క్రెడిట్ కార్డుతో డబ్బులు తీస్తున్నారా? వ‌డ్డీ ఎంతో తెలుసా..?

మీ క్రెడిట్ కార్డ్‌తో న‌గ‌దు తీసుకుని భారీ వ‌డ్డీలు క‌ట్టే బ‌దులు వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవ‌డం మంచిది.

Updated : 08 Nov 2021 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్ కార్డులను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉప‌యోగించుకుంటే జీవిత ప్ర‌యాణం సాగిపోతుంటుంది. ఏ మాత్రం దుర్వినియోగం చేసినా, అలస‌త్వం ప్ర‌ద‌ర్శించినా మీ క్రెడిట్ స్కోర్ ప‌డిపోవ‌డ‌మే కాకుండా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు. ఎలాంటి రుణాలు మార్కెట్‌లో దొర‌క‌ని గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంటుంది. పేరుకు చిన్న ప్లాస్టిక్ కార్డే అయినా అనేక ఆర్థిక చికాకులు సృష్టిస్తుంది. ఇలాంటి ప‌రిస్థితులు నివారించ‌డానికి క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగిస్తున్న‌ప్పుడు మంచి ఆర్థిక అల‌వాట్ల‌ను పెంపొందించుకోవ‌డం చాలా ముఖ్యం. రుణం కోసం ప్ర‌య‌త్నించేట‌ప్పుడు వినియోగ‌దారుని క్రెడిట్ స్కోర్‌ను చూడ‌టం సాధార‌ణ విష‌య‌మే గానీ, ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసేటప్పుడు, అద్దెకు అపార్ట్‌మెంట్ తీసుకునేట‌ప్పుడు కూడా క్రెడిట్ స్కోర్‌ను స‌మీక్షించే అవ‌కాశాలున్నాయి. ఇది మీ ఆర్థిక ప్రవర్తనను అంచ‌నా క‌ట్ట‌డానికి కూడా కార‌ణం కావ‌చ్చు. క్రెడిట్ కార్డులు సౌక‌ర్య‌వంతంగా ఉన్న‌ప్ప‌టికీ, మీ ఖ‌ర్చుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బేరీజు వేసుకోవ‌డం ముఖ్యం.

ప్ర‌తి నెలా క్రెడిట్ కార్డు బిల్లు క‌ట్టేటప్పుడు క‌నీస మొత్తం 5% క‌ట్టేలా ఆప్ష‌న్ ఉంటుంది. అయితే 5% క‌ట్టేసి మిగ‌తా మొత్తం త‌ర్వాత చెల్లించే ప‌ద్ధతి స‌రికాదు. బ‌కాయి ఉన్న క‌నీస మొత్తాన్ని చెల్లించ‌డం ద్వారా నెల‌నెలా బ్యాలెన్స్‌ను కొన‌సాగించే అల‌వాటు చేసుకోకూడ‌దు. వ్య‌క్తిగ‌త రుణాల‌తో పోలిస్తే క్రెడిట్ కార్డ్ వ‌డ్డీ రేట్లు చాలా ఎక్కువ‌. మిగ‌తా మొత్తానికి 35-40% వ‌డ్డీ వినియోగ‌దారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాకీ పెద్ద మొత్తంగా పెరిగిపోతుంది. ఈ వ‌డ్డీ రేటు బ్యాంకును బ‌ట్టీ ఉంటుంది.

క్రెడిట్ కార్డ్‌తో న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ
క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారులు చేసే మ‌రో ప్ర‌ధాన త‌ప్పు క్రెడిట్ కార్డును ఉప‌యోగించి ఏటీఎంలో నగదు తీయడం. నగదు విత్‌డ్రా చేసిన రోజు నుంచే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉప‌సంహ‌రించుకునే న‌గ‌దు మొత్తాన్ని బ‌ట్టి చాలా బ్యాంకులు అడ్వాన్స్ విత్‌డ్రా ఫీజుగా పెద్ద మొత్తంలో వ‌సూలు చేస్తారు. దీనిపై నెల‌కు 2.5% నుంచి 3% వడ్డీగా వసూలు చేస్తారు. న‌గ‌దు తీసుకునే రోజు నుంచి రుణ‌గ్ర‌హీత మొత్తాన్ని తిరిగి చెల్లించే వ‌ర‌కు ఈ మొత్తం ఛార్జ్ చేస్తారు. అందువ‌ల్ల‌, క్రెడిట్ కార్డ్‌తో న‌గ‌దు విత్‌డ్రా చేయడం ఎప్పుడూ మంచిది కాదు. మీ ద‌గ్గ‌ర త‌గినంత న‌గ‌దు లేన‌ప్పుడు త‌క్ష‌ణ లేదా అత్య‌వ‌స‌ర ఖ‌ర్చుల కోసం, మీ క్రెడిట్ కార్డ్‌తో న‌గ‌దు తీసుకుని భారీ వ‌డ్డీలు క‌ట్టే బ‌దులు వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవ‌డం మంచిది. దీనిపై సంవ‌త్స‌రానికి వ‌డ్డీ 10-14% వ‌ర‌కు ఉంటుంద‌ని నిపుణులు తెలిపారు.

క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తి
అదేవిధంగా, మీరు మీ క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తిని నిర్దిష్ట ప‌రిమితిలో ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. మీరు ప‌రిమితిని ఉల్లంఘించిన ప్ర‌తిసారీ, మీ క్రెడిట్ స్కోర్ 2 పాయింట్లు ప‌డిపోతుంది. అందువల్ల ఈ ప‌రిమితి లోపు ఖ‌ర్చుల‌ను ప‌రిమితం చేయాలి. ఒక‌వేళ త‌ర‌చుగా ఈ వినియోగ నిష్ప‌త్తిని ఉల్లంఘిస్తే, మీ ప‌రిమితిని పెంచాలని క్రెడిట్ కార్డ్ జారీదారుడిని అభ్యర్థించండి. లేదా మ‌రో బ్యాంక్‌ నుంచి కొత్త క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.

క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల రుణగ్ర‌హీత‌లుగా ఉన్నంత‌కాలం క్రెడిట్ కార్డులను ఉప‌యోగించ‌డంలో త‌ప్పు లేదు. క్రెడిట్ కార్డులను ఆలోచ‌నాత్మ‌కంగా ఉప‌యోగించ‌డం ద్వారా ఆరోగ్య‌క‌ర‌మైన ఆర్థిక అల‌వాట్ల‌ను పెంపొందించుకోగ‌లుగుతారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను నివారించ‌డం చాలా అవ‌స‌రం. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల్ల ఆర్థిక ల‌క్ష్యాల‌ను సుల‌భంగా చేరుకోగ‌ల‌గుతారు. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవ‌డంతో పాటు క్రెడిట్ కార్డులతో వ‌చ్చే రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్‌, ప్ర‌ధాన కొనుగోళ్ల‌పై నో-కాస్ట్ ఈఎంఐలు వంటి కొన్ని ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని