌ యూజర్ల సంఖ్య 78.8 కోట్లకు చేరింది.

పీడీడీ మార్కెట్‌ విలువ 178 బిలియన్‌ డాలర్ల నుంచి 125 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 35 బిలియన్ డాలర్ల వాటా కలిగిన హువాంగ్‌ గత ఏడాది సీఈఓగా తప్పుకున్నారు. ఈ మార్చిలో ఛైర్మన్‌ బాధ్యతలను కూడా వదులుకున్నారు. చైనాలో ఉన్న ఆర్థిక అసమానతల తగ్గింపునకు కృషి చేయాలన్న అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపు మేరకు అక్కడి టెక్‌ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే లాభాలను దాతృత్వ కార్యక్రమాలను వినియోగిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో 1.5 బిలియన్‌ డాలర్లను దేశంలో వ్యవసాయాభివృద్ధికి వెచ్చిస్తామని పీడీడీ గత నెల ప్రకటించింది. అలాగే 2.4 బిలియన్‌ డాలర్లు విలువ చేసే సేవలను ఆ కంపెనీ వ్యవస్థాప సభ్యులు ఓ ట్రస్టుకు కట్టబెట్టారు.

బ్లూమ్‌బెర్గ్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఈ ఏడాది అత్యధిక సంపదను కోల్పోయిన తొలి పది మందిలో ఆరుగురు చైనాకు చెందినవారే. బాటిల్డ్‌ వాటర్‌ కంపెనీ నోంగ్‌ఫూ స్ప్రింగ్‌ ఛైర్మన్‌ ఝోంగ్‌ శాన్‌శన్‌ 18 బి.డా, ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఎవర్‌గ్రాండే 10 బి.డా, టెక్‌ సంస్థ టెన్సెంట్‌ అధిపతి పోనీ మా 10 బి.డా, అలీబాబా సహవ్యవస్థాపకుడు జాక్‌ మా 6.9 బి.డా కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని