LPG: బండ బాదుడు.. రూ.2000 దాటిన వాణిజ్య సిలిండర్‌ ధర

దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు ఒకటో తేదీ షాకిచ్చాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరోసారి పెంచాయి. వాణిజ్య సిలిండర్‌పై రూ. 266 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి

Updated : 01 Nov 2021 11:08 IST

దిల్లీ: దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు ఒకటో తేదీ షాకిచ్చాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరోసారి పెంచాయి. వాణిజ్య సిలిండర్‌పై రూ. 266 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2000 దాటడం గమనార్హం. అయితే ఇళ్లల్లో ఉపయోగించే డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను పెంచకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది.

పెంచిన ధర నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. తాజా పెంపుతో వాణిజ్య సిలిండర్‌ ధర దిల్లీలో రూ.2000.5కు చేరగా.. ముంబయిలో రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో రూ.2133గా ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తుంటారు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా ప్రతి నెలా ఒకటి, 15వ తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి.

ఇదిలా ఉండగా.. అటు వంటగ్యాస్‌ ధరలను కూడా పెంచాలని చమురు సంస్థలు భావిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన దృష్ట్యా సిలిండర్‌పై రూ.100 మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ వంట గ్యాస్‌ ధర రూ.205 పెరిగి సిలిండర్‌ ధర రూ.1000కి చేరువైంది. గత నెల ఒకటో తేదీన కూడా వాణిజ్య సిలిండర్ ధరను పెంచి, ఆరో తేదీన డొమెస్టిక్‌ సిలిండర్‌పై వడ్డించారు. ఈ నేపథ్యంలో మళ్లీ బండ బాదుడు తప్పదేమోనని సామన్యులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్న వేళ వంటగ్యాస్‌ ధరలు మరింత కలవరపెడుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని