SBI Debit Card-EMI: ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు చెల్లింపుని ఇలా ఈఎంఐగా మార్చుకోండి!

ఎస్‌బీఐ కార్డు ద్వారా చేసే చెల్లింపులను ఇకపై ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం!

Updated : 07 Sep 2021 12:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి వరకు కేవలం క్రెడిట్‌ కార్డు బిల్లులను మాత్రమే ఈఎంఐ కిందకు మార్చుకునే అవకాశం ఉండేది. అయితే, ఇప్పుడు చాలా బ్యాంకులు డెబిట్‌ కార్డు ద్వారా చేసే చెల్లింపులను కూడా ఈఎంఐగా మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కూడా తన ఖాతాదారులకు ఈ సదుపాయం కల్పిస్తోంది. స్టోర్లలోనే కాకుండా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో చేసే కొనుగోళ్లను కూడా డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి.. ఆ మొత్తాన్ని ఈఎంఐ కిందికి మార్చుకోవచ్చు.

డెబిట్ కార్డు చెల్లింపులను ఈఎంఐగా మార్చుకునే ప్రక్రియ...

మర్చంట్ స్టోర్ వద్ద పివోఎస్ మెషీన్‌పై ఎస్‌బీఐ డెబిట్ కార్డును స్వైప్ చేయండి.

ఇప్పుడు బ్రాండ్ ఈఎమ్ఐ - బ్యాంక్ ఈఎంఐ అనే ఆప్షన్ ఎంచుకోండి.

మీకు కావాల్సిన మొత్తం, కాలపరిమితి రెండూ ఎంచుకోండి.

పీఓఎస్‌ మెషీన్‌ మీ అర్హతను చెక్‌ చేసిన తర్వాత పిన్‌ అడుగుతుంది. ఎంటర్‌ చేయండి

ఇప్పుడు ఆ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది.

•  నిబంధనలు, షరతులు ఉన్న ఛార్జ్ స్లిప్ ప్రింట్ వస్తుంది. దాని మీద కస్టమర్ సంతకం చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ చెల్లింపులు ఈఎంఐగా మార్చుకునే ప్రక్రియ..

బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబరు సహాయంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లాగిన్ అవ్వండి.

నచ్చిన వస్తువు ఎంపిక చేసుకొని పేమెంట్‌పై క్లిక్‌ చేయండి.

పేమెంట్ ఆప్షన్ల నుంచి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోండి.

తర్వాత ఎస్‌బీఐ ఎంచుకోండి.

రుణ కాలపరిమితి ఎంచుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి.

ఎస్‌బీఐ లాగిన్ పేజీ వస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు వివరాలు నమోదు చేయండి.

రుణానికి ఆమోదం లభిస్తే వెంటనే మీ ఆర్డర్‌ బుక్‌ అవుతుంది.

ఎంత రుణం.. వడ్డీరేటు

తొలుత రుణం తద్వారా దాన్ని ఈఎంఐ కిందకు మార్చుకునే ప్రక్రియలో మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పత్రాలు కూడా సమర్పించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ ఖాతాదారులు రూ.8,000 నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని పొందవచ్చు. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ (7.20 శాతం) + 7.50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం వడ్డీరేటు అనేది 14.70శాతానికి చేరుతుంది. అయితే, కొన్ని బ్రాండ్లు ‘కన్జూమర్‌ డ్యూరబుల్‌ ప్రోడక్ట్స్‌’పై ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈఎంఐల కాలపరిమితి 6, 9, 12, 18 నెలలుగా ఉంది. మన సామర్థ్యాన్ని బట్టి ఏదైనా ఎంచుకోవచ్చు.

మీరు అర్హులేనా ఇలా తెలుసుకోండి..

మీరు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు అర్హులో.. కాదో.. తెలుసుకోవడానికి కస్టమర్లు బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానం చేసిన మొబైల్ నెంబరు నుంచి DCEMI అని టైప్‌ చేసి 567676కు పంపాలి.

షరతులు..

మీ రుణపరిమితికి లోబడి ఒక త్రైమాసికంలో కేవలం మూడు లావాదేవీలు చేయాల్సి ఉంటుంది.

రూ.రెండు నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు.

సక్రమంగా చెల్లింపులు చేయకపోతే.. ప్రతినెలా అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేస్తారు.

ఒకవేళ ఈఎంఐ ఆప్షన్‌ని రద్దు చేసుకోవాలనుకుంటే.. మర్చంట్‌ ఆమోదం తప్పనిసరి. అలాగే ఆరోజు ముగిసే నాటికి లేదా వ్యాపారి లావాదేవీని సెటిల్‌ చేయడానికి ముందే రద్దు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని