Price Hike: గృహోపకరణాల ధరలు 5-10% ప్రియం!

ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి మన్నికగల వినియోగ వస్తువుల (Consumer durables) ధరలు  కొత్త సంవత్సరంలో పెరిగాయి....

Published : 09 Jan 2022 18:05 IST

ముడిపదార్థాల ధరల పెరుగుదల నేపథ్యంలో సీఈఏఎంఏ అంచనా

దిల్లీ: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి మన్నికగల వినియోగ వస్తువుల (Consumer durables) ధరలు  కొత్త సంవత్సరంలో పెరిగాయి. ముడిపదార్థాల ధరలు, రవాణా ఛార్జీలు పెరగడంతో ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయడమే ఇందుకు కారణం. అదే బాటలో మార్చి నాటికి వాషింగ్‌ మెషీన్ల వంటి గృహోపకరణాల (Home Appliances) ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటి ధరలు దాదాపు 5-10 శాతం ప్రియం కావొచ్చని తెలిపాయి.

ప్యానాసోనిక్‌, ఎల్‌జీ, హైయర్‌ వంటి సంస్థలు ఇప్పటికే ధరల్ని పెంచాయి. సోనీ, హిటాచీ, గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ ఈ త్రైమాసికం చివరి నాటికి ఆ దిశగా నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయని ‘కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, అండ్‌ అప్లయన్సెస్‌ మానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (CEAMA)’ అంచనా వేసింది. పండగ సీజన్ నేపథ్యంలో పరిశ్రమలు ధరల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చాయని సీఈఏఎంఏ అధ్యక్షుడు ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు. నిర్వహణ ఖర్చులు, రవాణా ఛార్జీలు, ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచడం మినహా కంపెనీలకు మరో మార్గం లేదని పేర్కొన్నారు. వివిధ రకాల ఉపకరణాల్లో ఉపయోగించే ప్లాస్టిక్‌, లోహాల ధరలు దాదాపు 70 శాతం వరకు పెరిగాయి.

ఒకవేళ డిమాండ్‌ పడిపోయి.. ముడి పదార్థాల ధరలు తగ్గితే ఏప్రిల్‌, మే నెలల్లో తిరిగి ధరల్ని తగ్గించే అవకాశం ఉందని బ్రగాంజా తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడి.. సరఫరా గొలుసులో ఉన్న ఇబ్బందులు తొలగిపోతే కమొడిటీల ధరల స్థిరీకరణ ఉంటుందని అంచనా వేశారు. అదే జరిగితే కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ ధరలు దిగి వచ్చే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని